మాటమీదే నిలబడ్డ ఎన్టీఆర్.. ఫుల్ జోష్ లో ఫ్యాన్స్
టెంపర్ కు ముందు పూరీ జగన్నాథ్ కూడా ఫ్లాపుల్లోనే ఉన్నాడు. టెంపర్ సినిమా ఎన్టీఆర్, పూరీ ఇద్దరి కెరీర్ ను మార్చేసింది.
By: Tupaki Desk | 28 Jan 2025 8:30 PM GMTజూ. ఎన్టీఆర్ కెరీర్ గురించి క్లుప్తంగా చెప్పాలంటే టెంపర్కి ముందు, టెంపర్కి తర్వాత అని చెప్పొచ్చేమో. టెంపర్ సినిమాకు ముందు ఎన్టీఆర్ వరుస ఫ్లాపులతో ఇబ్బందులు పడ్డాడు. కథలు, దర్శకుల సెలెక్షన్ లో జరిగిన తప్పుల వల్ల బాక్సాఫీస్ వద్ద కనీస కలెక్షన్లు లేక డిజాస్టర్లను ఖాతాలో వేసుకున్నాడు.
కంత్రి, శక్తి, రామయ్యా వస్తావయ్యా, దమ్ము, రభస ఇలా ఒకదాన్ని మించి ఒకటి ఫ్లాపులయ్యాయి. కెరీర్ స్టార్టింగ్ లోనే సింహాద్రి సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న తమ హీరోకు ఇన్ని ఫ్లాపులు పడటం చూసి ఫ్యాన్స్ చాలా బాధ పడ్డారు. అలాంటి టైమ్ లో పూరీ జగన్నాథ్ తో టెంపర్ తీసి ఎన్టీఆర్ సూపర్ హిట్ అందుకున్నాడు.
టెంపర్ కు ముందు పూరీ జగన్నాథ్ కూడా ఫ్లాపుల్లోనే ఉన్నాడు. టెంపర్ సినిమా ఎన్టీఆర్, పూరీ ఇద్దరి కెరీర్ ను మార్చేసింది. అయితే టెంపర్ ఆడియో లాంచ్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ ఇకముందు నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుని సినిమాలు చేస్తానని, హిట్టు ఫ్లాపులు తనకొద్దని, తన సినిమాలు చూసి ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకునే లాంటి సినిమాలు చేస్తానని తారక్ చెప్పాడు.
ఎన్టీఆర్ ఈ మాటలు చెప్పి నేటిగా సరిగ్గా పదేళ్లవుతుంది. అప్పట్నుంచి ఇప్పటివరకు ఎన్టీఆర్ కు ఫ్లాపు పడిందే లేదు. టెంపర్ తర్వాత ఎన్టీఆర్ చేసిన నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీరరాఘవ అన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్లుగా నమోదైనవే. ఇక రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి చేసిన ఆర్ఆర్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
గతేడాది వచ్చిన దేవర కూడా మంచి కలెక్షన్లతో సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం వార్2తో బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న తారక్, తర్వాతి సినిమాల విషయంలో కూడా ఎంతో ఆచితూచి అడుగులేస్తున్నాడు. వార్2 తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనున్న ఎన్టీఆర్, ఆ తర్వాత కొరటాలతో దేవర2 చేస్తాడు.
దీన్ని బట్టి చూసుకుంటే ఎన్టీఆర్ టెంపర్ ఆడియో లాంచ్ లో ఏదో ఫ్యాన్స్ ను సంతోషపెట్టడానికో, ఆషామాషీగానో ఈ మాట చెప్పలేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తమ హీరోని ఏ స్థాయిలో అయితే చూడాలని ఫ్యాన్స్ కోరుకున్నారో గత పదేళ్లుగా ఎన్టీఆర్ ఆ స్థాయిని దాటి అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నాడు.