Begin typing your search above and press return to search.

'కల్కి 2898 ఏడీ' మూవీ రివ్యూ

భారతీయ ప్రేక్షకులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న చిత్రం.. కల్కి 2898 ఏడీ. ప్రభాస్ ప్రధాన పాత్రలో 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ మెగా బడ్జెట్ సైఫై ఫాంటసీ మూవీ ఈ రోజే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

By:  Tupaki Desk   |   27 Jun 2024 4:48 AM GMT
కల్కి 2898 ఏడీ మూవీ రివ్యూ
X

'కల్కి 2898 ఏడీ' మూవీ రివ్యూ

నటీనటులు: ప్రభాస్-అమితాబ్ బచ్చన్-కమల్ హాసన్-దీపికా పదుకొనే-శోభన-సస్వత ఛటర్జీ-దిశా పఠాని-రాజేంద్ర ప్రసాద్-పశుపతి తదితరులు

సంగీతం: సంతోష్ నారాయణన్

ఛాయాగ్రహణం: జార్జ్ స్టోజికోవిచ్

నిర్మాత: అశ్వనీదత్

రచన-దర్శకత్వం: నాగ్ అశ్విన్

భారతీయ ప్రేక్షకులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న చిత్రం.. కల్కి 2898 ఏడీ. ప్రభాస్ ప్రధాన పాత్రలో 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ మెగా బడ్జెట్ సైఫై ఫాంటసీ మూవీ ఈ రోజే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ అంచనాలను 'కల్కి' ఏమేర అందుకుందో చూద్దాం పదండి.


కథ:

ప్రపంచంలో మొట్టమొదటి నగరంగా పేరున్న కాశీ.. కొన్ని శతాబ్దాల అనంతరం ఈ భూమి మీద చివరి నగరంగా మారి దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటుంది. నీరు.. గాలి సహా భూమి మీదున్న వనరులన్నింటినీ లాగేసుకుని 'కాంప్లెక్స్' అనే అత్యంత సుందరమైన మరో ప్రపంచం తయారవుతుంది. దాన్ని నడిపించే సుప్రీమ్ యాస్కిన్ (కమల్ హాసన్) భూమి ఎదుర్కొంటున్న దుస్థితికి కారకుడు. కాశీలో ఉన్న వాళ్లంతా సకల సౌకర్యాలున్న కాంప్లెక్స్ కు వెళ్లాలని ఆశపడుతుంటారు. అందులో భైరవ (ప్రభాస్) కూడా ఒకడు. కాంప్లెక్స్ చేరేందుకు తన ప్రయత్నాల్లో అతనుండగా.. సుప్రీమ్ చేపట్టిన ఓ ప్రయోగంలో భాగంగా గర్భవతి అయిన సుమతి (దీపికా పదుకొనే) అక్కడి నుంచి తప్పించుకుని బయటికి వచ్చేస్తుంది. శంబాలా అనే మరో ప్రపంచానికి చెందిన రెబల్స్ ఆమెకు అండగా నిలుస్తారు. వీరితో పాటు పాటు అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్) సైతం ఆమెకు రక్షకుడిగా మారతాడు. సుమతిని తీసుకొస్తే కాంప్లెక్స్ కు వెళ్లే అవకాశం వస్తుందని తెలిసి భైరవ.. అశ్వత్థాముడితో పాటు శంబాలా నగర వాసులను ఎదిరించడానికి సిద్ధపడతాడు. మరి ఈ పోరాటంలో ఎవరు గెలిచారు.. చివరికి సుమతి ఏమైంది.. ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ పరిస్థితేంటి.. ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.


కథనం-విశ్లేషణ:


ఒక సినిమాకు అవసరమైనంత డ్రామా మనుషుల జీవితాల్లో ఉండదు. కాబట్టే నిజ జీవిత కథల్లో డ్రామాను పండించి.. ప్రేక్షకులను ఎమోషనల్ గా కదిలించడం అంత తేలికైన విషయం కాదు. కానీ నాగ్ అశ్విన్ అనే యువ దర్శకుడు మహానటి సావిత్రి కథలో అత్యద్భుతంగా డ్రామా పండించి ఔరా అనిపించాడు. సినిమాలో డ్రామా ఎలా పండించాలి.. దాంతో ప్రేక్షకులను కదిలించాలి.. అనే టాపిక్ మీద ఈ సినిమాను ఒక పాఠం లాగా బోధించవచ్చంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి సినిమా తీసిన దర్శకుడు ప్రభాస్ ప్రధాన పాత్రలో హాలీవుడ్ స్టైల్ సైఫై మూవీ తీస్తున్నాడంటే ప్రేక్షకుల్లో అనేక సందేహాలు కలిగాయి. నాగ్ అశ్విన్ కథ బాగా చెప్పగలడు- డ్రామా పండించగలడు కానీ.. విజువల్ ఎఫెక్ట్స్ తో మాయాజాలం సృష్టించగలడా.. ప్రభాస్ ఇమేజ్ కు తగ్గట్లు యాక్షన్ పండించగలడా.. రాజమౌళి స్థాయిలో తెర మీదికి భారీతనాన్ని తీసుకురాగలడా.. అన్న ప్రశ్నలు తలెత్తాయి. కానీ ఆశ్చర్యం ఏంటంటే.. నాగి ఇండియన్ స్క్రీన్ మీద నభూతో అనిపించేలా విజువల్ అద్భుతాలను ఆవిష్కరించాడు. కళ్లు చెదిరే యాక్షన్ ఘట్టాలతో ఔరా అనిపించాడు. భారీతనం విషయంలో రాజమౌళిని కూడా మించిపోయాడు. కానీ ఈ అంశాల్లో అంచనాలను దాటిపోయిన నాగ్ అశ్విన్.. కథ చెప్పడంలో.. డ్రామా పండించడంలో తన బలాన్ని మాత్రం చూపించలేకపోయాడు. 'కల్కి 2898 ఏడీ' కథ కోసం నాగి పడ్డ కష్టాన్ని.. అతను చేసిన కసరత్తును తక్కువ చేయలేం.. కానీ ఈ కథను ఆసక్తికరంగా చెప్పడంలో.. దీంతో ప్రేక్షకులకు ఎమోషనల్ కనెక్ట్ ఏర్పరచడంలో మాత్రం అతను పూర్తిగా విజయవంతం కాలేకపోయాడు. కానీ విజువల్ గా మాత్రం 'కల్కి 2898 ఏడీ' ఒక వండరే. మనం చూస్తున్నది భారతీయ చిత్రమేనా అనిపించే స్థాయిలో నాగ్ అశ్విన్ అండ్ టీం ఆవిష్కరించిన అద్భుతాల గురించి ఎంత చెప్పినా తక్కువే.

ప్రతి యుగంలోనూ ధర్మం గతి తప్పినపుడు.. అరాచకం రాజ్యమేలుతున్నపుడు మహా విష్ణువు కల్కి అవతారం ఎత్తి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తాడని పురాణాలు చెబుతున్నాయి. మరి కలియుగం చివర్లో ఒక నరరూప రాక్షసుడి కారణంగా భూమి ఉనికే ప్రశ్నార్థకంగా మారితే.. ఆ దశలో పీడిత ప్రజల కోసం కల్కి కొత్త అవతారం ఎత్తితే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి ఈ కథను అల్లుకున్నాడు నాగ్ అశ్విన్. ఓవైపు మన చరిత్ర లోతుల్లోకి వెళ్లి మహాభారత నేపథ్యంలో ఓ కథను చెబుతూనే.. ఇంకోవైపు భవిష్యత్ దర్శనం చేయించడం అన్నది అద్భుతమైన ఆలోచన. 'ఆదిత్య 369' తరహాలో మళ్లీ అలాంటి అరుదైన.. అసాధారణమైన కథతో సాగుతుంది 'కల్కి'. పురాణాలను టచ్ చేస్తూ సాగే కథ కానీ.. అందులోని పాత్రలు కానీ.. సంబంధిత సన్నివేశాలు కానీ ప్రేక్షకులను అమితాసక్తి కలిగిస్తాయి. ముఖ్యంగా అమితాబ్ పోషించిన అశ్వత్థామ పాత్ర అన్నింట్లోకి ప్రత్యేకంగా అనిపిస్తుంది. దాంతో ముడిపడ్డ ప్రతి సన్నివేశం హైలైట్ గా నిలుస్తుంది. ఐతే నాగి ఎంచుకున్న మూల కథాంశం.. దానికి భవిష్యత్తుతో ముడిపెట్టిన తీరు గొప్పగా అనిపించినా.. కథా విస్తరణ మాత్రం అంత పకడ్బందీగా సాగలేదనిపిస్తుంది. భవిష్యత్తు నేపథ్యంలో సాగే కథ మాత్రం కొంచెం గందరగోళంగా.. చాలా చోట్ల అనాసక్తికరంగా అనిపిస్తుంది.

మళ్లీ కల్కి అవతరించాలి అంటే.. అందుకు దారి తీసే పరిస్థితులు తీవ్రంగా అనిపించాలి. విలన్ చేసే అరాచకాలు భరించలేని విధంగా ఉండాలి. కానీ ఇందులో విలన్ ఇంతకుముందు ఏం చేశాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అన్నదే క్లారిటీగా చూపించలేదు. భూమి నుంచి అంతా లాగేశాడు అంటారే తప్ప.. అతను చేసిన అరాచకం ఏంటన్నది వివరంగా చూపించలేదు. మహిళల గర్భం ద్వారా విలన్ శక్తిమంతుడిగా మారే ప్రయోగం.. దాని చుట్టూ నడిపిన సన్నివేశాలు కూడా గందరగోళంగా.. అనాసక్తికరంగా అనిపిస్తాయి. ఈ కథతో నాగి ఏం చెప్పాలనుకున్నాడు అన్నది అర్థం చేసుకోవడమే ఇక్కడ పెద్ద టాస్క్. ప్రపంచంలో చివరి నగరంగా మిగిలిన కాశీ.. భూమి నుంచి అన్నీ లాగేసుకున్న కాంప్లెక్స్.. కాంప్లెక్స్ కు వ్యతిరేకంగా పోరాడే రెబల్స్ ఉన్న శంబాలా అంటూ.. మూడు భిన్న ప్రపంచాలను చూపించారు 'కల్కి'లో. ఐతే ఈ మూడింట్లో దేన్నీ ప్రేక్షకుల్లో బాగా రిజిస్టర్ అయ్యేలా చూపించలేదు దర్శకుడు. విజువల్ గా వేటికవే ప్రత్యేకంగా అనిపించినా.. ఎమోషనల్ గా వేటితోనూ అంత కనెక్ట్ కాలేం. అన్నీ ప్రేక్షకులకు విడమరిచి చెప్పాల్సిన పని లేదని అతను అనుకున్నాడేమో కానీ.. చాలా చోట్ల సరైన డీటైలింగ్ లేక.. కథలో లింకులు కుదరక ప్రేక్షకుడు అయోమయానికి గురవుతాడు. అమితాబ్ బచ్చన్ పోషించిన అశ్వత్థామను మినహాయిస్తే.. ప్రభాస్ సహా మిగతా ముఖ్య పాత్రల క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ సైతం సరిగా జరగకపోవడం వల్ల ఆ పాత్రలతో ప్రేక్షకులకు ఎమోషనల్ కనెక్ట్ ఆశించిన స్థాయిలో ఏర్పడదు. అన్నింటికీ మించి 'కల్కి'లో డ్రామా సరిగా పండలేదు.

ఈ లోపాలు ఎలా ఉన్నప్పటికీ మూడు గంటల పాటు ప్రేక్షకులను మరో ప్రపంచంలో విహరింపజేస్తూ.. నోరెళ్లబెట్టేలా చేయడంలో మాత్రం 'కల్కి' విజయవంతమైంది. సినిమా మొదలైన కొన్ని నిమిషాలకే దర్శకుడు మనల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లిపోతాడు. పాత్రలు.. వాటి మాట తీరు.. అక్కడ జరిగే విషయాలు అన్నీ కూడా మనం చూస్తున్నది వేరే ప్రపంచం అనే ఫీలింగ్ కలిగిస్తాయి. కొంచెం నెమ్మదిగా మొదలయ్యే కథలో ప్రభాస్ రంగ ప్రవేశంతో ఊపు వస్తుంది. ఓవైపు హీరో ఎలివేషన్లకు లోటు లేకుండా చూస్తూనే ప్రభాస్ పాత్ర ద్వారా వినోదాన్ని పండించడానికి కూడా ట్రై చేశాడు నాగి. మరోవైపు విలన్ పాత్ర పరిచయ సన్నివేశాలు కూడా ఆసక్తి రేకెత్తిస్తాయి. ప్రథమార్ధంలో కొంచెం ఎత్తు పల్లాలతో సాగినా.. ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రేక్షకుల మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తుంది. ద్వితీయార్ధంలో ఒక దాని తర్వాత ఒకటి వచ్చే భారీ యాక్షన్ సీక్వెన్సులు సినిమాకు హైలైట్. ముఖ్యంగా ప్రభాస్-అమితాబ్ ఫేసాఫ్ సీన్లు వారెవా అనిపిస్తాయి. అశ్వత్థామ పాత్ర తెరపై కనిపించిన ప్రతిసారీ ప్రేక్షకులు కళ్లు విప్పార్చి చూస్తారు. హీరోను మించి ఆ పాత్ర హైలైట్ అయింది. మధ్యలో శంబాలా నేపథ్యంలో వచ్చే కొన్ని సీన్లు బోరింగ్ అనిపించినా.. చివరి అరగంటలో మాత్రం 'కల్కి' ప్రేక్షకులను ఉర్రూతలూగించేస్తుంది. ఇప్పటికే 'బాహుబలి'తో రాజమౌళి.. 'రోబో'-'2.0'తో శంకర్ లాంటి దర్శకులు ఇండియన్ స్క్రీన్ మీద వీఎఫెక్స్ అద్భుతాలను ఆవిష్కరించినప్పటికీ.. వాటిని మించే స్థాయిలో నాగ్ అశ్విన్ కళ్లు చెదిరే రీతిలో విజువల్ మాయాజాలాన్ని సృష్టించాడు. 'విజువల్ వండర్' అనే మాటకు సరైన అర్థం చెప్పేలా సాగుతుంది చివరి అరగంట. మరోసారి మనం చూస్తున్నది ఇండియన్ మూవీయేనా అనే సందేహం కలిగేలా చేస్తాయి పతాక సన్నివేశాలు. చివర్లో ప్రభాస్ పాత్రకు ఇచ్చిన 'చారిత్రక' టచ్ కూడా గూస్ బంప్స్ ఇస్తుంది. కథను మధ్యలో ఆపడం నిరాశ కలిగించినా 'కల్కి' యూనివర్శ్ కొనసాగుతుందని చెప్పడం ఉత్తేజాన్నిస్తుంది. మొత్తంగా చూస్తే 'కల్కి' విజువల్స్ పరంగా ఇండియన్ స్క్రీన్ మీద మరో అద్భుతం అనడంలో సందేహం లేదు. ఐతే కథను ప్రేక్షకులకు మరింత ఎమోషనల్ గా కనెక్ట్ చేయించగలిగి ఉంటే.. డ్రామా ఇంకా బాగా పండి ఉంటే 'కల్కి' స్థాయే వేరుగా ఉండేది. ఎత్తుపల్లాలున్నప్పటికీ ఇది బిగ్ స్క్రీన్ మీద మిస్ కాకూడని సినిమా అనడంలో సందేహం లేదు.


నటీనటులు:


'బాహుబలి' తర్వాత ప్రభాస్ బెస్ట్ లుక్ లో కనిపించిన సినిమా 'కల్కి' అనడంలో సందేహం లేదు. తనకున్న లార్జర్ దన్ లైఫ్ ఇమేజ్ కు సూటయ్యే పాత్రనే చేశాడు ప్రభాస్ ఇందులో. ఇంకా పరివర్తన చెందని.. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కావడంతో తనను 'హీరో' అని చెప్పలేం. కథలో తన ప్రాధాన్యం కూడా తక్కువే అనిపిస్తుంది. కానీ కనిపించిన ప్రతి సీన్లోనూ అభిమానులను అలరించాడు ప్రభాస్. సీరియస్ గా సాగే సినిమాలో సరదాగా సాగే ప్రభాస్ పాత్ర రిలీఫ్ ఇస్తుంది. యాక్షన్ ఘట్టాలు ప్రభాస్ స్థాయికి తగ్గట్లు భారీగా డిజైజ్ చేశారు. అవి అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులను అలరిస్తాయి. కానీ కథలో కీలకమైన ఎపిసోడ్లు వచ్చినపుడు అతను పూర్తిగా సైడ్ అయిపోయాడు. బహుశా నెక్స్ట్ పార్ట్ లో ప్రభాస్ రోల్ కీలకంగా ఉండొచ్చు. స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ అమితాబ్ బచ్చన్ పాత్ర.. దాని ఇంపాక్ట్ వేరే లెవెల్ అని చెప్పాలి. అమితాబ్ తప్ప ఇంకెవరు చేసినా అశ్వత్థామ పాత్ర అంత గొప్పగా అనిపించేది కాదేమో. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. దీపికా పదుకొనే అత్యంత కీలకమైన పాత్రలో రాణించింది. తన నటన ఆకట్టుకుంటుంది. కమల్ హాసన్ గుర్తుపట్టలేని అవతారంలో కొన్ని నిమిషాలే కనిపించాడు. తన వాయిస్ తోనే ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆయన పలికిన సంభాషణలు హైలైట్ గా నిలిచాయి. కల్కి కథలో మెయిన్ విలన్ కమలే అయినా.. సస్వత ఛటర్జీనే సినిమాలో హైలైట్ అయ్యాడు. 'కల్కి-1' వరకు ఆయన్నే ప్రధాన విలన్ గా భావించాలి. సహాయ పాత్రల్లో శోభన.. రాజేంద్ర ప్రసాద్.. పశుపతి.. వీళ్లంతా తమ అనుభవాన్ని చూపించారు. మిగతా ఆర్టిస్టులు ఓకే.


సాంకేతిక వర్గం:

'కల్కి' ట్రూ వరల్డ్ క్లాస్ మూవీ అనిపించేలా సాంకేతిక నిపుణులంతా అద్భుత పనితనం చూపించారు. సంతోష్ నారాయణన్ సంగీతం ప్రేక్షకులను ఉత్తేజితులను చేస్తుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్లో ఇంటెన్స్ గా సాగుతుంది. పాటలు సోసోగా అనిపించినా బీజీఎం విషయంలో మాత్రం సంతోష్ అదరగొట్టేశాడు. జార్జ్ స్టోజికోవిచ్ ఛాయాగ్రహణం గొప్పగా సాగింది. ఆర్ట్ వర్క్.. విజువల్ ఎఫెక్ట్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక తెలుగు సినిమాలో ఇలాంటి దృశ్యాలు చూస్తున్నామా అని ఆశ్చర్యపోయేలా ప్రొడక్షన్ డిజైన్.. విజువల్ ఎఫెక్ట్స్ విభాగాలు అద్భుతమైన ఔట్ పుట్ తీసుకొచ్చాయి. ఇలాంటి సినిమాకు వెన్నుదన్నుగా నిలిచి రాజీ లేకుండా నిర్మించిన వైజయంతీ మూవీస్ ను అభినందించాల్సిందే. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఊహాశక్తికి సెల్యూట్ కొట్టాల్సిందే. ఇలాంటి ఓ కథ రాయడం.. దానికి ఇలాంటి దృశ్యరూపం ఇవ్వడం మామూలు విషయం కాదు. విజువల్ గా అతను చూపించిన అద్భుతాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కాకపోతే 'మహానటి'లో అతను చూపించిన కథన నైపుణ్యం మాత్రం ఇందులో కనిపించలేదు. ఎన్నో లేయర్స్ ఉన్న కథను అతను మరింత సరళంగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది. అందుకోసం వాయిస్ ఓవర్ ను ఎంచుకుని ఉంటే బాగుండేదేమో.


చివరగా: కల్కి.. కంటికి ఇంపు మనసుకు కొరత


రేటింగ్ - 2.75 /5