'జిగర్తాండ డబుల్ X' ట్రైలర్: తొలి నల్లటి పాన్ ఇండియా హీరో!
సినిమా మేకింగ్ సంగతులు.. సెట్లో దౌర్జన్యాలను కూడా చక్కని సంభాషణలు, కామిక్ టైమింగ్ తో చూపించగలిగితే జనాదరణ దక్కుతుందని జిగర్తాండ చిత్రం నిరూపించింది.
By: Tupaki Desk | 5 Nov 2023 7:46 AM GMTసినిమా మేకింగ్ సంగతులు.. సెట్లో దౌర్జన్యాలను కూడా చక్కని సంభాషణలు, కామిక్ టైమింగ్ తో చూపించగలిగితే జనాదరణ దక్కుతుందని జిగర్తాండ చిత్రం నిరూపించింది. కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పుడు జిగర్తాండ డబుల్ X చిత్రం 2023 దీపావళి సందర్భంగా విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. అంచనాలకు చేరువగా ఉందీ ట్రైలర్. 1975 నాటి నేపథ్యంలో ఒక ఫిలింమేకర్- గ్యాంగ్‌స్టర్ చుట్టూ తిరిగే కథాంశం. ఫిలింమేకర్ గా ఎస్.జె.సూర్య.. గ్యాంగ్ స్టర్ గా రాఘవ లారెన్స్ నటిస్తున్నారు. ట్రైలర్‌లో రాఘవ లారెన్స్ తమిళ చిత్రసీమలో మొదటి డార్క్ హీరోగా ఎదగాలని ఆకాంక్షించే గ్యాంగ్‌స్టర్‌గా కనిపించాడు. పాపులర్ ఫిలింమేకర్ సత్యజిత్ రే దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన అనుభవం ఉన్న ఫిలింమేకర్ గా SJ సూర్య పాత్ర కనిపిస్తోంది. `పాండ్య` అనే చిత్రానికి దర్శకత్వం వహించడానికి సూర్యను లారెన్స్ ఎంపిక చేసుకుంటాడు.
అయితే పాండ్య సినిమా నిర్మాణంలో ఏం జరిగింది? చివరికి అది పూర్తయి రిలీజైందా లేదా? అన్నది తెరపైనే చూడాలి. అయితే ఈ సినిమా స్టోరీలైన్ రెగ్యులర్ గా అనిపించినా కానీ దీనిని డార్క్ కామెడీ తరహాలో అద్భుతమైన హాస్య చతురత ఉన్న డైలాగ్స్ తో చూపించిన వైనం.. అందులో ఎమోషన్ యాక్షన్ వగైరా వగైరా అందరికీ నచ్చేలా తీర్చిదిద్దడంలో సుబ్బరాజు పనితనం ఎలా ఉందో కాస్త వేచి చూడాలి. ఇప్పటికి ట్రైలర్ ఫర్వాలేదనిపించింది.
ఈ చిత్రానికి టాప్ క్లాస్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం, ఎస్ తిరునావుక్కరసు సినిమాటోగ్రఫీ అందించగా, షఫీక్ మొహమ్మద్ అలీ ఎడిటింగ్ వర్క్ అందించారు. ఈ చిత్రం దీపావళికి విడుదలవుతోంది. 2014లో విడుదలైన `జిగర్తాండ` చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న పార్ట్ 2 ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతానికి ట్రైలర్ లోని ఫన్ రైడ్ ని అందరూ ఆస్వాధిస్తున్నారు.