హీరోయిన్‌ల వయసు పెరగడానికి అనుమతించరు: జ్యోతిక
ఒక ఎఫ్.ఎం రేడియోతో జరిగిన చర్చా కార్యక్రమంలో.. జ్యోతిక సినీపరిశ్రమలో మగ- ఆడ వైరుధ్యాల గురించి వ్యాఖ్యానించారు.
By: Tupaki Desk | 2 March 2025 9:20 AM ISTసినీపరిశ్రమలో మహిళా నటీమణులకు మేల్ స్టార్స్ తో పోలిస్తే అవకాశాలు తక్కువగా ఉంటాయని అన్నారు జ్యోతిక. నిజానికి మహిళా నటీమణులకు వయసు పెరగడానికి అనుమతి లేదని వ్యాఖ్యానించారు. కానీ వయసు పైబడిన మగ నటులను ఇప్పటికీ సూపర్ స్టార్లుగా కీర్తిస్తున్నారని అన్నారు. ఒక ఎఫ్.ఎం రేడియోతో జరిగిన చర్చా కార్యక్రమంలో.. జ్యోతిక సినీపరిశ్రమలో మగ- ఆడ వైరుధ్యాల గురించి వ్యాఖ్యానించారు.
హీరోలను దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీస్తున్నారని, హీరోయిన్‌లు, మహిళా నటీమణుల కోసం కథలు రాయడం లేదని కూడా జ్యోతిక విమర్శించారు. అలాగే వయసు పెరిగితే కథానాయికలకు అవకాశాలుండవు అని కూడా అన్నారు. ''వయసు దక్షిణాదిలో నిజంగా పెద్ద ప్రశ్న. నాకు 28 ఏళ్ల వయసులో పిల్లలు పుట్టారు. ఆ తర్వాత నేను చాలా భిన్నమైన పాత్రలు చేయడం ప్రారంభించాను. నిజానికి నేను 28 ఏళ్ల తర్వాత స్టార్ లేదా హీరోతో పని చేయనే లేదు. ఇది చాలా పెద్ద సవాల్. ఎందుకంటే వయసు పెరిగాక పూర్తిగా కొత్త దర్శకులతో సినిమాలు తీస్తూ స్వయంగా నిర్మించాల్సి ఉంటుంది. ఇదంతా వయస్సు కారకంతో సంబంధం కలిగి ఉంటుంది. తమిళ పరిశ్రమలో వయసు అనేది మరింత పెద్ద సమస్య. నేను అన్ని దక్షిణాది భాషల గురించి చెప్పను'' అని జ్యోతిక అన్నారు.
నాటి రోజుల్లో కె. బాలచందర్ లాంటి పెద్ద దర్శకులు, అనుభవజ్ఞులైన ఫిలింమేకర్స్ నాయికా ప్రధాన పాత్రలు లేదా ప్రాధాన్యత ఉన్న కథానాయికను తెరపై చూపించేవారని, ఇటీవలి కాలంలో నాయికా ప్రధాన కథలు రావడం లేదని జ్యోతిక విమర్శించారు. పెద్ద వ్యక్తుల కోసం సినిమాలు తీసే పెద్ద వ్యక్తులు మాత్రమే మనకు ఉన్నారు. ఒక నటి కోసం సినిమా తీసే పెద్ద ఫిలింమేకర్స్ మనకు లేరని భావిస్తున్నట్టు చెప్పారు. మహిళా నటీమణులకు బడ్జెట్ పరిమితం. వయస్సు పెద్ద సవాల్. రెండవది ఒక మహిళా దృక్కోణం నుండి అనుభవజ్ఞులైన దర్శకుడు కథ చెప్పడం. దక్షిణాదిలో ఒక మహిళ ప్రయాణం చాలా కఠినమైనదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక ఒంటరి పోరాటం! అని కూడా జ్యోతిక అన్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. జ్యోతిక త్వరలో 'డబ్బా కార్టెల్' అనే చిత్రంలో కనిపిస్తుంది. 'డబ్బా కార్టెల్' ట్రైలర్ ఇప్పటికే విడుదలై ఆకట్టుకుంది. ఐదుగురు మధ్యతరగతి మహిళల లంచ్ బాక్స్ వ్యాపారం ఊహించని విధంగా వారిని ప్రమాదకరమైన డ్రగ్ కార్టెల్‌లోకి తీసుకెళ్తుంది. ఒక చిన్న వ్యాపారంలా ప్రారంభమైనా, ఇది ఫార్మా మాఫియా గురించి, ఈ రంగంలోని చీకటి వ్యాపారాల గురించి అన్వేషిస్తుంది. ఈ చిత్రానికి హితేష్ భాటియా దర్శకత్వం వహించారు. షబానా అజ్మీ, గజరాజ్ రావు, జ్యోతిక తదితరులు ఇందులో నటించారు.