ఎన్టీఆర్ ఎఫెక్ట్! ఇండియాలో 'జోకర్ 2' వాయిదా?
ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ భారీ అంచనాల నడుమ అక్టోబర్ 2 న విడుదలకు వస్తోంది.
By: Tupaki Desk | 30 Sep 2024 1:30 AM GMTజోక్విన్ ఫీనిక్స్ నటించిన 'జోకర్' అమెరికా, ప్రపంచ దేశాలతో పాటు, భారతదేశంలోను గొప్ప విజయం సాధించిన సంగతి తెలిసిందే. సైరా నరసింహారెడ్డి (2019 మూవీ చిరంజీవి కథానాయకుడు) లాంటి భారీ పాన్ ఇండియన్ సినిమాతో పోటీపడుతూ విడుదలైన `జోకర్` అప్పట్లో మంచి టాక్ తో భారతదేశ థియేటర్ల నుంచి భారీ వసూళ్లను సాధించడం ఆశ్చర్యపరిచింది.
ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ భారీ అంచనాల నడుమ అక్టోబర్ 2 న విడుదలకు వస్తోంది. భారతదేశంలో గాంధీ జయంతి సెలవును ఎన్ క్యాష్ చేసుకోవడానికి స్థానిక పంపిణీదారులు స్కెచ్ వేసారు. కానీ ఎన్టీఆర్ `దేవర` హవా ముందు ఏదీ సాగేట్టు లేదు. జోకర్ 2 ఐమ్యాక్స్ విడుదలను రెండు రోజుల పాటు వాయిదా వేసారని, అక్టోబర్ 4 వరకూ భారతదేశంలో ఈ సినిమాకి ఐమ్యాక్స్ స్క్రీన్లు అందుబాటులో ఉండవని తెలుస్తోంది. ఇతర థియేటర్లలో ఆడించినా కానీ ఐమ్యాక్స్ థియేటర్ల వరకూ వీలుపడదని చెబుతున్నారు.
జోకర్ మొదటి భాగం పెద్ద విజయం సాధించిన నేపథ్యంలో భారతదేశ అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. కానీ ఐమాక్స్‌లో దీన్ని క్యాచ్ చేయాలనుకుటే అక్టోబర్ 4 వరకు వేచి ఉండవలసి ఉంటుంది. అప్పటివరకూ ఐమ్యాక్స్ స్క్రీన్లను దేవర లాక్ చేసింది. సెప్టెంబర్ 27న ప్రీమియర్ అయిన తర్వాత దేవర కోసం పూర్తి వారం IMAX స్లాట్‌లను పొందడంతో ఇప్పుడు దీనిని బ్రేక్ చేయడం కుదరదు. జోకర్: ఫోలి ఏ డ్యూక్స్ అక్టోబర్ 2న 2D, 4DX, స్క్రీన్ Xలో విడుదల కానుండగా IMAXలో కుదరలేదు. జోక్విన్ ఫోనిక్స్, లేడీ గాగా ప్రధాన పాత్రల్లో నటించిన జోకర్ 2 భారతదేశం నుంచి సుమారు 5-10 కోట్ల మధ్య వసూలు చేసేందుకు ఆస్కారం ఉందని అంచనా వేస్తున్నారు.