Begin typing your search above and press return to search.

ఆల‌స్యానికి శిక్ష‌.. అర‌గంట పాటు ఒంటికాలిపైనే న‌టి!

ఆ త‌ర్వాత‌ డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌తో పలు డ్యాన్స్ రిహార్సల్స్ జరిగాయి. ఒక సందర్భంలో జయప్రద 103 డిగ్రీల ఉష్ణోగ్రతతో జ్వరంతో అస్వస్థతకు గురయ్యారు.

By:  Tupaki Desk   |   5 April 2024 9:30 AM GMT
ఆల‌స్యానికి శిక్ష‌.. అర‌గంట పాటు ఒంటికాలిపైనే న‌టి!
X

త‌న‌దైన అందం అభిన‌యం నృత్యక‌ళ‌తో ప్ర‌జ‌ల హృద‌యాల్లో శాశ్వ‌తంగా నిలిచిన మేటి క‌థానాయిక జ‌య‌ప్ర‌ద‌. కేవలం 14 సంవత్సరాల వయస్సులో బాల‌ నటిగా వృత్తిని ప్రారంభించింది. దర్శకుడు కె బాలచందర్ తెర‌కెక్కించిన 'అంతులేని కథ' చిత్రంలో అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. కె. విశ్వనాథ్ తెర‌కెక్కించిన క‌ళాత్మ‌క చిత్రం 'సిరి సిరి మువ్వ' త‌న‌లోని అసాధారణమైన నృత్య సామర్ధ్యాలను ఆవిష్క‌రించింది. ఈ చిత్రంలో మూగ అమ్మాయిగా జ‌య‌ప్ర‌ద న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు నీరాజ‌నాలు ప‌లికారు. భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం 'సీతా కళ్యాణం'లో సీత అనే టైటిల్ పాత్రను పోషించి త‌న‌లోని బహుముఖ ప్రజ్ఞను ఆవిష్క‌రించింది. 'సర్గమ్‌'లో రిషి కపూర్ స‌ర‌స‌న‌ హిందీ సినిమా రంగ ప్రవేశం చేసింది.

దూరదర్శన్‌కి ఇచ్చిన పాత ఇంటర్వ్యూలో జయప్రద తనకు ఎదురైన అత్యంత భయంకరమైన షూటింగ్ అనుభవాన్ని వెల్లడించింది. అది 1981లో కె బప్పయ్య దర్శకత్వం వహించిన 'అగ్ని పూలు' సినిమా చిత్రీకరణ సమయంలో జరిగింది. అదే పేరుతో ఉన్న యద్దనపూడి సులోచనా రాణి నవల నుండి స్వీకరించిన క‌థ‌తో ఈ చిత్రం తెర‌కెక్కింది. వి శాంతారామ్ 'జల్ బిన్ మచ్లీ నృత్య బిన్ బిజిలీ' నుండి కూడా ప్రేరణ పొందింది. ఈ సినిమాలోని ఓ పాటలో పాములా (స్నేక్) డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. కె బప్పయ్య ఆమెను అస‌లు నీకు నృత్యం చేయడం వచ్చా? అని కోప‌గించుకున్నారు. ఇది జయప్రదను బాధించింది. ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.

ఆ త‌ర్వాత‌ డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌తో పలు డ్యాన్స్ రిహార్సల్స్ జరిగాయి. ఒక సందర్భంలో జయప్రద 103 డిగ్రీల ఉష్ణోగ్రతతో జ్వరంతో అస్వస్థతకు గురయ్యారు. దాని కారణంగా ఆమె రిహార్సల్స్‌కు ఐదు నిమిషాలు ఆలస్యంగా చేరుకుంది. కొరియోగ్రాఫర్ త‌న‌పై పిచ్చి కోపంగా ఉన్నాడు. ఆలస్యానికి శిక్షగా అరగంట పాటు ఒంటికాలిపై నిలబెట్టాడు. జ‌య‌ప్ర‌ద‌ ఏడవడం ప్రారంభించ‌గా, చివరికి కొరియోగ్రాఫర్ నిజంగానే అనారోగ్యంతో ఉందని గ్రహించార‌ట‌. కానీ ఇది వ‌ర్క‌వుటైంది. ఎందుకంటే రోజు ముగిసేప్ప‌టికి సినిమా బాగా వచ్చింది. ప్రజలు నన్ను ప్రశంసించారు.. అని జ‌య‌ప్ర‌ద‌ ఇంటర్వ్యూలో చెప్పింది.

జయప్రద హిందీ, బెంగాలీ, మరాఠీ చిత్రాలతో పాటు అన్ని దక్షిణ భారత భాషా చిత్రాలలో నటించింది. చివరిసారిగా మలయాళ చిత్రం రామచంద్ర బాస్ & కోలో కనిపించింది. ఈ చిత్రం గత సంవత్సరం విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. జ‌య‌ప్ర‌ద ఇటీవ‌ల రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్నారు. ఇటీవ‌ల త‌న‌ను కొన్ని కోర్టు వివాదాలు చుట్టు ముట్టిన సంగ‌తి తెలిసిందే.