జవాన్ రాజకీయంగానూ కాక పుట్టిస్తోందా?
వ్యవసాయ బిల్లుల రద్దు తర్వాత కూడా భారతదేశంలోని రైతుల ఆత్మహత్యల వంటి ముఖ్యమైన సమస్యలను సినిమాలో ప్రస్తావించారు
By: Tupaki Desk | 9 Sep 2023 7:33 AM GMTషారుక్ ఖాన్ కథానాయకుడిగా నటించిన 'జవాన్' బాక్సాఫీస్ ని వసూళ్లతో షేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. 'పఠాన్' తర్వాత షారుక్ ఖాతాలో వెంటనే మరో విజయం జమ అయింది. దీంతో షారుక్ ఆనందానికి అవదుల్లేవ్. గతంలో వరుస పరాజయాలు ఇప్పుడు వరుసగా విజయాలతో షారుక్ సహా అభిమానులంతా సంబరాలు చేసుకుంటున్నారు. అయితే 'జవాన్' రాజకీయంగానూ దుమారం రేపుతోన్న సంగతి ఆలస్యంగా వెలుగులో వస్తోంది.
2023 లో అత్యంత రాజకీయంగా అభియోగాలు తెరపైకి వచ్చిన చిత్రంగా హైలైట్ అవుతోంది. జవాన్ కి కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ రంగు పులుముతున్నాయి. 'జవాన్' ఏ రాజకీయ పార్టీని లక్ష్యంగా చేసుకోనప్పటికీ, కొంతమంది బిజెపి మద్దతుదారులు సినిమాని వ్యతిరేకిస్తున్నారు. ఇది రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతోంది. దీంతో విపక్షాలు అధికార పార్టీ అసమర్ధతని తెలియజేసే సినిమా అంటూ కొత్త రంగు పులిమే ప్రయత్నాలు పొలిటికల్ మార్కెట్ లో జరుగుతున్నాయి.
వ్యవసాయ బిల్లుల రద్దు తర్వాత కూడా భారతదేశంలోని రైతుల ఆత్మహత్యల వంటి ముఖ్యమైన సమస్యలను సినిమాలో ప్రస్తావించారు. అలాగే నాసిరకం ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల గురించి చూపించారు. ముఖ్యంగా కోవిడ్-19 వేవ్ సమయంలో ఆక్సిజన్ కొరత కారణంగా ప్రభుత్వ ఆసుపత్రులలో పిల్లల విషాద మరణాలు వంటివి అధికార పార్టీకి ఎక్కడో గుచ్చుకున్నట్లే అనిపించింది.
అలాగే విజయ్ సేతుపతి పాత్ర వ్యాపారవేత్తలకు మరియు ప్రభుత్వానికి మధ్య సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఇది పెద్ద మొత్తంలో డబ్బును మోసం చేసి పరారీ అయిన విజయ్ మాల్యా మరియు నీరవ్ మోడీ వంటి వ్యక్తులను గుర్తు చేస్తుంది. ఇలా కొన్ని వివావాదస్పద అంశాలు సినిమా రూపంలో కొందరిపై గట్టిగానే పంచ్ పడిందని విపక్షాలు సంబర పడుతున్నాయి. గతంలో అట్లీ తమిళ్ లో తెరకెక్కించిన సినిమాలు రాజకీయంగా వివాదాలు ఎదుర్కున్నాయి. రాష్ట్రంలో కొన్ని రకాల సమస్యల్ని తన సినిమా ద్వారా చెప్పే ప్రయత్నంపై అప్పట్లో అట్లీ వివాదాస్పదం అయ్యాడు. ఇప్పుడు ఏకంగా దేశ రాజకీయాల్లో అట్లీ కుదిపేస్తున్నాడు.