స్వలింగ సంపర్కాన్ని తంబీలు అంగీకరిస్తారా?
తాజా చిత్రం `కాదల్ ఎన్నబడు పుదువుడుమై` కోలీవుడ్ లో స్వలింగ సంపర్కంపై తొలి సినిమా. ఒకే జెండర్ కి చెందిన ఇద్దరు ప్రేమికుల ప్రేమకథ. జయప్రకాష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
By: Tupaki Desk | 11 Feb 2025 1:30 PM GMTస్వలింగ సంపర్కం నేపథ్యంలో కొన్ని సినిమాలు గతంలో విడుదలై వివాదాస్పదమయ్యాయి. షబానా ఆజ్మీ- నందితా దాస్ నటించిన `ఫైర్` 1996లో విడుదలై పెద్ద చర్చనీయాంశమైంది. ఈ చిత్రంలో షబానా- నందిత మధ్య రొమాంటిక్ సన్నివేశాలు, స్వలింగ సంపర్క దృశ్యాలు ప్రజల్లో కొన్నేళ్ల పాటు చర్చగా మారాయి. ఇలాంటి ఒక సినిమాని తెలుగులో తెరకెక్కించి రిలీజ్ చేయగా, దానిపైనా ఇదే తీరుగా చర్చ సాగింది. హాలీవుడ్ లో ఇలాంటి సినిమాలు రొటీన్ గా వస్తున్నా కానీ, భారతీయ స్క్రీన్ పై రేర్ గా మాత్రమే ఇలాంటి చిత్రాలు తెరకెక్కాయి.
తాజా చిత్రం `కాదల్ ఎన్నబడు పుదువుడుమై` కోలీవుడ్ లో స్వలింగ సంపర్కంపై తొలి సినిమా. ఒకే జెండర్ కి చెందిన ఇద్దరు ప్రేమికుల ప్రేమకథ. జయప్రకాష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జై భీమ్ ఫేమ్ లిజోమోల్ జోస్ సెన్సేషనల్ పాత్రలో నటించారు. ప్రేమికుల దినోత్సవానికి విడుదల కానున్న ఈ చిత్రం ఇప్పటికే వివాదాస్పదమైంది. ఈ సినిమాకి థియేటర్ల సమస్య, పంపిణీ వర్గాలతో సమస్య ఎదురైందని కోలీవుడ్ మీడియా వెల్లడించింది.
దర్శకుడు మాట్లాడుతూ.. స్వలింగ సంపర్కుల కథ అనగానే నిర్మాతలు ఎవరూ ముందుకు రాలేదు. కథ విన్నప్పుడు తమిళనాడులో అయితే కష్టం... మలయాళం లేదా హిందీలో దీన్ని నిర్మించాలని కొందరు సూచించారు. అయితే విమర్శకుల ప్రశంసలు పొందిన `ది గ్రేట్ ఇండియన్ కిచెన్` నిర్మాత జియోబేబీ ఈ సినిమాకు మద్ధతుగా నిలిచారు. సినిమాను పూర్తి చేసినప్పటికీ చివరి క్షణంలోను పంపిణీదారులతో సమస్య ఏర్పడింది. ఆడియో విడుదల సమయంలో ధనుంజయ పంపిణీకి అంగీకరించిన మొదటి వ్యక్తి. అప్పటికి ఓటీటీతో చర్చలు సాగుతున్నా.. చివరికి థియేట్రికల్ రిలీజ్ కి అర్హమైన సినిమా అని గ్రహించారు ఆయన. అతడు అవకాశం సద్వినియోగం చేసుకున్నాడు.
కాదల్ ఎన్నబడు పుదువుడమై తమిళనాడులోని థియేటర్లలో విడుదల కాగా, దీని తెలుగు రిలీజ్ ఓటీటీలో ప్లాన్ చేయడంతో అది తెలుగు రాష్ట్రాల్లోను ఆదరణ పొందింది. ఈ చిత్రం రొటీన్ కి భిన్నంగా సాగే స్క్రీన్ ప్లేతో అందరి దృష్టిని ఆకర్షించింది. నేటివిటీ సినిమాలు తీసే తమిళ సినీపరిశ్రమ స్వలింగ సంపర్కుల కథను అనుమతించడం ఇదే మొదటిసారి. తంబీల్లో ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి. ఒకవేళ ఈ సినిమా ఆదరణ దక్కించుకుంటే, ఇకపైనా ఇలాంటి మరిన్ని సినిమాలను తెరకెక్కించేందుకు తమిళ చిత్ర రంగం సిద్ధమవుతుందని అంగీకరించినట్టే!