విశాల్ హెల్త్ పై స్పందించిన స్టార్ హీరో
విశాల్ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లు నిజం కాదని వైద్యులు స్వయంగా హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు.
By: Tupaki Desk | 10 Jan 2025 6:59 AM GMTతమిళ్ స్టార్ హీరో విశాల్ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. డెంగ్యూతో పాటు వైరల్ ఫీవర్ కారణంగా తీవ్రమైన ఒల్లు నొప్పులు, ఇతర సమస్యలతో బాధపడుతున్నాడు. ఇటీవల ఆయన 'మదగజరాజ' సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియా ముందుకు వచ్చారు. ఆ సమయంలో విశాల్‌ను చూసి చాలా మంది షాక్ అయ్యారు. బాబోయ్ విశాల్ ఇలా అయ్యాడేంటి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విశాల్ కనీసం చేతిలో మైక్ పట్టుకోలేక పోతున్నారు. చేతులు బాగా వణుకుతున్నాయి, ఎక్కువ సమయం నిల్చోడానికి కూడా అతడికి సాధ్యం కాలేదు. దాంతో విశాల్ ఆరోగ్యం గురించి ఎవరికి తోచిన విధంగా వారు పుకార్లు పుట్టిస్తున్నారు.
విశాల్ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లు నిజం కాదని వైద్యులు స్వయంగా హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. హెల్త్ బులిటెన్‌లో వైరల్ ఫీవర్‌తో విశాల్ బాధ పడుతున్నట్లుగా పేర్కొన్నారు. ఇటీవల విశాల్ హెల్త్ గురించి ప్రముఖ నటి కుష్బూ స్పందించారు. ఆమె మాట్లాడుతూ విశాల్ తీవ్రమైన జ్వరంతో బాధ పడుతున్నారు. అయితే తన సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనాలి అనే ఉద్దేశ్యంతో ఆయన వచ్చారు. కానీ జ్వరం తీవ్రత నేపథ్యంలో ఈవెంట్ జరిగిన వెంటనే నేరుగా విశాల్‌ని ఆసుపత్రికి తీసుకు వెళ్లినట్లుగా ఆమె తెలియజేశారు. తాజాగా విశాల్ ఆరోగ్య పరిస్థితిపై తమిళ్ స్టార్ హీరో జయం రవి స్పందించాడు.
ఇటీవల ఒక సినిమా ప్రమోషన్‌లో భాగంగా జయం రవి మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశాల్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. విశాల్ మంచి వ్యక్తి. ఇండస్ట్రీలోనే కాకుండా బయట కూడా చాలా మందికి సేవ చేశాడు. ఎంతో మందికి సహాయం అందించాడు. ప్రస్తుతం ఆయనకు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో బ్యాడ్ టైమ్ వస్తుంది. అయితే ఆ బ్యాడ్ టైమ్ నుంచి త్వరలోనే విశాల్ బయట పడుతాడని నమ్మకం వ్యక్తం చేశాడు. తిరిగి సాధారణ స్థితికి వచ్చి విశాల్ అభిమానులను తన సినిమాలతో అలరిస్తాడని జయం రవి ఆకాంక్షించాడు.
విశాల్ నటించిన మదగజరాజ సినిమా 11 ఏళ్ల క్రితం విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఆ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధం చేశారు. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయబోతున్నారు. ఆ సినిమా విడుదల నేపథ్యంలో ప్రమోషనల్ ఈవెంట్‌లో విశాల్ కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు. విశాల్ ఈ ఏడాదిలో ఇంకా కొత్త సినిమాను మొదలు పెట్టలేదు. ఈ ఏడాది మరో సినిమాతో విశాల్ రాకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.