అనగనగా ఆకాశం ఉంది... గొంతు మూగబోయింది
మొత్తం జయచంద్రన్ 16000 పాటలను పాడినట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
By: Tupaki Desk | 10 Jan 2025 7:36 AM GMTనువ్వే కావాలి సినిమాలోని అనగనగా ఆకాశం ఉంది, సుస్వాగతం సినిమాలోని హ్యాపీ హ్యాపీ బర్త్‌డేలు సాంగ్‌తో పాటు ఇంకా ఎన్నో పాటలు పాడి తెలుగు ప్రేక్షకులను అలరించిన ప్రముఖ గాయకుడు పి జయచంద్రన్ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన గురువారం రాత్రి సమయంలో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు అధికారికంగా పేర్కొన్నారు. కేరళకు చెందిన జయ చంద్రన్ హిందీ, తెలుగు, తమిళ్, కన్నడం, మలయాళం ఇలా అన్ని భాషల్లోనూ పాటలు పాడారు. మొత్తం జయచంద్రన్ 16000 పాటలను పాడినట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
కేరళలోని త్రిసూర్‌లో ఉన్న ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నాడు. 1980 నుంచి సినిమాల్లో పాడుతూ వచ్చిన జయచంద్రన్ ఎన్నో సూపర్ హిట్ పాటలను పాడారు. పలువురు సంగీత దర్శకుల వద్ద ఆయన పాటలను పాడారు. జయచంద్రన్ ఎక్కువగా ఇళయరాజా, రాజ్-కోటి, ఎంఎం కీరవాణి, వందేమాతరం శ్రీనివాస్ వంటి ప్రముఖ సంగీత దర్శకుల సంగీత దర్శకత్వంలో పాటలు పాడారు. ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న జయచంద్రన్‌కి రావాల్సిన గుర్తింపు రాలేదు అంటూ కొందరు ఆయన ప్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు.
యేసుదాసు గాత్రంను పోలి ఉంటుందని కొందరు జయచంద్రన్ గాత్రం గురించి మాట్లాడుకునే వారు. జయచంద్రన్ పాడిన పాట విన్న వెంటనే ఎక్కువ శాతం మంది ఆ పాటను యేసుదాసు పాడి ఉంటాడు అని అనుకునే వారు. అలాంటి గాత్రంతో వేల కొద్ది పాటలు పాడిన ఆయన మరణించడం సంగీత ప్రపంచానికి పెద్ద లోటు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తమ నేపథ్య గాయకుడిగా పలు అవార్డులను అందుకున్న జయచంద్రన్ మలయాళ మూవీ శ్రీనారాయణ గురు చిత్రానికి గాను ఉత్తమ నేపథ్య గాయకుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు.
జాతీయ అవార్డుతో పాటు కేరళ రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక పురస్కారంను ఐదు సార్లు అందుకుని అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నారు జయచంద్రన్. వేల సంఖ్యలో పాటలు పాడిన జయ చంద్రన్ బుల్లి తెరపైనా పలు సార్లు కనిపించారు. జయచంద్రన్ మృతి పట్ల మలయాళ సినీ ప్రముఖులతో పాటు దాదాపు అన్ని భాషల సినీ ప్రముఖులు, అభిమానులు నటీ నటులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.