అందగాడి ముందు హీరోయిన్ల బోయ్ ప్రెండ్ కహానీలు!
పాతతరం నటీనటుల మధ్య బాండింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అంతా కలిసి మెలిసి పనిచే సేవారు
By: Tupaki Desk | 28 Feb 2024 5:30 PM GMTపాతతరం నటీనటుల మధ్య బాండింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అంతా కలిసి మెలిసి పనిచే సేవారు. హీరో అనే ఇమేజ్ తో ప్రత్యేకంగా ఉండటం అంటూ ఉండేది కాదు. హీరో..హీరోయిన్..ఇతర నటీన టులు షూటింగ్ అంతా ఓ పండగ వాతావరణంలో పూర్తి చేసుకుని వచ్చేవారు. ఔట్ డోర్ షూటింగ్ లు అయితే మరింత సరదాగా జరిగేవి. వంట వార్పు...అన్నీ అందరికీ సమానంగా ఉండేది.
ప్రత్యేకంగా స్టార్ హోటళ్ల నుంచి తెప్పించే ఇప్పటికీ కహానీలేవి అప్పట్లో ఉండేవి కాదు. అలా అంతా కలిసి మెలిసి పనిచేయడంతో నటీనటుల మధ్య స్నేహభావం బలంగా ఉండేది. తాజాగా ఆనాటి పాత జ్ఞాపకాల్ని సహజ నటి జయసుధ మరోసారి గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రా అందగాడు శోభన్ బాబు తో హీరోయిన్లు ఎలా ఉండేవారు? అన్న సంగతులు పంచుకున్నారు. అవేంటో ఆమె మాటల్లోనే..` అప్పట్లో రాఘవేంద్రరావు గారు-నారాయణరావు గారు స్టార్ డైరెక్టర్స్.
రాఘవేంద్రరావుగారి సెట్లో చాలా సరదాగా ఉండేది. అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ షాట్ రెడీ అనగానే వర్క్ లో పడిపోయేవాళ్లం. కానీ దాసరి గారితో అలా ఉండేది కాదు. ఆయన సెట్లో ఇతర విషయాల డిస్కషన్ రాకూడదు. అలా వస్తే ఆయన సీరియస్ అయ్యేవారు. జోకులు వేయకూడదు. చాలా సీరియస్ గా పని తప్ప మరో ఆలోచన ఉండకూడదు. అప్పట్లో కృష్ణగారు - శోభన్ బాబు ఇద్దరూ చాలా హ్యాండ్సమ్.
కృష్ణగారు ఎక్కువగా మాట్లాడేవారు కాదు కానీ శోభన్ బాబుగారు అందరితో సరదాగా కబుర్లు చెప్పేవారు. అప్పటి హీరోయిన్లు చాలా మంది తమ వ్యక్తిగత విషయాలు శోభన్ బాబుతో పంచుకునేవారు. అందులో బోయ్ ప్రెండ్ విషయాలు కూడా ఉండేవి. అప్పుడాయన సరదాగా మీ హీరోను నేను కాదా? అనే వారు. మీరంతా నా దగ్గరే మీ బోయ్ ప్రెండ్ గురించి చెబితే నేనెంత ఫీలవుతాను అని నవ్వేవారు` అని ఆనాటి విషయాలు గుర్తు చేసుకున్నారు.