ప్రముఖ హాలీవుడ్ నటుడు "జనరల్ హస్పటల్" జానీ కాల్చివేత!
అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు జానీ వాక్టర్ (37) కాల్పుల్లో మృతి చెందారు.
By: Tupaki Desk | 27 May 2024 6:45 AM GMTఅమెరికాలో దారుణం చోటు చేసుకుంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు జానీ వాక్టర్ (37) కాల్పుల్లో మృతి చెందారు. శనివారం తెల్లవారు జామున లాస్ ఏంజిల్స్ డౌన్ టౌన్ లో ఈ దుర్ఘటన జరిగినట్లు జానీ వాక్టర్ తల్లి స్కార్లెట్ మీడియాకు వెల్లడించారు. ఆ సమయంలో వాక్టర్ వెంట అతని సహొద్యోగి మాత్రమే ఉన్నాడని తెలిపారు. దీంతో హాలీవుడ్ లో విషాద చాయలు అలుముకున్నాయి!
అవును... ప్రముఖ హాలీవుడ్ నటుడు జానీ వాక్టర్ కాల్పుల్లో మృతిచెందారు. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వాక్టర్ కారు వద్ద కాటలిక్ట్ కన్వర్టర్ ను దొంగిలించే ప్రయత్నం చేశారంట. ఈ క్రమంలో వారితో వాక్టర్ కు తీవ్రంగా వాదులట జరిగిందని చెబుతున్నారు. ఈ సమయంలోనే దుండగులు కాల్పులు జరిపారని వాక్టర్ తల్లి తెలిపారు.
ఈ సమయంలో తీవ్రంగా గాయపడిన వాక్టర్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ అతడు మరణించాడని స్కార్లెట్ తెలిపారు. మరోపక్క... ఈ ఘటన జరిగిన వెంటనే నిందితులు అక్కడి నుంచి పారిపోయారని.. దీంతో వారి కోసం పోలీసులు వెతుకుతున్నారని చెబుతున్నారు.
కాగా... 2007లో వచ్చిన లైఫ్ టైమ్ డ్రామా సిరీస్ "ఆర్మీ వైవ్స్" అనే టీవీ షోతో కెరీర్ ఆరంభించిన జానీ వాక్టర్... ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ముందుకు కదిలారు. ఈ క్రమంలో ఆయన "వెస్ట్ వరల్డ్", ది ఓ, ఎన్.సి.ఐ.ఎస్., స్టేషన్ 19, క్రిమినల్ మైండ్స్, హాలీవుడ్ గర్ల్ మొదలైన సిరీస్ లు, షోలలో నటించారు.
ప్రధానంగా... "జనరల్ హస్పటల్" అనే షో జానీ వాక్టర్ కు ఎనలేని గుర్తింపు తెచ్చి పెట్టింది. 1963లో ప్రారంభమై న ఈ షోలో ఆయన 2020 నుంచి 2022 వరకు దాదాపు 200 ఎపిసోడ్స్ లలో నటించారు. ఈ షో ఆయనకు ఎనలేని ప్రాచుర్యం తెచ్చి పెట్టింది. అందులో ఆయన పోషించిన "బ్రాండో కార్బిన్" క్యారెక్టర్ ఇప్పటికీ చాలా మందికి ఫెవరేట్. అంతేగాక ఆయనను ఆ పేరుతోనే పిలవడం లేకుంటే "జీ.హెచ్. జానీ" అంటూ సంబోధించండం గమనార్హం.
జానీ వాక్టర్ మరణ వార్త విన్న తోటి నటీనటులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఈ సందర్భంగా వాక్టర్ తో తమకున్న అనుభవాలను పంచుకున్నారు. ఇదే సమయంలో.. వాక్టర్ మరణవార్త తెలిసిన అనంతరం షాక్ కి గురైన అభిమానులు... ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆన్ లైన్ వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.