క్యాలెండర్‌లో ఆ డేట్‌ను మార్క్ చేసుకోమంటున్న కాజల్
ఇదిలా ఉంటే కాజల్ కొత్తగా మరో సినిమాను అనౌన్స్ చేసింది. శ్రేయాస్ తల్పడే ప్రధాన పాత్రలో వస్తోన్న ది ఇండియా స్టోరీ సినిమాలో కాజల్ కీలక పాత్రలో నటిస్తోంది.
By: Tupaki Desk | 28 Jan 2025 6:59 AM GMTతన అందం, అభినయంతో ఎంతోమంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్న టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లయ్యాక కెరీర్ కు కాస్త గ్యాప్ ఇచ్చింది. మళ్లీ బాబు పుట్టాక సినిమాల్లోకి వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తన సత్తా చాటుకుంటూ వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. రీసెంట్ గా కమల్ తో కలిసి ఇండియన్2 సినిమా చేసింది కాజల్.
కానీ తన పాత్ర ఇండియన్2 లో కాకుండా ఇండియన్3లోనే పరిచయం కానుంది. వాస్తవానికి ఇండియన్2లోనే కాజల్ పాత్ర ఎంటరవాల్సింది కానీ తర్వాత ఎందుకనో అది ఇండియన్3లోకి మారింది. గతేడాది సత్యభామ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన కాజల్ చేతిలో ప్రస్తుతం రెండు మూడు సినిమాలున్నాయి.
ఇదిలా ఉంటే కాజల్ కొత్తగా మరో సినిమాను అనౌన్స్ చేసింది. శ్రేయాస్ తల్పడే ప్రధాన పాత్రలో వస్తోన్న ది ఇండియా స్టోరీ సినిమాలో కాజల్ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా కాజల్ తన ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ది ఇండియా స్టోరీ ఫస్ట్ షెడ్యూల్ పూణేలో మొదలైనట్టు తెలిపిన కాజల్, ఆ షెడ్యూల్ ఫస్ట్ షూట్ లో పాల్గొన్నట్టు వివరించింది.
బిగ్ స్క్రీన్ పై మునుపెన్నడూ చూడని పవర్‌ఫుల్ స్టోరీ, స్క్రీన్ ప్లే తో ఈ సినిమా రూపొందనుందని, ది ఇండియా స్టోరీలో భాగమైనందుకు సంతోషంగా ఉందని, ఈ ఏడాది ఆగస్ట్ 15న మీ క్యాలెండర్లలో మార్క్ చేసుకోమని తెలియచేస్తూ క్లాప్ పట్టుకున్న ఫోటోను కాజల్ షేర్ చేసింది. సాగర్ బీ షిండే కథను అందించిన ది ఇండియా స్టోరీకి చేతన్ డీకే దర్శకత్వం వహిస్తున్నాడు.
రైతుల కష్టాలు, వ్యవసాయ రంగంలో పురుగు మందుల వ్యాపారులు చేసే మోసాల గురించి ఈ సినిమాలో కీలకంగా చెప్పనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు నిర్మాతగా కూడా సాగర్ బీ షిండేనే వ్యవహరిస్తున్నాడు. ఇక కాజల్ విషయానికొస్తే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందుతున్న కన్నప్ప సినిమాలో పార్వతీ దేవిగా కనిపించనుంది. రీసెంట్ గా కన్నప్ప నుంచి కాజల్ లుక్ ను కూడా రివీల్ చేశారు మేకర్స్.