Begin typing your search above and press return to search.

సూప‌ర్‌స్టార్ కొడుకు చింతించ‌డానికి కార‌ణం?

అమీర్ ఖాన్ త‌న‌ కుమారుడు జునైద్ ఖాన్, ఖుషీ కపూర్ ల‌తో క‌లిసి ల‌వ్యాపా ప్ర‌మోష‌న్స్ కోసం 'బిగ్ బాస్ 18 గ్రాండ్ ఫినాలే'లో పాల్గొన్నాడు.

By:  Tupaki Desk   |   1 Feb 2025 5:32 PM GMT
సూప‌ర్‌స్టార్ కొడుకు చింతించ‌డానికి కార‌ణం?
X

ప‌బ్లిక్ వేదిక‌పై మాట్లాడేప్పుడు నోరు జారితే దాని ప‌ర్య‌వ‌సానం ఎలా ఉంటుందో ఇప్పుడు బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ చ‌వి చూసాడు. ప్ర‌జ‌లంతా షో చూస్తున్న స‌మ‌యంలో అత‌డు నోరు జారాడు. త‌న తండ్రి మాజీ భార్య‌ల‌పై చెణుకులు వేసాడు. ఆ స‌మ‌యంలో అది ఫ‌న్ అని అనుకున్నా, చీప్ గా క‌నిపించింది. దాంతో అలాంటి త‌ప్పు చేయాల్సింది కాద‌ని ఇప్పుడు చాలా బాధ‌ప‌డిపోతున్నాడు జునైద్. తాను ఆ స‌మ‌యంలో అలా అనాల్సింది కాద‌ని, ఇద్ద‌రు పెద్ద స్టార్లు, గొప్ప స్నేహితుల న‌డుమ స‌ర‌దా ప‌రాచికాల్లో తాను త‌ల దూర్చాల్సింది కాద‌ని, ఉన్న‌తంగా ప్ర‌వ‌ర్తించాల్సింద‌ని ఆవేద‌న చెందాడు.

అమీర్ ఖాన్ త‌న‌ కుమారుడు జునైద్ ఖాన్, ఖుషీ కపూర్ ల‌తో క‌లిసి ల‌వ్యాపా ప్ర‌మోష‌న్స్ కోసం 'బిగ్ బాస్ 18 గ్రాండ్ ఫినాలే'లో పాల్గొన్నాడు. రియాలిటీ షోను బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. స‌హ‌జంగానే స‌ల్మాన్ - అమీర్ మ‌ధ్య స‌ర‌దా ప‌రాచికాలు ఉంటాయి. ఇద్ద‌రూ క‌లిసి న‌టించిన హీరోలు గ‌నుక వారి మ‌ధ్య ఇలాంటివి రొటీన్. ఖాన్ ల మధ్య స‌ర‌దా వాగ్వాదాలు, ఒకరితో ఒకరు ఆడుకోవాలనే ఉత్సాహం.. స‌ర‌దా గేమ్స్ సాగుతుండ‌గా, అమీర్ ఖాన్, అతడి మాజీ భార్యలపై జునైద్ ఒక విచిత్రమైన వ్యాఖ్య చేశాడు. దానికి ఆ త‌ర్వాత అత‌డు చాలా చింతించాడు.

లవ్యపా చిత్రం థీమ్ నుండి ప్రేరణ పొందిన 'ఫోన్-ఎక్స్ఛేంజ్' కాన్సెప్ట్ ని అమీర్ - స‌ల్మాన్ ట్రై చేసారు. ఆ స‌మ‌యంలో అమీర్ తనదైన‌ ఫన్నీ వేలో మాట్లాడేస్తూ.. సల్మాన్ తన లేడీ ఫ్రెండ్సుతో ఎలా టచ్‌లో ఉంటాడో ప్రేక్షకులకు చెప్పాడు. ఇది అభిమానుల్లో ఉత్సుకతను పెంచింది. ఇంతలో స‌ల్మాన్ భాయ్ తేరుకుని.. అమీర్ ఫోన్ లో రీనా దత్తా లేదా కిరణ్ రావు మెసేజ్‌లు ఏం ఉన్నాయో మాత్రమే చూస్తాన‌ని పట్టుబట్టాడు. దానికి జునైద్ స్పందించి.. ''ఆయ‌న‌ ఇద్దరు మాజీ భార్యలు పంపిన దుర్భాషలను మీరు చదువుతారు'' అనేశాడు. అయితే మొద‌ట నోరు జారాక ఆ త‌ర్వాత నాలుక క‌రుచుకున్నాడు. జునైద్ ఖాన్ ఈ వ్యాఖ్యపై తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. త‌ప్పుగా మాట్లాడాను.. ఉన్న‌తంగా మాట్లాడాల్సింది అని అన్నాడు.

షోలో దీనిని ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోయినా కానీ.. బహిరంగ వేదికపై అలా మాట్లాడేయ‌డం స‌రికాద‌ని జునైద్ చాలా బాధపడ్డాడు. బహుశా అది కొంచెం అనుచితంగా అనిపించ‌వచ్చు. వారిద్ద‌రూ సీనియ‌ర్ న‌టులు. నేను కొంచెం ఉన్న‌తంగా ప్రవర్తించాల్సింది.. వారిద్దరూ 40 సంవత్సరాలుగా ఇలాగే స‌ర‌దాగా ఉన్నారు. వారిద్దరూ అద్భుతంగా ఉన్నారు. కాబట్టి బహుశా నేను స‌రిగా ప్రవర్తించి ఉండాలి! అని త‌న త‌ప్పును తెలుసుకున్నాడు జునైద్.

2022 తమిళ చిత్రం 'లవ్ టుడే' ఆధారంగా రూపొందించిన రొమాంటిక్ కామెడీ 'ల‌వ్ యాపా'. ఒకరిపై ఒకరు తమ నమ్మకాన్ని నిరూపించ‌డానికి యువ‌ జంటను త‌మ‌ ఫోన్‌లను మార్చుకోవాలని తండ్రి పట్టుబట్టాక ఏం జ‌రిగింద‌న్న‌దే ఈ సినిమా క‌థాంశం. ఫోన్ లు మార్చుకున్నాక‌ గందరగోళం కార‌ణంగా ఎలాంటి అపార్థాలకు దారితీసింది? అనేది తెర‌పై చూడాల్సిందే. ఫోన్ లు మారాక ఆ ఇద్ద‌రి ర‌హ‌స్యాలు బ‌ట్ట‌బ‌య‌ల‌వుతాయి. ఈ వినోదాత్మ‌క చిత్రం ఫిబ్రవరి 7న విడుద‌ల కానుంది.