ఇదిలానే కొనసాగితే జనాలు ఎన్టీఆర్ ను మర్చిపోతారేమో!
త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో 2018లో చేసిన 'అరవింద సమేతవీర రాఘవ' తర్వాత ఎన్టీఆర్ ఒక్క సోలో మూవీ కూడా చేయలేదు
By: Tupaki Desk | 16 Feb 2024 9:45 AM GMTRRR సినిమాతో గ్లోబల్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇందులో కొమురం భీమ్ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచిన తారక్.. తన యాక్టింగ్ తో, నాటు నాటు స్టెప్పులతో గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు తన క్రేజ్ ను కాపాడుకునేలా ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం 'దేవర' వంటి పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. దీని తర్వాత 'వార్ 2' చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అయితే నందమూరి వారసుడు సినిమా సినిమాకి మరీ ఎక్కువ టైం తీసుకోవడం, రిలీజులు ఆలస్యం అవుతుండటంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారని తెలుస్తోంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో 2018లో చేసిన 'అరవింద సమేతవీర రాఘవ' తర్వాత ఎన్టీఆర్ ఒక్క సోలో మూవీ కూడా చేయలేదు. ఏకంగా నాలుగేళ్ళ గ్యాప్ తీసుకొని 2022లో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి 'ఆర్.ఆర్.ఆర్' వంటి భారీ మల్టీస్టారర్ సినిమా చేసారు. అంటే గత ఆరేళ్లలో తారక్ నుంచి 2 సినిమాలు మాత్రమే వచ్చాయి. అదే సమయంలో మిగతా స్టార్ హీరోలందరూ వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ చేస్తూ వస్తున్నారు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా సరే, అభిమానులకు దగ్గరగా ఉంటున్నామనే భావన కలిగిస్తున్నారు. కానీ యంగ్ టైగర్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తూ, ఎక్కువ కాలం ఫ్యాన్స్ కు దూరంగా ఉంటున్నారు.
2018 నుంచి ఇతర సౌత్ స్టార్స్ చేసిన సినిమాలు లెక్కేసుకుంటే, వారికంటే తారక్ ఎంత వెనకున్నారనేది అర్థమవుతుంది. మహేశ్ బాబు గత ఆరేళ్లలో భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరూ, సర్కారు వారి పాట, గుంటూరు కారం వంటి 5 చిత్రాల్లో నటించారు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ పార్ట్-1 వంటి నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ప్రభాస్. మరికొన్ని రోజుల్లో 'కల్కి 2898 AD' మూవీతో రాబోతున్నారు. అజ్ఞాతవాసి తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కల్యాణ్.. రీఎంట్రీ తర్వాత వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో చిత్రాలను ఫ్యాన్స్ కు అందించారు. OG మూవీని ఈ ఏడాదే రిలీజ్ చేయబోతున్నారు.
ఈ గ్యాప్ లో అల్లు అర్జున్ నా పేరు సూర్య, అల వైకుంఠపురములో, పుష్ప: ది రైజ్ సినిమాలు చేసారు. మరో ఆరు నెలల్లో 'పుష్ప-2' తో రాబోతున్నారు. తారక్ ట్రిపుల్ ఆర్ కోస్టార్ రామ్ చరణ్ సైతం సోలోగా వినయ విధేయ రామ, రంగస్థలం, ఆచార్య చిత్రాలను అందించారు. ప్రస్తుతం నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' మూవీ కూడా ఇయర్ ఎండింగ్ లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీనియర్ హీరోల్లో అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణలు తలో 7 సినిమాల్లో నటిస్తే.. చిరంజీవి 5 చిత్రాలు చేసారు. వెంకటేష్ 6 సినిమాలతో ఆడియన్స్ ను అలరించారు. ఇక తమిళ హీరోల్లో రజినీకాంత్, విజయ్ లు చెరో ఆరు సినిమాలు చేసారు. కానీ ఎన్టీఆర్ మాత్రం రెండంటే రెండు సినిమాలు ఇచ్చారు. ఈ విషయంలోనే ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. ఇలానే కంటిన్యూ అయితే జనాలు మర్చిపోయే ప్రమాదం ఉందని కామెంట్లు చేస్తున్నారు. అందుకే RRR తో వచ్చిన క్రేజ్ ను ఉపయోగించుకొని, వీలైనంత త్వరగా సినిమాలు కంప్లీట్ చెయ్యాలని కోరుకుంటున్నారు.
ఇలా మిగతా హీరోల ఫిల్మోగ్రఫీతో కంపేర్ చేసుకొని చూస్తే మాత్రం, తారక్ అభిమానులు నిరాశ చెందడం సహేతుకమే అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, గత 9 ఏళ్లుగా ఎన్టీఆర్ నుంచి ఒక్క బ్యాడ్ ఫిలిం కూడా రాలేదు. 'టెంపర్' నుంచీ స్క్రిప్ట్ సెలెక్షన్ లో వైవిధ్యం చూపిస్తూ.. వరుసగా హిట్లు కొడుతున్నారు. 'నాన్నకు ప్రేమతో' 'జనతా గ్యారేజ్' 'జై లవకుశ' 'అరవింద సమేత' సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇక రాజమౌళి సినిమా తర్వాత ఏ హీరోకైనా ఎలాంటి క్రేజ్ వస్తుందో తెలుసు కాబట్టే, RRR కోసం ఎక్కువ సమయం కేటాయించారు. ఈ సినిమాతో వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ ను కంటిన్యూ చేసేలా చాలా జాగ్రత్తగా ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటున్నారు. కాస్త లేట్ అయినా సరే, హిట్టు సినిమాతోనే రావాలని 'దేవర' కోసం టైం తీసుకుంటున్నారు. అభిమానులను గర్వపడేలా చేయటానికే వార్ 2, NTR31 లాంటి చిత్రాలను లైన్ లో పెట్టారు. ఇవన్నీ ఫ్యాన్స్ అర్థం చేసుకుంటే, రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ నుంచి మరిన్ని మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంటుంది.