పెద్ద స్టార్లు బూస్ట్ ఇస్తున్నా నటవారసుడు కష్టమే
అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ - ఖుషీ కపూర్ జంటగా నటించిన `లవ్యాపా` త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
By: Tupaki Desk | 4 Jan 2025 3:33 AM GMTఅమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ - ఖుషీ కపూర్ జంటగా నటించిన `లవ్యాపా` త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల ఈ సినిమా ప్రచారం ఊపందుకుంది. తాజాగా విడుదలైన మొదటి పాట వెబ్‌లో దూసుకెళుతోంది. ఈ పాటపై పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. నవతరం నటీనటులు జునైద్, ఖుషీలకు విషెస్ తెలియజేస్తున్నారు. ఈ పాటను తన సోషల్ మీడియాలో షేర్ చేసిన షారూఖ్ ... స్వీట్ అంటూ వ్యాఖ్యానించాడు.
తన X లో షారుఖ్ ఖాన్ ఇలా రాసాడు. ``పాట చాలా మధురంగా ఉంది. జునైద్ లాంటి సౌమ్యుడు... ఆల్ ది బెస్ట్ ఖుషీ. #Loveyapa జంట .. చిత్ర బృందానికి నా ప్రేమ`` అని రాసారు. చిత్ర కథానాయిక అయిన ఖుషీ కపూర్ సోదరి, నటి జాన్వీ కపూర్ సైతం ఈ పాటపై వ్యాఖ్యానించింది. ముఖ్యంగా తన సోదరి ఖుషీపై జాన్వీ అపరిమిత ప్రేమను కురిపించింది. టైటిల్ ట్రాక్ పై పూర్తిగా మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు హిందీ ఫిలింక్రిటిక్స్ అయితే కొత్త సంవత్సరంలో మొదటి బ్యాడ్ సాంగ్ చూశామని విమర్శించారు. ముఖ్యంగా జునైద్ ఖాన్ క్లోజప్ షాట్స్ లో పూర్తిగా తేలిపోయాడు. హీరోయిక్ లుక్ పెద్ద సమస్య. అలాగే ఖుషి కపూర్ కూడా క్లోజప్ షాట్స్ లో అంత అందంగా కనిపించలేదు. ఆ ఇద్దరినీ క్లోజప్స్ లో చూడటం కొంత ఇబ్బందికరంగా ఉందని నెటిజనులు విమర్శిస్తున్నారు. ఈ పాటకు మ్యూజిక్, కొరియోగ్రఫీ, గ్రాఫిక్స్ అన్నీ పెద్ద మైనస్.
అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ గత సంవత్సరం సిద్ధార్థ్ పి. మల్హోత్రా `మహారాజ్` చిత్రంలో నటించాడు. శర్వరి, షాలిని పాండే ఇందులో కథానాయికలు. కర్సందాస్ ముల్జీ పాత్రలో జునైద్ పాత్ర సానుకూల సమీక్షలను పొందింది. ఖుషీ కపూర్ 2023లో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ జోయా అక్తర్ `ది ఆర్చీస్`తో పరిశ్రమలోకి అడుగుపెట్టింది. కానీ తన నటనకు యావరేజ్ మార్కులే వేసారు. ఇప్పుడు ఈ ఇద్దరికీ ఇది ద్వితీయ ప్రయత్నం. ఈ చిత్రం 2022 సౌత్ హిట్ మూవీ `లవ్ టుడే`కి రీమేక్. లవ్ టుడే చిత్రానికి ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించారు.