Begin typing your search above and press return to search.

నీల్ తో ఎన్టీఆర్ .. మళ్ళీ అడవుల బాటలోనే..

ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. భారీ యాక్షన్ బ్లాక్‌లతో రూపొందే ఈ చిత్రం, టెక్నికల్‌గా హై స్టాండర్డ్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   11 Feb 2025 8:22 AM GMT
నీల్ తో ఎన్టీఆర్ .. మళ్ళీ అడవుల బాటలోనే..
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర తరువాత పవర్ఫుల్ లైనప్ తో సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఇక అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలో ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఒకటి. డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ పాన్ఇండియా మాస్ ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి ముందుగా అనుకున్న షెడ్యూల్‌లు కొంత ఆలస్యమైనా, ఇప్పుడు మేకర్స్ ప్లాన్ చేసిన కొత్త షెడ్యూల్ మొదలయ్యే సమయం వచ్చేసింది.

ఇప్పటికే ఎన్టీఆర్ తన వార్ 2 షూటింగ్‌ను చివరి దశకు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సినిమా విడుదలైన తర్వాత పూర్తిగా డ్రాగన్ మీద ఫోకస్ పెట్టనున్నాడు. ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. భారీ యాక్షన్ బ్లాక్‌లతో రూపొందే ఈ చిత్రం, టెక్నికల్‌గా హై స్టాండర్డ్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. కథలో ప్రధానమైన ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ ఎపిసోడ్స్‌ను ఇప్పుడు షూట్ చేయబోతున్నారు.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ నెల 17 నుంచి డ్రాగన్ షూటింగ్ మొదలవుతోంది. అయితే, ఇది ఒక షార్ట్ షెడ్యూల్ మాత్రమే. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్ పాల్గొనడం లేదు. ప్రధానమైన కొన్ని ఫైట్, నేచురల్ విజువల్స్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు. వికారాబాద్ అడవుల్లో కొన్ని కీలకమైన ఎపిసోడ్స్‌ను ప్లాన్ చేసినట్లు టాక్. హీరో లేకుండానే మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసి, తదుపరి షెడ్యూల్‌లో ఎన్టీఆర్ జాయిన్ అవ్వనున్నారు.

ఎన్టీఆర్ గత రెండు సినిమాలలో కూడా ఫారెస్ట్ నేపథ్యం హైలెట్ అయ్యింది. RRR లో కొమరం భీమ్ గా, అలాగే దేవరలో కూడా అడవుల నేపథ్యం బాగా కలిసొచ్చింది. మరోసారి నీల్ తో కూడా అలాంటి బ్యాక్ డ్రాప్ రావడం విశేషం. ప్రశాంత్ నీల్ సినిమాలకు భారీ మేకింగ్, టేకింగ్ స్పెషాలిటీగా మారాయి. కేజీఎఫ్, సలార్ చిత్రాల్లోని విజువల్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఆ రేంజ్ టెక్నికల్ టీమ్‌ని డ్రాగన్ కోసం కూడా సిద్ధం చేసుకున్నారు. అడవుల్లో జరిగే ఛేజింగ్ సీక్వెన్స్‌, యాక్షన్ ఎపిసోడ్స్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఎన్టీఆర్ ఇందులో కనిపించే లుక్, యాక్షన్ ఎలా ఉండబోతాయనే విషయంపై ఇప్పటి వరకు మేకర్స్ అప్‌డేట్ ఇవ్వలేదు.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నట్టు సమాచారం. ఇంకా పలు ముఖ్యమైన క్యారెక్టర్ల కోసం కీలకమైన నటీనటుల ఎంపిక జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాకు పెద్ద బడ్జెట్ కేటాయించి, హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే విడుదల తేదీగా 2026 జనవరి 9ను అనౌన్స్ చేసినప్పటికీ, తాజా షెడ్యూల్ వివరాల ప్రకారం సినిమా అప్పటికి పూర్తవుతుందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. అయితే, ఫ్యాన్స్ మాత్రం ఈ షెడ్యూల్ ప్రారంభంతో ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఎట్టకేలకు ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమా మొదలవుతోందన్న విషయం ఫ్యాన్స్ లో నూతన జోష్ తీసుకొచ్చింది. మేకర్స్ నుంచి త్వరలోనే అధికారిక అప్‌డేట్ వచ్చే అవకాశముంది.