జూ. సౌందర్య గురించి మీకు ఈ విషయాలు తెలుసు?
తన తల్లి తమిళ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. నేను పుట్టి పెరిగింది మొత్తం కూడా మలేషియాలోనే. అయితే నాకు ఇండియన్ సినిమాలపై ఆసక్తి ఉంది.
By: Tupaki Desk | 1 Nov 2023 2:30 AM GMTహీరోయిన్ సౌందర్య చనిపోయి రెండు దశాబ్దాలు అవుతున్నా కూడా ఆమె గురించి అప్పటి ప్రేక్షకులు, ఇప్పటి ప్రేక్షకులు మాట్లాడుకుంటూనే ఉంటారు. మహానటి సావిత్రి తర్వాత ఆ స్థాయిలో తెలుగు సినీ ప్రేక్షకులను ప్రేమికులను అలరించిన హీరోయిన్ సౌందర్య అనడంలో సందేహం లేదు. తెలుగు సినిమా పరిశ్రమలో దశాబ్ద కాలం పాటు సౌందర్య శకం నడిచింది.
2004 సంవత్సరంలో హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన సౌందర్య ను ఆమె నటించిన సినిమాల్లో ప్రతి రోజు ఏదో ఒక ఛానల్ లో తెలుగు ప్రేక్షకులు చూస్తూనే ఉంటారు. ఆమె ఫేస్ ఇప్పటికి కూడా ప్రేక్షకులకు సుపరిచితం అనడంలో సందేహం లేదు. సౌందర్య వంటి అందగత్తే, అణుకువ ఉన్న హీరోయిన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అప్పటి నుంచి రాలేదు, లేదు అనేది చాలా మంది అభిప్రాయం.
సౌందర్య లాగే కనిపిస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్న చిత్ర గురించి ఈ మధ్య కాలంలో అంతా మాట్లాడుకుంటున్నారు. మలేషియాకు చెందిన చిత్ర టిక్ టాక్ ద్వారా జూనియర్ సౌందర్య అన్నట్లుగా గుర్తింపు దక్కించుకుంది. సౌందర్య పోలికల్లో దాదాపుగా 80 శాతం పోలికలు చిత్ర లో ఉంటాయి. అందుకే చిత్ర కు మంచి పాపులారిటీ లభించింది.
తాజాగా జూనియర్ సౌందర్య గా పేరు దక్కించుకున్న చిత్ర ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన తల్లి తమిళ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. నేను పుట్టి పెరిగింది మొత్తం కూడా మలేషియాలోనే. అయితే నాకు ఇండియన్ సినిమాలపై ఆసక్తి ఉంది. అందుకే సౌందర్య గారి సినిమాలు చాలానే చూశాను. ఆమె నటించిన అమ్మోరు మరియు అంతఃపురం సినిమాలు ఇష్టం.
ఆమె మాదిరిగా ఉన్న కారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు కూడా వస్తున్నాయి. కానీ నాకు నటన రాదు. అందుకే ఇప్పటి వరకు నేను ఒక్క సినిమా లో కూడా నటించేందుకు ఓకే చెప్పలేదు. సౌందర్య గారి కుటుంబ సభ్యులతో నాకు పరిచయం లేదు. ఆమె కుటుంబ సభ్యులు ఎవరు కూడా నాతో మాట్లాడలేదు అంటూ చిత్ర చెప్పుకొచ్చారు.