కల్కి.. ఇప్పుడు తీసుకునే నిర్ణయమే అసలు గెలుపు!
కానీ ఓ క్లారిటీకి రాలేకపోయారు. మే 30, జూన్ 20.. ఈ రెండింటిలో ఒక డేట్ ఫిక్స్ చేస్తారని వార్తలు వచ్చాయి.
By: Tupaki Desk | 16 April 2024 5:57 AM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్, యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడీ మూవీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఎక్కడ చూసినా ఈ సినిమా కోసమే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ మూవీ రిలీజ్ డేట్ పై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. మేకర్స్ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. నిన్న అధికారిక ప్రకటన వస్తుందని సినీ వర్గాల్లో టాక్ వినిపించినా.. ఎలాంటి అప్డేట్ రాలేదు.
ఈ సినిమాను నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ కు లక్కీ డేట్ అయిన మే 9వ తేదీన కల్కిని విడుదల చేద్దామనుకున్నా ఏపీ ఎన్నికల వల్ల కుదరట్లేదు. దీంతో కొత్త రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ తర్జనభర్జన పడుతున్నారు. ఇటీవల డిస్ట్రిబ్యూటర్లు, ట్రేడ్ పండితులతో విస్తృతంగా చర్చలు జరిపారు. కానీ ఓ క్లారిటీకి రాలేకపోయారు. మే 30, జూన్ 20.. ఈ రెండింటిలో ఒక డేట్ ఫిక్స్ చేస్తారని వార్తలు వచ్చాయి.
అయితే జులై 14వ తేదీని కూడా మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే జూన్ లో విలక్షణ నటుడు కమల్ హాసన్ మూవీ ఇండియన్-2 రానుంది. జూన్ 13న ఈ మూవీ రిలీజ్ అవ్వడం దాదాపు ఖరారు అయింది. కల్కిలో కూడా కమల్ హాసన్ నటించడంతో జూన్ 20వ తేదీని ఆ సినిమా మేకర్స్ పక్కన పెట్టారట. అలా అని జులైలో విడుదల అనుకుంటే.. వేసవి సెలవులు అయిపోయి విద్యార్థులంతా బిజీ అయిపోతారు.
మొత్తానికి కల్కి మూవీ మేకర్స్ కు ఎన్నికల షెడ్యూల్ పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టింది. విడుదల తేదీ ఖరారు చేసుకోవడంలో నానా పాట్లు పడుతున్నారు. అలా అని జులై తర్వాత రిలీజ్ చేద్దామనుకుంటే నెలకొక పాన్ ఇండియా మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్ప-2, ఓజీ, దేవర, గేమ్ ఛేంజర్ తదితర సినిమాలు వరుసగా రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. అందుకే జులై లోపే కల్కి మూవీ రిలీజ్ అవ్వాల్సిందే.
ఇక రూ.600 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న కల్కి మూవీకి టికెట్ రేట్ల పెంపు కూడా అవసరమే. తెలంగాణలో హైక్ కాస్త ఈజీ అయినా.. ఏపీలో వైసీపీ సర్కార్ మళ్లీ అధికారంలోకి వస్తే ఇబ్బందే అనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక మరోవైపు డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కూడా ఒత్తిడి పెరుగుతోంది. అందరికి నచ్చిన డేట్ లో రిలీజ్ చేయకుంటే డీల్స్ విషయంలో మార్పులు చేయాలనే డిమాండ్ తెచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
కాబట్టి రిలీజ్ డేట్ విషయంలో ఇప్పుడు మేకర్స్ తీసుకునే నిర్ణయం మొదటి గెలుపు లాంటిది. ఏమాత్రం తొందరపడినా ఓపెనింగ్స్ పై ప్రభావం పడుతుంది. మరి వైజయంతి మూవీస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ప్రభాస్ భైరవ పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొణె, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ తో పాటు పలువురు స్టార్ యాక్టర్లు కనిపించనున్నారు.