Begin typing your search above and press return to search.

పార్ల‌మెంట్‌లో భ‌ర్త పేరుతో పిలిచినందుకు జ‌యా బ‌చ్చ‌న్ సీరియ‌స్!

హరివంశ్ స్వ‌యంగా త‌న‌ను మాట్లాడటానికి పిలిచినప్పుడు జయ తీవ్రంగా స్పందించారు. నన్ను జయ బచ్చన్ అని పిలిస్తే సరిపోయేది

By:  Tupaki Desk   |   30 July 2024 5:05 AM GMT
పార్ల‌మెంట్‌లో భ‌ర్త పేరుతో పిలిచినందుకు జ‌యా బ‌చ్చ‌న్ సీరియ‌స్!
X

సోమవారం రాజ్యసభలో జరిగిన చ‌ర్చా వేదిక‌లో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ తనను ''శ్రీమతి జయ అమితాబ్ బచ్చన్'' అని సంబోధించడంపై నటి-రాజకీయ నాయకురాలు జయా బచ్చన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన భర్త పేరుతో సంబంధం లేకుండా తనకంటూ గుర్తింపు ఉంటుందని సీనియ‌ర్ న‌టీమ‌ణి పార్ల‌మెంట్‌లో గుర్తు చేశారు. ఒక విధంగా ఆమె సీరియ‌స్ అయ్యారు.

హరివంశ్ స్వ‌యంగా త‌న‌ను మాట్లాడటానికి పిలిచినప్పుడు జయ తీవ్రంగా స్పందించారు. నన్ను జయ బచ్చన్ అని పిలిస్తే సరిపోయేది. పేరును ఇలా అమితాబ్ ని జోడించి అధికారికంగా నమోదు చేయ‌డాన్ని ఎత్తి చూపుతూ ఈ విధానంపై జ‌యాజీ తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. మహిళలను తమ భర్త పేరుతోనే పిలవాలని కొత్త పద్ధతి ఉద్భవించింది. మహిళలకు గుర్తింపు లేదు. వారికి విజయాలు లేవు.. వారికి సొంత గుర్తింపు లేదు.. అంటూ సీరియ‌స్ గా స్పందించారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్‌ను 'జయా అమితాబ్ బచ్చన్' అని పిలవడంతో రాజ్యసభలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే అక్క‌డ పేర్ల జాబితాలో త‌న పేరు అలా రాసి ఉంది. ఇది స‌మ‌స్య‌కు కార‌ణ‌మైంది.

ఈ సంఘటన తాలూకా వీడియో ఆన్‌లైన్‌లో వేగంగా వైర‌ల్ అయింది. చాలామంది నెటిజ‌నులు జ‌యాజీ వైఖరిని ప్రశంసించారు. ఒక అభిమాని త‌న‌ ధైర్యాన్ని మెచ్చుకోగా, మరొకరు ఆమె అనుమతి లేకుండా అమితాబ్ పేరును ఎందుకు చేర్చారని ప్రశ్నించారు. అమితాబ్ బచ్చన్‌ను వివాహం చేసుకునే ముందు జయ విజయవంతమైన నటి అని కూడా ఒక నెటిజ‌న్ స‌మ‌ర్థించారు. 'ఆమె ఏ కోణంలోనూ తప్పు కాదు' అని వ్యాఖ్యానించారు.

ఈ ఎపిసోడ్ పబ్లిక్, ప్రొఫెషనల్ రంగాలలో మహిళల గుర్తింపు గురించి చర్చలకు తెర‌తీసింది. జ‌యా బ‌చ్చ‌న్ మనవరాలు నవ్య నవేలి నంద గతంలో జయను తన స్ఫూర్తిగా అభివర్ణించింది. అమ్మమ్మ శక్తి, స్వ‌తంత్ర ఆలోచ‌న‌ల‌ను న‌వ్య ఆ ఇంట‌ర్వ్యూలో హైలైట్ చేసింది. 2021లో ఓ ఇంటర్వ్యూలో నవ్య న‌వేళి మాట్లాడుతూ..''అమ్మ‌మ్మ తన సొంత‌ గుర్తింపును సృష్టించుకోగలిగిన వ్యక్తి. తనదైన ముద్ర వేసారు. త‌నంటే నాకు గౌర‌వం దేనికి అంటే.. తాను ఇష్ట‌ప‌డే వాటి కోసం తన బ‌ల‌మైన‌ వాయిస్‌ని ఎలా ఉపయోగిస్తుందో అదే త ప్ర‌త్యేక‌త‌. ఆమె ఎప్పుడూ చాలా నిరాడంబరంగా ఉంటుంది. ఫిల్ట‌ర్ లెస్ గా మాట్లాడుతుంది'' అని వ్యాఖ్యానించింది.