ముందే మాకు చూపించాలి.. లేదంటే! స్టార్ హీరో కొడుక్కి వార్నింగ్!!
యశ్ రాజ్ ఫిల్మ్స్‌కు రాసిన లేఖలో విహెచ్‌పి పైవిధంగా హెచ్చరిక జారీ చేసింది.
By: Tupaki Desk | 10 Jun 2024 5:30 PM GMTమీ సినిమా సజావుగా రిలీజవ్వాలంటే ముందే మాకు చూపించాలి.. లేదంటే! అంటూ హెచ్చరిక జారీ చేసింది విశ్వహిందూ పరిషత్. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ నటించిన డెబ్యూ సినిమా 'మహారాజ్'పై విశ్వహిందూ పరిషత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. విడుదలకు ముందు మాకు సినిమా చూపించాల్సిందేనని పట్టుపడుతోంది. సినిమాలో మతాన్ని చిత్రీకరించడంపై మతపరమైన సంస్థ విశ్వహిందూ పరిషత్ (VHP) అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో మహారాజ్ సమస్యల్లో పడింది. యశ్ రాజ్ ఫిల్మ్స్‌కు రాసిన లేఖలో విహెచ్‌పి పైవిధంగా హెచ్చరిక జారీ చేసింది.
గౌతమ్ రవ్రియా (విహెచ్‌పి-బజరంగ్ దళ్ కోఆర్డినేటర్, కొంకణ్ ప్రాంతం) లేఖలో ఇలా రాశాడు, ''సినిమా పోస్టర్‌లో, హిందూ దేవతని కించపరిచే విధంగా విలన్‌గా చిత్రీకరించినట్లు కనిపిస్తోంది. ఈ సినిమాలో శ్రీకృష్ణుడు వంటి హిందూ దేవతలను అవహేళన చేసి అవమానించినట్లు కూడా విన్నాం. ఇది హిందువుల ప్రతిష్టను దిగజార్చడానికి హిందువుల మధ్య సామాజిక వైషమ్యాలను కలిగించే ప్రయత్నం. సినిమా విడుదలైతే శాంతిభద్రతలపై ప్రభావం పడే అవకాశం ఉంది. తక్షణమే ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేసి, బహిరంగంగా విడుదల చేయడానికి ముందు బజరంగ్ దళ్ - విశ్వహిందూ పరిషత్‌లకు చూపించవలసిందిగా మా విన్నపం. మేము భావప్రకటనా స్వేచ్ఛను పూర్తిగా గౌరవిస్తాము. అయితే ఇది హిందూ మతాన్ని.. దేవతలను నిరంతరం అవమానించడానికి కాదు. మతాన్ని అవమానిస్తే హిందూ సమాజం సహించదు'' అని హెచ్చరించారు.
ముంబయిలోని యశ్‌రాజ్ ఫిల్మ్స్ కార్యాలయం ఎదుట ఆదివారం కూడా భజ్ రంగ్ దళ్ సభ్యులు నిరసన తెలిపారు. మేకర్స్ నుండి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మహారాజ్ 1862 నాటి మహారాజ్ లిబెల్ కేసు ఆధారంగా రూపొందించిన సినిమా. ఒక పూజారిపై లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణల అనంతర పరిణామాలపై సినిమా ఇది. చరిత్రలో ఒక ముఖ్యమైన న్యాయ పోరాటం ఆధారంగా కథను రాసుకున్నారు. ఈ చిత్రంలో జైదీప్ అహ్లావత్, షాలిని పాండే, శర్వరి కూడా ప్రత్యేక పాత్రలో కనిపించారు. దీనికి సిద్ధార్థ్ పి మల్హోత్రా దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.