ఎగిరే సూపర్ కార్- బుజ్జి కోసం 7 కోట్లు?
ప్రభాస్ భైరవగా నటించిన ఈ చిత్రంలో బుజ్జి అనే రోబో కీలక పాత్రధారి. సూపర్ కార్ ని ఆపరేట్ చేసే మేధావి బుజ్జి
By: Tupaki Desk | 23 May 2024 4:29 AM GMTకల్కి 2898 AD ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో బుజ్జి పరిచయం ఆసక్తిని పెంచింది. ప్రభాస్ భైరవగా నటించిన ఈ చిత్రంలో బుజ్జి అనే రోబో కీలక పాత్రధారి. సూపర్ కార్ ని ఆపరేట్ చేసే మేధావి బుజ్జి. ఆసక్తికరంగా తొలిసారి ఒక టాలీవుడ్ సినిమాలో ఎపిక్ ఫ్లయింగ్ కార్ ని పరిచయం చేయడం ఉత్కంఠను కలిగించింది. దీని వెనుక ఉన్న ప్రత్యేక మెదడు అయిన `బుజ్జి`పైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. కల్కి 2898 AD లో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ తదితరులు నటించారు. తెలుగు, తమిళం మరియు హిందీ పరిశ్రమలకు చెందిన ప్రఖ్యాత నటులు పోషించిన ఇతర పాత్రలతో పాటు, ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, నాని, విజయ్ దేవరకొండ కూడా అతిధి పాత్రల్లో కనిపించనున్నారు.
బుజ్జి లుక్ ని లాంచ్ చేయగా, అందులో సూపర్ కార్ తో పాటు బుజ్జి లుక్ ఆశ్చర్యపరిచాయి. ఈ ఎగిరే సూపర్ కారుకు జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ వాయిస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రంలో బుజ్జి భైరవకు బెస్ట్ ఫ్రెండ్. అయితే ప్రీరిలీజ్ వేడుకలో అలరించిన ఈ కస్టమ్ మేడ్ కార్ ని ఎంత బడ్జెట్ తో నిర్మించారో తెలుసుకోవాలన్న ఆసక్తి అభిమానుల్లో ఉంది.
తాజా సమాచారం మేరకు... దాదాపు 7 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ప్రత్యేకంగా ఈ కస్టమ్ మేడ్ కార్ ని తయారు చేసారని తెలిసింది. ఇది ఒరిజినాలిటీతో నిర్మించబడిన ఎగిరే కారు అని టాలీవుడ్ సర్కిల్స్ లో ప్రచారం ఉంది. ఈ కొత్త మోడల్ కార్ ని నిర్మించేందుకు దర్శక నిర్మాతలు ఆనంద్ మహీంద్రాతో ఒప్పందంపై సంతకం చేశారు. ఈ చిత్రంలో ప్రభాస్ బుల్లెట్-ఫైరింగ్ జాకెట్‌ను రూపొందించడానికి అదనంగా మరో 2 కోట్లు ఖర్చయిందని కూడా తెలిసింది. దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన కల్కి చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల చేయాలనేది ప్లాన్. దానికి తగ్గట్టే ప్రతిదీ పకడ్భందీగా ప్లాన్ చేస్తున్నారు.
ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ కోసం డిజోర్డ్జే స్టోజిలిజ్కోవిచ్ కెమెరా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రానికి కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ కాగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.