Begin typing your search above and press return to search.

సినీ ఇండ‌స్ట్రీలో ఉండాలంటే సిగ్గు ఉండ‌కూడ‌దు

2013లో రిలీజైన ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన విష‌యం తెలిసిందే.

By:  Tupaki Desk   |   15 March 2025 12:58 PM IST
సినీ ఇండ‌స్ట్రీలో ఉండాలంటే సిగ్గు ఉండ‌కూడ‌దు
X

నితిన్ హీరోగా నిత్య మీనన్ హీరోయిన్ గా విజ‌య్ కుమార్ కొండా ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సినిమా గుండెజారి గ‌ల్లంత‌య్యిందే. 2013లో రిలీజైన ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన విష‌యం తెలిసిందే. ఆల్రెడీ నితిన్, నిత్య క‌లిసి చేసిన ఇష్క్ మూవీ మంచి హిట్ అవ‌డం, అదే హీరోహీరోయిన్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన గుండెజారి గ‌ల్లంత‌య్యిందే కూడా హిట్ అవడంతో నితిన్- నిత్య‌ను సూప‌ర్ హిట్ పెయిర్ అనేశారు ఆడియ‌న్స్.

ఈ సినిమాలో ఇండియ‌న్ బ్యాడ్మింట‌న్ స్టార్ గుత్తా జ్వాలా ఓ స్పెష‌ల్ సాంగ్ చేసిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ సినిమా కంటే ముందు కూడా త‌నకు చాలా సినిమాల్లో ఆఫ‌ర్లు వ‌చ్చిన‌ట్టు గుత్తా జ్వాలా రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. బ్యాడ్మింట‌న్ లో పీక్ లో ఉన్న‌ప్పుడు త‌న‌కు ప‌లు సినీ ఛాన్సులు వ‌చ్చాయ‌ని, కానీ వాట‌న్నింటినీ తాను తిర‌స్క‌రించిన‌ట్టు జ్వాలా తెలిపారు.

ఇండ‌స్ట్రీలో త‌న‌కెంతో మంది ఫ్రెండ్స్ ఉన్నార‌ని, ఇండ‌స్ట్రీలో ఉంటే ఎలా ఉండాలో వారిని చూస్తే అర్థ‌మ‌వుతుంద‌ని, తాను వారిలా ఉండ‌లేన‌ని, సినిమాల్లో ఉండాలంటే మ‌నమెంతో మారాల‌ని, సిగ్గు ప‌డ‌కుండా ప్ర‌తీ విష‌యంలో అడ్జ‌స్ట్ అవుతూ ఉండాల‌ని, త‌న భ‌ర్త విష్ణు విశాల్ కూడా సినిమాల్లో ఉన్నార‌ని చెప్పిన జ్వాలా, ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఉండేవారికి 24 గంట‌లూ ఏదొక ప‌ని ఉంటుంద‌ని, కానీ స్పోర్ట్స్ ప‌ర్స‌న్స్ కు అలా కాద‌ని, 10 గంట‌లు ప్రాక్టీస్ చేస్తే త‌ర్వాత రెస్ట్ తీసుకోవ‌చ్చ‌ని అన్నారు.

ఇన్ని తెలిసిన‌ప్ప‌టికీ గుండెజారి గ‌ల్లంత‌య్యిందే సినిమాలో సాంగ్ చేయ‌డానికి రీజ‌న్ మాత్రం త‌న ఫ్రెండ్ నితినే అని ఆమె చెప్పుకొచ్చింది. ఓ సారి పార్టీలో ఉన్న‌ప్పుడు నితిన్ త‌న‌కు ఆ స్పెష‌ల్ సాంగ్ గురించి చెప్పి ఆ సాంగ్ ను చేయ‌మని అడిగాడ‌ని, దానికి తాను క్యాజువల్ గా ఓకే చెప్పాన‌ని, కానీ మూడ్నెళ్ల త‌ర్వాత నితిన్ వ‌చ్చి సాంగ్ ఫైన‌ల్ చేశామ‌ని చెప్పాడ‌ని, తాను చేయ‌లేన‌ని చెప్పినా నితిన్ విన‌లేద‌ని, త‌న కోస‌మే ఆ స్పెష‌ల్ సాంగ్ చేశాన‌ని గుత్తా చెప్పారు.

తాను ఆ సాంగ్ చేయ‌డం వ‌ల్ల నేష‌న‌ల్ మీడియాలో కూడా ఆర్టిక‌ల్స్ వ‌చ్చాయ‌ని, ఫ‌లితంగా సినిమాకు మంచి ప్ర‌మోష‌న్ జ‌రిగింద‌ని, నితిన్ కూడా నీ వ‌ల్లే త‌మ సినిమాకు నేష‌న‌ల్ మీడియాలో ప్ర‌మోష‌న్స్ జ‌రుగుతున్నాయ‌ని అనేవాడ‌ని, ఆ సాంగ్ వ‌ల్ల జ‌రిగిన మంచేదైనా ఉందంటే నితిన్ కు హిట్ ద‌క్క‌డ‌మేన‌ని, ఇప్పుడు దాని గురించి మాట్లాడాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంద‌ని గుత్తా జ్వాలా చెప్పారు.