కల్కి.. కూటమి గెలుపుతో అడ్వాంటేజ్
అయితే నేడు ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 4 Jun 2024 7:41 AM GMT"నారా చంద్రబాబు నాయుడు గారి విజయం.. రేపటి విద్యార్థుల భవిష్యత్ కోసం.. రేపటి యువత ఉపాధి కోసం.." అని సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నెలరోజుల క్రితం చేసిన సోషల్ మీడియా పోస్ట్ గుర్తుందా? ఆ సమయంలో చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నట్లు కామెంట్లు పెట్టారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే కల్కి రిలీజ్ కు ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు. కానీ అదే లేదని ఇంకొందరు నెటిజన్లు తెలిపారు.
అయితే నేడు ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. టీడీపీ-జనసేన- బీజేపీ కూటమి విజయం దిశగా పయనిస్తోంది. అత్యధిక అసెంబ్లీ స్థానాల్లో మెజార్టీలో కొనసాగుతోంది. అధికార పీఠం దక్కించుకునేలా కనిపిస్తోంది. దీంతో ఆయా పార్టీల నాయకులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. జనసేనతో పాటు పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారం తమదేనంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
కాగా.. ఇప్పుడు నెట్టింట అశ్వనీదత్ గురించే చర్చ. ప్రస్తుతం ఆయన చాలా హ్యాపీగా ఉండి ఉంటారని అనేక మంది కామెంట్లు పెడుతున్నారు. ఏపీ ఎన్నికల్లో కూటమి విజయం దిశగా పయనించడమే అందుకు కారణమని చెబుతున్నారు. ఎందుకంటే అశ్వనీదత్.. అనేక ఏళ్లుగా టీడీపీకి మద్దతు ప్రకటిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలోనూ స్పందించారు. ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు గెలవాలని ఆకాంక్షిస్తూ పోస్ట్ కూడా పెట్టారు.
అయితే కూటమి విజయం దాదాపు ఖరారు అవ్వడంతో కల్కి రిలీజ్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ డౌట్లు అన్నీ పటాపంచలు అయిపోయాయి. కల్కి మూవీ టికెట్ రేట్ల పెంపు జీవోలు ఈజీగా వస్తాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుమతి కూడా వస్తుందని అంటున్నారు. ఫ్యాన్స్ షోలు, ఎక్స్ ట్రా షో పర్మిషన్ లు.. అలా అన్ని విషయాల్లో కల్కికి తిరుగులేదని చెబుతున్నారు. మొత్తానికి కల్కి మూవీకి కూటమి విజయంతో మంచి బెనిఫిట్లే.
రూ.600 కోట్లకుపైగా భారీ బడ్జెట్ తో అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో కల్కి ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారు. అభిమానుల అంచనాలు తగ్గట్టు ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ఇప్పటికే మూవీపై భారీ బజ్ క్రియేట్ అయ్యి ఉంది. జూన్ 27వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.