బుజ్జి సూపర్ కార్‌లో MLA రఘురామ విన్యాసాలు
ప్రీరిలీజ్ కి ముందే బుజ్జి రోబో కార్ ని పరిచయం చేయగా మూవీపై భారీ హైప్ ని పెంచిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 3 July 2024 4:23 AM GMTప్రభాస్ నటించిన 'కల్కి 2989 ఏడి' గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో టాలీవుడ్ ఉత్సాహంగా పాల్గొంటోంది. ప్రముఖ స్టార్లంతా ఈ సినిమా కాన్వాస్ ని స్థాయిని, దర్శకుడి ప్రతిభను, ఆర్టిస్టుల నటనను ప్రశంసిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఈ చిత్రంలో భైరవ అసిస్టెంట్ గా కనిపించిన బుజ్జి- ది రోబోట్ పాత్ర ఈ విజయంలో విస్మరించలేనిది. భైరవ పాత్రను కామిక్ టచ్ తో తీర్చిదిద్దిన నాగి బుజ్జి పాత్రతో మరింతగా ఆకర్షణను పెంచడంలో సఫలమయ్యారు. ఈ బుజ్జి పాత్రకు కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ అందించారు.
ప్రీరిలీజ్ కి ముందే బుజ్జి రోబో కార్ ని పరిచయం చేయగా మూవీపై భారీ హైప్ ని పెంచిన సంగతి తెలిసిందే. తొలిసారిగా చిత్ర కథానాయకుడు ప్రభాస్ బుజ్జిని డ్రైవ్ చేసుకుంటూ రామోజీఫిలింసిటీలోని భారీ గ్రౌండ్స్ లో విన్యాసాలు చేసాడు. ఆ తర్వాత ఆనంద్ మహీంద్రా సహా పలువురు ఈ బుజ్జిని డ్రైవ్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. చాలా మంది సినీప్రముఖులు బుజ్జిని డ్రైవ్ చేసేందుకు ఆసక్తిని కనబరిచారు. కొందరు ఇప్పటికే డ్రైవ్ చేసారు కూడా.
ఇప్పుడు తేదేపా నాయకుడు 'ఉండి' నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు బుజ్జి సూపర్ కార్ ని డ్రైవ్ చేసారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భారీ జన సమూహం మధ్యలో ఈ బుజ్జిని నడిపిస్తున్న రఘురామ రియల్ హీరోలా కనిపిస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో వైసీపీ రెబల్ గా.. తేదేపాలో డేరింగ్ లీడర్ గా ఆయన ఇప్పటికే రియల్ హీరో. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టాక ఈ దూకుడును కొనసాగిస్తున్నారు. రఘురామ వర్సెస్ బుజ్జి ఎపిసోడ్ ని తిలకించేందుకు నియోజకవర్గ ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. ఆ దృశ్యాలకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
బుజ్జిని డ్రైవ్ చేయడం ముగిశాక రఘురామ కల్కి కథానాయకుడు ప్రభాస్ కు, దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత అశ్విన్ దత్ లకు, చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, దీపికా పదుకునే, దిశా పటాని తదితరులు ఈ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. తొలి నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం 500 కోట్ల క్లబ్ లో ప్రవేశించిన సంగతి తెలిసిందే.