ట్యాలెంటెడ్ హీరో రాంగ్ టర్న్?
అతడు సౌత్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నాడని గుసగుస వినిపిస్తోంది.
By: Tupaki Desk | 29 March 2025 1:30 AMబాలీవుడ్‌ని రీమేక్‌ల శాపం వెంటాడుతోంది. అక్కడ అగ్ర హీరో అక్షయ్ కుమార్ వరుసగా రీమేక్ ల ఊబిలో కూరుకుపోయి దాని నుంచి బయటపడలేకపోయాడు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాలను చవి చూసాడు. తనకు ఎదురైన అనుభవాల కారణంగా ఇటీవల అక్షయ్ ఒరిజినల్ కంటెంట్ కోసం వెతుకుతున్నాడని టాక్ ఉంది. అతడు సౌత్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నాడని గుసగుస వినిపిస్తోంది.
కానీ ఇవేవీ పట్టించుకోకుండా అక్షయ్ బాటలోనే ట్యాలెంటెడ్ హీరో జాన్ అబ్రహాం తప్పటడుగులు వేస్తున్నాడంటూ విశ్లేషిస్తున్నారు. అతడు 2020లో విడుదలైన మలయాళ హిట్ చిత్రం `అయ్యప్పనుమ్ కోషియం`ని హిందీలో రీమేక్ చేయాలని భావిస్తున్నాడు. అనురాగ్ కశ్యప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాలనేది జాన్ కోరిక. ప్రస్తుతం రీమేక్ హక్కులు జాన్ అబ్రహాం చేతిలో ఉన్నాయి. స్క్రిప్టును మరింత కమర్షియలైజ్ చేసి మాస్ కి చేరువ కావాలని భావిస్తున్నాడట.
అయితే అయ్యప్పనుమ్ కోషియమ్ ని `భీమ్లానాయక్` టైటిల్ తో తెలుగులో రీమేక్ చేసిన పవన్ కల్యాణ్ కి ప్రతికూల ఫలితం ఎదురైంది. పవర్ స్టార్ అద్భుత నటనతో ఆకట్టుకున్నా బాక్సాఫీస్ వద్ద అది వర్కవుట్ కాలేదు. మాతృకలా తెలుగు వెర్షన్ విజయం సాధించలేదు. అందువల్ల జాన్ అబ్రహాం ఇప్పుడు హిందీలో రిస్క్ చేస్తున్నాడంటూ విమర్శలొస్తున్నాయి.
బాలీవుడ్ ఇటీవల ఒరిజినల్ కంటెంట్ ని కోరుకుంటోంది. రీమేక్ లతో హిందీ పరిశ్రమ ఫ్లాపుల్ని ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో జాన్ ఇలాంటి తప్పు చేయకూడదంటూ విమర్శలొస్తున్నాయి. జాన్ అబ్రహాం తన సొంత బ్యానర్ లో నిర్మించే ఈ చిత్రంలో వేరే హీరోలను నటింపజేస్తే అతడు నటుడిగా రిస్కును కొంతవరకూ తగ్గించుకునే వీలుందని విశ్లేషిస్తున్నారు. అలాగే, జాన్ అబ్రహాం నటించిన `డిప్లొమాట్` ఇటీవలే విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు జాతీయ అవార్డ్ వస్తుందనే నమ్మకాన్ని అతడు వ్యక్తం చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో అతడు రీమేక్ గురించి ఆలోచించడం సరికాదని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు.