బన్నీ, రజినీ వద్దన్న హిట్ మూవీ ఏంటో తెలుసా?
ఇప్పుడు అదే తరహా ప్రచారం ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
By: Tupaki Desk | 4 Sep 2024 1:30 PM GMTసినిమా ఇండస్ట్రీలో చాలా కథలు ఒక హీరోకు నచ్చక పోవడంతో మరో హీరో వద్దకు వెళ్తూ ఉంటాయి. ఒక హీరో నో చెబితే చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి మరో హీరో వద్దకు తీసుకు వెళ్లడం కామన్ గా జరుగుతూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లిన చాలా కథలను ఆయన ఏదో కారణం వల్ల తిరస్కరించారని, వాటిల్లో కొన్ని రవితేజ చేసి సూపర్ హిట్స్ ను దక్కించుకున్నాడనే వార్తలు అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. చాలా రీమేక్ లు అలా చేతులు మారిన విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ అలాంటి చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు అదే తరహా ప్రచారం ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ జంటగా రూపొంది 2015లో విడుదల అయిన 'భజ్రంగీ భైజాన్' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఆ సినిమాకు టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ఆ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ రైటర్ గా విజయేంద్ర ప్రసాద్ కి గుర్తింపు లభించింది. భారీ విజయాన్ని సొంతం చేసుకున్న భజరంగీ భాయిజాన్ సినిమా కథ రెడీ అయిన వెంటనే సల్మాన్ ఖాన్ వద్దకు వెళ్ల లేదట. ఇద్దరు ముగ్గురు హీరోలు నో చెప్పిన తర్వాత అప్పుడు సల్లూ భాయ్ వద్దకు వెళ్లిందట.
ఈ సినిమా కథను మొదట అల్లు అర్జున్ వద్దకు తీసుకు వెళ్లడం జరిగిందట. గతంలో చిరంజీవి నటించిన ఒక సినిమాకు కాస్త అటు ఇటుగా కథ ఉందని, దానికి కాపీ అంటారనే ఉద్దేశ్యంతో బన్నీ ఆ కథ కు నో చెప్పాడట. కథ లో మార్పులు చేర్పులు చేసినా కూడా ఆసక్తి లేదని చెప్పేశాడట. దాంతో తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ వద్దకు ఇదే కథ వెళ్లిందట. ఆయన కూడా కథ బాగానే ఉంది కానీ నేను చేయలేను అంటూ చేతులు ఎత్తేశాడట. ఇంకా అక్కడ ఇక్కడ తిరిగి చివరకు సల్మాన్ ఖాన్ వద్దకు కథ చేరుకుంది. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సినిమా వచ్చింది.
దర్శకుడు కబీర్ ఖాన్ ఇటీవల ఒక చిట్ చాట్ లో ఈ విషయాన్ని ప్రస్థావించాడు. తెలుగు హీరో అల్లు అర్జున్, తమిళ్ హీరో రజినీకాంత్ తిరస్కరించిన తర్వాత కొన్ని నెలలు వెయిట్ చేసి సల్మాన్ ఖాన్ తో చిన్న చిన్న మార్పులు చేసి సినిమాను రూపొందించినట్లు చెప్పుకొచ్చాడు. కమర్షియల్ గా భారీ విజయాన్ని భజరంగీ భాయిజాన్ సినిమా దక్కించుకుంది. వంద కోట్ల లోపు బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకు వందల కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. సల్మాన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల జాబితాలో భజరంగీ భాయిజాన్ నిలిచిన విషయం తెల్సిందే. అదే కథ తో అల్లు అర్జున్ లేదా రజినీకాంత్ చేసి ఉంటే ఫలితం ఎలా ఉండేదో కదా..!