సూపర్‌స్టార్ నటవారసుడు ఓపెనింగులు షాకింగ్
ఫ్యాన్స్‌కి అయితే ఆకలి నిద్ర ఉండదు. తమ ఆరాధ్య దైవం పుత్రరత్నాన్ని పెద్ద స్టార్ ని చేయాలని ఫ్యాన్స్ తపించిపోతారు.
By: Tupaki Desk | 7 Feb 2025 2:30 AM GMTసూపర్ స్టార్ల కుటుంబం నుంచి వెండితెరకు హీరో పరిచయం అవుతున్నాడు అంటే దానికి ఎంత హంగామా, హైప్ ఉంటుంది?.. మహేష్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, దుల్కర్ సల్మాన్ .. ఇలా సౌత్ స్టార్ల పిల్లలు వెండితెరకు పరిచయమవుతుంటే, ప్రజల్లో ఎంతో ఉత్కంఠ. ఫ్యాన్స్‌కి అయితే ఆకలి నిద్ర ఉండదు. తమ ఆరాధ్య దైవం పుత్రరత్నాన్ని పెద్ద స్టార్ ని చేయాలని ఫ్యాన్స్ తపించిపోతారు.
కానీ ప్రజలు పరిణతి చెందిన ఈ రోజుల్లో ఇలాంటివేవీ ఉండవని నిరూపణ అవుతోంది. మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ పరిస్థితి చూశాక ఇది అందరికీ అర్థమైంది. అతడికి ఇది కేవలం రెండో సినిమానే అయినా జనంలో క్యూరియాసిటీని కలిగించడంలో విఫలమయ్యాడని `లవ్ యాపా` బాక్సాఫీస్ ఓపెనింగులు చెబుతున్నాయి. లవ్ యాపా ఈ శక్రవారం (ఫిబ్రవరి 7) విడుదలవుతుండగా, ఇప్పటివరకూ 1500 మించి టికెట్లు అమ్ముడు కాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఒక పెద్ద స్టార్ కుమారుడు, ఒక పెద్ద నటి- నిర్మాత కుమార్తె (శ్రీదేవి కుమార్తె ఖుషి కపూర్) కలిసి నటించిన లవ్ యాపాకు ఈ ధీన స్థితి ఊహించనిది. నటవారసుల సినిమాలే చూడాలని ప్రజలు అనుకునేంత వెనకబాటుతనం ఇటీవల లేనేలేదు. ఇప్పుడు కంటెంట్ దే హవా. కంటెంట్ తో పాటు, నటనలో ప్రతిభ ఉన్న కొత్త వారికి అయినా ప్రజలు పట్టంగడుతున్నారు. దీనికి తేజ సజ్జా ఒక ఉత్తమమైన ఉదాహరణ.
టాలీవుడ్ నుంచి తేజ సజ్జా లాంటి ఒక కొత్త తరం హీరో దీనికి ఎగ్జాంపుల్. అతడేమీ పెద్ద స్టార్ హీరో నటవారసుడు కానేకాదు. కేవలం బాలనటుడు. కనీసం వీకీలో అతడి కుటుంబ నేపథ్యం కూడా పెద్దగా కనిపించదు. కానీ హనుమ్యాన్ లాంటి చిత్రంలో తేజ సజ్జా నటించిన తీరు, అతడి ప్రతిభ ఎంతో ఆశ్చర్యపరచగా, ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంచుకున్న కంటెంట్ యూనివర్శల్ అప్పీల్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. టీజర్, ట్రైలర్ స్థాయిలోనే హనుమ్యాన్ మెరిపించింది. బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ అయ్యి, బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగులతో పాటు, పాన్ ఇండియాలో అద్భుతాలు చేసింది. తేజ సజ్జాకు హనుమ్యాన్ చిత్రం హిందీలో డెబ్యూ సినిమా లాంటిది. అక్కడ డెబ్యూనే అయినా అమీర్ ఖాన్ కుమారుడి సినిమా కంటే చాలా ఉత్తమమైన వసూళ్లను తెచ్చిన విషయం మర్చిపోకూడదు.
కానీ ఇప్పుడు అమీర్ ఖాన్ నటవారసుడు జునైద్ ఖాన్ నటించిన మొదటి సినిమా ఓపెనింగులు చాలా తీసికట్టుగా ఉన్నాయని రిపోర్టులు చెబుతున్నాయి. బాక్సాఫీస్ ఓపెనింగులే లేని ఈ సినిమాని థియేటర్ లో రెండో రోజు ఆడిస్తారా? అన్నది కూడా సందిగ్ధమే. థియేటర్ రెంట్లు వగైరా ఎదురు చెల్లించేందుకు నిర్మాతలు, బయ్యరు లేదా హీరో స్వయంగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. అమీర్ ఖాన్ స్టార్ డమ్, పలుకుబడితో అండదండలతో దీనిని మొదటి వారం ఆడించే వీలుంటుందేమో! జునైద్ ఖాన్ సినిమాతో పాటు విడుదలవుతున్న బాడ్ యాస్ రవికుమార్ చిత్రానికి అద్భుతమైన ఓపెనింగులు రావడానికి హిమేష్ రేషమ్మియా లాంటి క్రేజ్ ఉన్న పబ్లిక్ ఫిగర్ ఒక కారణం. లవ్ యాపాకు చేసినంత ప్రమోషనల్ హంగామా లేకుండానే ఈ చిత్రానికి మంచి ఓపెనింగులు లభించాయి. దీనిని బట్టి నటవారసుల సినిమాలే చూడాలని జనం థియేటర్లకు రారు అని కూడా అర్థమవుతోంది.
లవ్ యాపాతో పోలిస్తే... ఇంటర్‌స్టెల్లార్, సనమ్ తేరి కసమ్ వంటి రీ-రిలీజ్‌లు మెరుగైన అడ్వాన్స్ బుకింగ్‌లను సాధించాయని ట్రేడ్ చెబుతోంది. ఇంతలో సంజయ్ లీలా భన్సాలీ `పద్మావత్` కూడా ఈ వారం థియేటర్లలో తిరిగి విడుదలవుతోంది. దీనికి మంచి ఓపెనింగులు ఆశించవచ్చు.