జిగర్ తండ 2 ఆ హీరో చేసి ఉంటే రేంజ్ మారపోయేదా?
మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమాకు సీక్వెల్‌గా కార్తీక్ సుబ్బరాజ్ రూపొందించిన మూవీ 'జిగర్ తండ డబుల్ ఎక్స్'.
By: Tupaki Desk | 11 Oct 2023 12:30 PM GMTవరుసగా హారర్ థ్రిల్లర్‌లతో బ్లాక్ బస్టర్ విజయాలని దక్కించుకున్న రాఘవ లారెన్స్ గత కొంత కాలంగా తన ఫామ్‌ని కోల్పోయి వరుస ఫ్లాపుల్ని ఎదుర్కొంటున్నాడు. 'కాంచన 3' కూడా అనుకునన్న స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో దెయ్యాల సినిమాలకు, డైరెక్షన్‌కు కాస్త బ్రేక్ ఇచ్చిన లారెన్స్ ఇతర దర్శకుల సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. రీసెంట్‌గా చేసిన 'చంద్రముఖి' సీక్వెల్ 'చంద్రముఖి 2' కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో లారెన్స్ ఆశలన్నీ ఇప్పుడు కార్తీక్ సుబ్బరాజ్ రూపొందించిన 'జిగర్ తండ డబుల్ ఎక్స్'పైనే ఉంది.
'బొమ్మరిల్లు' సిద్ధార్ధ్ హీరోగా, బాబీ సింహా ప్రధాన పాత్రలో నటించిన మూవీ 'జిగర్ తండ'. 2014లో కార్తీక్ సుబ్బరాజ్ రూపొందించగా విడుదలైన ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని సాధించింది. హీరో సిద్ధార్ధ్‌కు మించి కీలక పాత్రలో నటించిన బాబి సింహకు మంచి పేరు తెచ్చి పెట్టింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమాకు సీక్వెల్‌గా కార్తీక్ సుబ్బరాజ్ రూపొందించిన మూవీ 'జిగర్ తండ డబుల్ ఎక్స్'. ఓ రౌడీ, ఓ ఫిల్మ్ మేకర్ ప్రేమ కథ చుట్టూ అల్లుకున్న సినిమాగా ఫస్ట్ పార్ట్‌ని రూపొందించిన దర్శకుడు 'జిగర్ తండ డబుల్ ఎక్స్'ను అంతకు మించిన కథతో తెరకెక్కించాడు.
ఈ సినిమాపై రాఘవ లారెన్స్‌తో పాటు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. కారణం అతనికి కూడా ఇంత వరకు ఆ స్థాయి సక్సెస్ లేదు. రజనీతో 'పేట' సినిమా చేసినా దాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యే స్థాయిలో, రజనీ స్టార్‌డమ్‌కు తగ్గట్టుగా రూపొందించకపోవడంతో 'పేట' బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. దీంతో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడిగా వైఫల్యం కావాల్సి వచ్చింది. అప్పటి నుంచి సక్సెస్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న కార్తీక్ సుబ్బరాజు 'జిగర్ తండ డబుల్ ఎక్స్'తో ఎలాగైనా మళ్లీ ట్రాక్‌లోకి రావాలనుకుంటున్నారు.
రాఘవ లారెన్స్‌తో పాటు దర్శకుడు ఎస్.జె.సూర్య కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా దీపావళికి తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది. సినిమా రిలీజ్‌కు టైమ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలని బయటపెట్టారు. ఈ మూవీ కోసం ముందుగా దర్శకుడి క్యారెక్టర్ కోపం ఎస్.జె. సూర్యని అనుకున్నారట. అయితే ఆయన నిరాకరించడంతో ఆ పాత్రని జాతిరత్నం నవీన్ పొలిశెట్టితో చేయించాలనుకున్నారట. తన డేట్స్ కుదరకపోవడంతో మళ్లీ ఎస్.జె. సూర్యనే ఒప్పించారట.
అయితే ఎస్.జె. సూర్య కాకుండా ఇందులో ఆ పాత్రని నవీన్ పొలిశెట్టి చేసి ఉంటే సినిమా మరో లెవెల్లో ఉండేదనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. తెలుగులో భారీ క్రేజ్ ఏర్పడేదని, తనదైన పంచ్‌లతో, టైమింగ్‌తో నవీన్ వన్ మ్యాన్ షోగా మార్చేవాడని, అతని ముందు లారెన్స్ తేలిపోయేవాడని కామెంట్‌లు చేస్తున్నారు.