'కాలమేగా కరిగింది' ట్రైలర్ టాక్: కలహాలే లేని ఓ ప్రేమ కథ
మునుపటి కాలపు ప్రేమకథల్లో ఉండే మాధుర్యాన్ని, అమాయకత్వాన్ని ఈ కథలో సరికొత్తగా మలిచారు.
By: Tupaki Desk | 16 March 2025 5:12 PM ISTసినిమా అనేది కేవలం విజువల్ ఎక్స్‌పీరియన్స్ మాత్రమే కాదు, మనసును తాకే భావోద్వేగాల కలయిక కూడా. ఇప్పటివరకు వెండితెరపై ప్రేమకథలు ఎన్నో వచ్చాయి, పోయాయి. కానీ కొన్ని కథలు మన లోపల ఏదో తీయని అనుభూతిని మిగిల్చి మన జీవితంలో ఓ భాగమైపోతాయి. అటువంటి ప్రత్యేకమైన అనుభూతిని కలిగించేందుకు 'కాలమేగా కరిగింది' చిత్రం సిద్ధమవుతోంది. ఇక ట్రైలర్ విడుదల చేయగా మరింత పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తోంది.
మునుపటి కాలపు ప్రేమకథల్లో ఉండే మాధుర్యాన్ని, అమాయకత్వాన్ని ఈ కథలో సరికొత్తగా మలిచారు. మార్చి 21న ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా విడుదలవుతున్న ఈ సినిమా, ప్రేమను కవిత్వంగా మలిచిన ఓ ప్రత్యేకమైన ప్రయాణంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ట్రైలర్‌లో చూపించిన విజువల్స్ కూడా బలంగా చెబుతున్నాయి.
స్కూల్ డేస్ లోని బాల్యప్రేమ, అందులోని అమాయకత్వం, మొదటి చూపు ప్రేమ, ఆతర్వాత మారిన పరిస్థితులు.. ఇవన్నీ కలిసిన ఈ ప్రయాణాన్ని మధురంగా మలిచారు. ఫణి-బిందు అనే ప్రేమికుల మధ్య ప్రేమ కథను సున్నితంగా అల్లిన విధానం ఆకట్టుకుంటుంది. దూరమైన అనుబంధాలు, మళ్లీ కలిసే అవకాశాలు ఇవన్నీ కథను మరింత ఆసక్తికరంగా మలచనున్నాయి.
ఈ కథలో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. కలహాలే లేని ప్రేమకథ.. అని ట్యాగ్ ఇచ్చినట్లుగా ఎలాంటి విరుద్ధతలూ లేవు. అణచివేత, సంఘర్షణ, ఊహించని మలుపులు లేవు. కానీ నెమ్మదిగా పండే భావోద్వేగం, ఒకరినొకరు గుర్తు చేసుకుంటూ వెళ్ళే అనుభూతి ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది. ట్రైలర్ చూసినవారిలో ఒకటే మాట వినిపిస్తోంది.. ఇది ప్రేమను మళ్లీ నమ్మించే సినిమా. ప్రేమ అనేది ఒకరికి దూరమైపోయినా జ్ఞాపకాల రూపంలో మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇదే విషయాన్ని ఈ కథ మృదువుగా చెబుతోంది.
సింగార మోహన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. కథను సమర్ధంగా హ్యాండిల్ చేసిన విధానం ట్రైలర్‌లోనే స్పష్టంగా కనిపిస్తోంది. వినీత్ పబ్బటి అందించిన విజువల్స్ ప్రతి ఫ్రేమ్‌ను అందంగా మార్చాయి. అందమైన లొకేషన్లు, రీ-కనెక్ట్ అవుతున్న జ్ఞాపకాలు సినిమాకు ఓ ప్రత్యేకమైన టోన్ అందించాయి. గుడప్పన్ అందించిన సంగీతం ఇప్పటికే మంచి స్పందన అందుకుంది. బీజీఎమ్ అయితే కథను మరింత ఎమోషనల్‌గా మలచనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముడిగొండ, నోమినా తారా ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సింగార క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై మరే శివశంకర్ నిర్మించారు. ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద అంచనాలు పెరిగాయి. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ త్వరలో మరిన్ని అప్డేట్స్ విడుదల చేయనున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరించే అలవాటు తెలుగు ప్రేక్షకులకు ఉన్న సంగతి తెలిసిందే. ఇక 'కాలమేగా కరిగింది' కూడా అదే తరహాలో ఆకట్టుకునే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది.