Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : జిగర్ తండ డబుల్ ఎక్స్

jigarthanda double x

By:  Tupaki Desk   |   10 Nov 2023 11:52 AM GMT
మూవీ రివ్యూ : జిగర్ తండ డబుల్ ఎక్స్
X

'జిగర్ తండ డబుల్ ఎక్స్' మూవీ రివ్యూ

నటీనటులు: రాఘవ లారెన్స్-ఎస్.జె.సూర్య- నవీన్ చంద్ర-నిమిష సజయన్-షైన్ టామ్ చాకో-ఇలవరసు తదితరులు

సంగీతం: సంతోష్ నారాయణన్

ఛాయాగ్రహణం: తిరు

నిర్మాతలు: కార్తికేయన్ సంతానం-కదిరేశన్

రచన-దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్

'పిజ్జా' సినిమాతో దర్శకుడిగా సెన్సేషన్ క్రియేట్ చేసిన తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కు తెలుగులో కూడా పెద్ద సంఖ్యలోనే అభిమానులున్నారు. అతడి కెరీర్లో బెస్ట్ మూవీ అనదగ్గ 'జిగర్ తండ'కు కొనసాగింపుగా అతను 'జిగర్ తండ డబుల్ ఎక్స్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాఘవ లారెన్స్.. ఎస్.జె.సూర్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి విడుదలైంది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

రే డాసన్ (ఎస్.జె.సూర్య) ఒక ఎస్ఐ. అతను చేయని నేరానికి ఒక హత్య కేసులో ఇరుక్కుంటాడు. అతడిలాగే ఇంకో ముగ్గురు పోలీసులు వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తుంారు. తాను చెప్పిన వ్యక్తులను చంపితే.. ఈ నలుగురి మీదా కేసులు కొట్టేయించి వాళ్ల ఉద్యోగాలు కూడా తిరిగొచ్చేలా చేస్తానని డీఎస్పీ (నవీన్ చంద్ర) ఆఫర్ ఇస్తాడు. సీజర్ (రాఘవ లారెన్స్) అనే రౌడీని చంపాల్సి న టార్గెట్ తో డాసన్ రంగంలోకి దిగుతాడు. సీజర్ సినిమా పిచ్చి గురించి తెలుసుకుని.. తననొక దర్శకుడిగా పరిచయం చేసుకుని అతడి దగ్గర ఆశ్రయం సంపాదిస్తాడు. సీజర్ రోజువారీ పనులనే సినిమాగా తీయడానికి ఉపక్రమిస్తాడు. ఈ క్రమంలో కొన్ని అనూహ్య సంఘటనలు జరుతుతాయి. అవేంటి.. తాను అనుకున్నట్లుగా సీజర్ ను డాసన్ చంపగలిగాడా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే పాత్ బ్రేకింగ్ సినిమాల జాబితా తీస్తే అందులో కచ్చితంగా ఉండదగ్గ చిత్రం 'జిగర్ తండ'. ఒక గ్యాంగ్ స్టర్ కథను సినిమాకు ముడిపెట్టి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పంచాడు కార్తీక్ సుబ్బరాజ్. ఒక గ్యాంగ్ స్టర్ కథలో అంత వైవిధ్యం చూపించడం.. అంతగా ఎంటర్టైన్ చేయడం అసామాన్యంగా అనిపిస్తుంది. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం అందని విధంగా సాగే కథా కథనాలు ఆ సినిమాకు కల్ట్ స్టేటస్ తెచ్చిపెట్టాయి. ఈ సినిమా తర్వాత కార్తీక్ మీద భారీ అంచనాలు నెలకొనగా.. ఒక్కసారి కూడా ఆ అంచనాలను అందుకోలేకపోయాడు. వేరే కథల్లో మెరుపులు మెరిపించలేకపోయిన కార్తీక్.. మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కడానికి 'జిగర్ తండ' బాటలోనే సాగాడు. ఐతే ఇది 'జిగర్ తండ'కు సీక్వెల్ కాదు. అందులోని పాత్రలను అనుకరిస్తూ సాగిన స్పిన్నాఫ్ తరహా సినిమా. దీనికి 'జిగర్ తండ డబుల్ ఎక్స్' అనే టైటిల్ పెట్టారు కాబట్టి.. డబుల్ వినోదం ఇస్తుందనుకుంటే పొరపాటే. కొన్ని మెరుపులు ఉన్నప్పటికీ.. 'జిగర్ తండ' స్థాయి పర్ఫెక్ట్ మూవీ కాదిది. దాదాపు మూడు గంటల నిడివి ఉన్న సినిమాలో ఓ గంటకు మించి ఎంగేజింగ్ గా అనిపించదు. అందుకే దీనికి 'జిగర్ తండ హఫ్ ఎక్స్' అని టైటిల్ పెట్టాల్సిందేమో అనిపిస్తుంది.

ఒక గ్యాంగ్ స్టర్.. అతడితో సినిమా తీస్తానని వచ్చిన ఒక ఫిలిం మేకర్.. కెమెరా పట్టుకుని ఏదో తీస్తుంటాడు.. చివరగా తెర మీద ఓ సినిమా.. అందరూ అనుకునే సినిమా ఒకటి తెరపై పడే బొమ్మ ఇంకొకటి.. తెలుగులోకి 'గద్దలకొండ గణేష్'గా రీమేక్ అయిన 'జిగర్ తండ'లో బేసిక్ స్టోరీ లైన్ ఇది. అదే ఫార్మాట్లో ఇంకో కొత్త కథను చెప్పడానికి ప్రయత్నించాడు కార్తీక్ సుబ్బరాజ్. ఐతే 'జిగర్ తండ'లో మాదిరి ఇక్కడ సరిగ్గా పాత్రలను ఎస్టాబ్లిష్ చేయడంలో.. కథను కన్విన్సింగ్ గా చెప్పడంలో.. ఆసక్తికర సన్నివేశాలను రాసుకోవడంలో అతను విఫలమయ్యాడు. హత్య కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వ్యక్తులకు డీఎస్పీ వేరే మర్డర్ టార్గెట్లు ఇచ్చి పంపడమే విడ్డూరంగా అనిపిస్తే ఒక ఎస్ఐ హత్య కేసులో చిక్కుకునే వైనం ఏమాత్రం కన్విన్సింగా అనిపించదు. అన్నిటికీ మించి అతను తన టార్గెట్ ను చంపడం కోసం ఫిలిం మేకర్ అవతారం ఎత్తడంలోనూ లాజిక్ ఏంటో అర్థం కాదు. 'జిగర్ తండ'లో మాదిరి ఇందులోని ప్రధాన పాత్రల్లో సహజత్వం కొరవడింది. ప్రధాన పాత్రలు అనుకరణలా అనిపిస్తాయే తప్ప ఒరిజినాలిటీ మిస్సయింది.

ఎస్.జె.సూర్య చేసిన ఫిలిం మేకర్ పాత్రలో ఏమాత్రం కన్విన్సింగ్ గా అనిపించకపోగా.. రాఘవ లారెన్స్ గ్యాంగ్ స్టర్ పాత్రకు బాగానే సూటయ్యాడు కానీ.. బాబీ సింహాలా తన పాత్ర పండలేదిందులో. ప్రథమార్ధం అంతా అర్థం లేని కథ.. అసహజమైన సీన్లతో 'జిగర్ తండ డబుల్ ఎక్స్' విసిగిస్తుంది. ఇంటర్వెల్ సమయానికి కానీ కథ ఒక కొలిక్కి రాదు. ఒక కొత్త విలన్ తెరపైకి వచ్చి అడవుల్లో ఏనుగుల మీదికి కథను మళ్లించాక 'జిగర్ తండ డబుల్ ఎక్స్' ట్రాక్ ఎక్కుతుంది. ఇక్కడ్నుంచి కథ ఆసక్తికర మలుపులతో సాగుతుంది. అప్పటిదాకా కథ ఎటు పోతోందో.. ఏ సన్నివేశం ఎందుకు వస్తుందో తెలియని అయోమయం ప్రేక్షకులను వెంటాడుతుంది. అనేక లూజ్ ఎండ్స్ తో.. నాన్ సీరియస్ సీన్లతో ఇదేం సినిమారా బాబూ అనిపిస్తుంది. కానీ ద్వితీయార్ధం నుంచి సినిమాను కొంచెం పద్ధతిగా నడిపించిన కార్తీక్.. చివరి అరగంటలో తన మార్కు చూపించాడు. అడవి బిడ్డలను ఆ ప్రాంత చిత్ర పటంలో లేకుండా చేసేలా ప్రభుత్వ పెద్ద పన్నాగం వేయడం.. దానికి కౌంటర్ ఎటాక్ గా వాళ్లు ఏం చేస్తారన్నది షాకింగ్ గా అనిపిస్తుంది. 'జిగర్ తండ'కు సరితూగే పతాక సన్నివేశాలతో కార్తీక్ మార్కులు కొట్టేశాడు. చివరి అరగంటలో సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేయడంతో పాటు భావోద్వేగాలను పతాక స్థాయికి తీసుకెళ్తుంది. కానీ ఈ మెరుపుల కోసం అంతకుముందు సుదీర్ఘ నిడివితో.. అనాసక్తికరంగా సాగే చాాలా సన్నివేశాలను భరించాల్సి ఉంటుంది. 'జిగర్ తండ' తర్వాత కార్తీక్ మెరుపులు కనిపించిన సినిమాల్లో ఇదొకటి. కానీ అతను 'జిగర్ తండ' మ్యాజిక్ ను మాత్రం పూర్తి స్థాయిలో రీక్రియేట్ చేయలేకపోయాడు.

నటీనటులు:

రాఘవ లారెన్స్ చేసే రొడ్డ కొట్టుడు మాస్ సినిమాల్లో అతడి ఓవరాక్షన్ చూసి విసుగెత్తిపోయిన వాళ్లకు ఈ సినిమా పెద్ద రిలీఫ్. సరిగ్గా వాడుకుంటే అతను కూడా ఎంత బాగా నటించగలడో.. వైవిధ్యం చూపించగలడో ఈ సినిమా చూపిస్తుంది. సీజర్ పాత్రకు పర్ఫెక్ట్ అనిపించేలా అతను దాన్ని పండించాడు. నటన పరంగా లారెన్స్ కు కెరీర్లోనే ఇది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. తన గెటప్.. స్క్రీన్ ప్రెజెన్స్.. నటన.. అన్నీ బాగున్నాయి. ఎస్.జె.సూర్య స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఆకట్టుకుంటుంది. కానీ తన పాత్ర ఇంకా మెరుగ్గా ఉండాల్సిందనిపిస్తుంది. అతను చేస్తున్న విలక్షణ పాత్రలకు సరితూగే క్యారెక్టర్ కాదిది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్యను ఇంకా వైవిధ్యమైన.. బలమైన పాత్రలో ఊహించుకుంటాం. పెర్ఫామెన్స్ పరంగా ఇద్దరు లీడ్ యాక్టర్ల తర్వాత ఎక్కువ ఆకట్టుకునేది మన నవీన్ చంద్రనే. క్రూరుడైన డీఎస్పీ పాత్రలో అతను అదరగొట్టాడు. షైన్ టామ్ చాకో మరీ చిన్న పాత్రలో కనిపించాడు. తన నటన ఓకే. ఇళవరసు బాగా చేశాడు. సీఎం పాత్రలో చేసిన నటి ఓకే.

సాంకేతిక వర్గం:

కార్తీక్ సుబ్బరాజ్ హిట్ తీసినా.. ఫ్లాప్ తీసినా.. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ కనిపిస్తాయి. 'జిగర్ తండ డబుల్ ఎక్స్'లో టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అని చెప్పొచ్చు. సంతోష్ నారాయణన్ చెలరేగిపోయాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాలో ఒక ఊపు ఊపేస్తుంది. ఏమీ లేని సీన్లను కూడా తన ఆర్ఆర్ తో అతను ఎలివేట్ చేశాడు. పతాక సన్నివేశాల్లో స్కోర్ అదిరిపోయింది. తిరు ఛాయాగ్రహణం కూడా చాలా బాగుంది. విజువల్స్ కళ్లు చెదిరిపోయేలా చేస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్.. మళ్లీ తన టచ్ చూపించడానికి ప్రయత్నించాడు. అతనో భిన్నమైన కథనే చెప్పాడు. కానీ అతను 'జిగర్ తండ'ను ఎక్కువగా అనుకరిస్తున్నట్లు అనిపిస్తుందే తప్ప.. ఆ స్థాయి పనితనాన్ని చూపించలేకపోయాడు. చివరి అరగంటలో చూపించిన మెరుపులను సినిమా అంతా చూపించి ఉంటే ఈ సినిమా లెవెల్ వేరుగా ఉండేది. ఐతే అతడి గత చిత్రాలతో పోలిస్తే ఇది బెటర్. తన మార్కు అక్కడక్కడా చూడొచ్చు.

చివరగా: జిగర్ తండ.. డబుల్ ఎక్స్ కాదు.. హాఫ్ ఎక్స్

రేటింగ్ - 2.25/5

Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater