Begin typing your search above and press return to search.

కంగువా: లోపాలు ఉండటంలో తప్పులేదు.. జ్యోతిక రివ్యూ

సూర్య నటించిన భారీ బడ్జెట్ సినిమా ‘కంగువా’ ఇటీవల పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

By:  Tupaki Desk   |   17 Nov 2024 10:10 AM GMT
కంగువా: లోపాలు ఉండటంలో తప్పులేదు.. జ్యోతిక రివ్యూ
X

సూర్య నటించిన భారీ బడ్జెట్ సినిమా ‘కంగువా’ ఇటీవల పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ దర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాను గ్రీన్ స్టూడియోస్ యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించగా బాబీ డియోల్ ప్రతినాయకుడి పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాపై వస్తున్న మిశ్రమ స్పందనల గురించి సూర్య సతీమణి, నటి జ్యోతిక తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఒక మూవీ లవర్‌గా, ప్రేక్షకురాలిగా ఈ రివ్యూ ఇస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

జ్యోతిక మాట్లాడుతూ, ‘‘కంగువా అద్భుతమైన సినిమా. సూర్య నటనను చూస్తే ఎంతో గర్వంగా ఉంది. నిజం చెప్పాలంటే, మొదటి 30 నిమిషాలు అనుకున్నంత స్థాయిలో లేవు. అలాగే, సౌండ్ లౌడ్ గా ఎక్కువగా ఉండటం గమనించాను. కానీ ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాల్లో ఇలాంటి చిన్న చిన్న లోపాలు సహజం, అందులో పెద్దగా తప్పుబట్టాల్సిన అవసరం లేదు. మూడు గంటల సినిమా మొత్తం అద్భుతమైన అనుభూతిని అందించింది. చిత్రంలో కెమెరా వర్క్ ఇంత అద్భుతంగా ఉంటుందని ఎప్పుడూ ఊహించలేదు,’’ అంటూ ప్రశంసలు గుప్పించారు.

అంతేకాకుండా, ఈ చిత్రంపై వస్తున్న నెగటివ్ రివ్యూల గురించి జ్యోతిక అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘భారీ బడ్జెట్ సినిమాల్లో మహిళలను తక్కువ చేసే సన్నివేశాలు ఉన్నా రివ్యూలు అంత తీవ్రంగా రాలేదు. కానీ కంగువాలో ఉన్న సెకండ్ హాఫ్ యాక్షన్ సీన్స్, మహిళలపై చిత్రీకరించిన ఫైట్ సన్నివేశాలు, చిన్నారి ప్రేమకు సంబంధించిన భావోద్వేగాలు అద్భుతంగా ఉన్నా కూడా, అలాంటి మంచి విషయాలపై ఎవరూ మాట్లాడటం లేదు. ఈ చిత్రానికి వస్తోన్న నెగెటివిటీ బాధగా ఉంది. సినిమా బృందం చేసిన ప్రయత్నం, వారి కృషి ప్రశంసించదగినది,’’ అని ఆమె అభిప్రాయపడ్డారు.

‘కంగువా’ చిత్ర కథ వెయ్యేళ్ల ప్రాచీన కాలానికి, నేటి కాలానికి ముడిపడుతూ రూపొందించబడింది. సూర్య కంగువా, ఫ్రాన్సిస్ పాత్రల్లో అద్భుతంగా నటించగా, దిశా పటానీ తన పాత్రతో ఆకట్టుకున్నారు. బాబీ దేవోల్ విలన్‌గా మెప్పించారు.. అంటూ మరికొందరు తమిళ సినీ తారలు పాజిటివ్ రిపోర్ట్ ఇస్తున్నారు. గ్రీన్ స్టూడియోస్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రానికి భారీ కాన్వాస్ జోడించారు.

ఇక జ్యోతిక రివ్యూ అభిమానులను, ప్రేక్షకులను ఆలోచనలో పడేసింది. ప్రతీ సినిమాలో పాజిటివ్, నెగటివ్ ఉంటాయి. కానీ, కంగువా వంటి ప్రతిష్టాత్మక ప్రయత్నానికి అంతా మద్దతు ఇవ్వాలని ఆమె సూచించారు. "లోపాలు ఉండటం సహజం, కానీ ఆ చిత్రానికి వెనుక ఉన్న కృషిని గుర్తించాలి," అని ఆమె అన్నారు. మరి ఆమె ఇచ్చిన వివరణ అనంతరం కంగువా కలెక్షన్ లెక్క పెరుగుతుందో లేదో చూడాలి.