బాక్సాఫీస్.. ప్రభాస్ పైనే భారమంతా!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్ కు అంతా సిద్ధమవుతోంది.
By: Tupaki Desk | 18 Jun 2024 10:30 AM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్ కు అంతా సిద్ధమవుతోంది. రూ.600 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ మూవీని పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికీ ఈ సినిమాపై మూవీ లవర్స్ లో ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ ను వినూత్నంగా నిర్వహిస్తున్నారు కల్కి మేకర్స్. అన్ని విషయాల్లో కొత్తగా ట్రై చేస్తున్నారు. ప్రభాస్ వెహికల్ బుజ్జితో దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ప్రమోట్ చేస్తున్నారు. ఆమధ్య బాహుబలి ప్రమోషన్స్ లాగా ఇండియా టూర్ వేస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఈవెంట్ జరగలేదు. దీంతో సినిమాపై అంచనాలు హై రేంజ్ లో ఉన్నా.. గ్రౌండ్ లెవెల్ లో హైప్ కాస్త మిస్ అయినట్లు తెలుస్తోంది.
ప్రమోషన్స్ వినూత్నంగా చేస్తున్నప్పటికీ... అనుకున్నంత స్థాయిలో బజ్ క్రియేట్ అవ్వలేదని టాక్. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా కోసం రాజమౌళి నార్త్ లో భారీ ప్రమోషన్స్ చేపట్టారు. అనేక ఈవెంట్లు ఏర్పాట్లు చేశారు. ఇంటర్వ్యూలు ఇచ్చారు. అంతలా ప్రమోట్ చేయగా.. హిందీలో ఆర్ఆర్ఆర్ రూ.18 కోట్ల ఓపెనింగ్స్ సాధించింది. ఫుల్ రన్ లో రూ.275 కోట్ల వసూళ్లు రాబట్టింది. అయితే కల్కి మేకర్స్.. ఇప్పటి వరకు నార్త్ లో ఎలాంటి ప్రమోషన్స్ చేయలేదు.
త్వరలో బాలీవుడ్ మీడియాతో పలు ఇంటర్వ్యూలు ప్లాన్ చేసినప్పటికీ.. అవి సరిపోవని చెబుతున్నారు సినీ ప్రియులు. ఇక పుష్ప-2 ఆగస్టు నుంచి డిసెంబర్ కు పోస్ట్ పోన్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రమోషన్స్ భారీగా చేపట్టి.. ఆగస్టులో కల్కి రిలీజ్ చేయాలని కొందరు సూచిస్తున్నారు. ఇంకా రిలీజ్ కు వారమే ఉందని, చాలా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టాల్సి అవసరం ఉందని మరికొందరు చెబుతున్నారు. అదిరిపోయే అప్డేట్లు ఇవ్వాలని కోరుతున్నారు.
ఇటీవల ఈ సినిమా నుంచి మేకర్స్.. ఫస్ట్ సింగిల్ భైరవ యాంథమ్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ సాంగ్ మిక్స్ డ్ రెస్పాన్స్ దక్కించుకుంది. పంజాబీ టచ్ ఉన్న ఆ సాంగ్ అనుకున్నంత స్థాయిలో బజ్ క్రియేట్ చేయలేదు. దీంతో ఇదే సమయంలో వేరే లెవల్ లో ఉన్న మరో ట్రైలర్ తోపాటు మిగిలిన సాంగ్స్ తో మేకర్స్ మంచి హైప్ సృష్టించాలి. లేకుంటే ప్రభాస్ పైనే మళ్లీ బర్డెన్ పడుతుంది. ఆయనే సినిమాను నడిపించి గెలిపించాలి. మరేం జరుగుతుందో చూడాలి.