'బుక్ మై షో'లో 'కల్కి' మతలబేంటి?
సర్వర్ డౌన్ అని పైకి చెప్పారు తప్ప.. ఆ టైంలో టికెట్లను బ్లాక్ చేసే కార్యక్రమం జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 24 Jun 2024 12:36 PM GMTఈ ఏడాది అనే కాక మొత్తంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీలోనే మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటైన ‘కల్కి 2898 ఏడీ’ విడుదలకు ఇంకో మూడు రోజులే సమయం ఉంది. నిన్న సాయంత్రమే ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. తెలంగాణలో ఏ షోకు టికెట్లు పెట్టినా నిమిషాల్లో సోల్డ్ ఔట్ అయిపోయాయి. హై డిమాండ్ వల్ల ‘బుక్ మై షో’ సర్వర్ కూడా డౌన్ అయ్యే పరిస్థితి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. దేశంలో ‘కల్కి’ టికెట్లు రిలీజైన ప్రతిచోటా ఇలాంటి డిమాండే కనిపించింది. ఐతే హైదరాబాద్ వరకు ‘కల్కి’ టికెట్ల అమ్మకాల్లో పెద్ద స్కాం నడుస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్వర్ డౌన్ అని పైకి చెప్పారు తప్ప.. ఆ టైంలో టికెట్లను బ్లాక్ చేసే కార్యక్రమం జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పలు థియేటర్లలో టికెెట్ల కోసం ప్రయత్నించినపుడు.. టికెట్లు అందుబాటులో ఉన్నట్లు ‘గ్రీన్’ కలర్ లో చూపించడం.. ఆ టికెట్లను బుక్ చేయడానికి ట్రై చేస్తే ఎర్రర్ రావడం.. ఏ టికెట్ సెలక్ట్ చేసుకున్నా.. ఎన్నిసార్లు ప్రయత్నించినా అవి బుక్ కాకపోవడం.. కాసేపటి తర్వాత చూస్తే అవన్నీ బుక్ అయిపోయినట్లు చూపించడం.. ఇదీ తంతు. దీని వెనుక వేరే స్కెచ్ ఉందని అనుమానిస్తున్నారు. టికెట్లు అందుబాటులో ఉన్నట్లు చూపించి.. అవి బుక్ కాకుండా ఎర్రర్ వచ్చేలా చేసి.. వాటిని థియేటర్ల యాజమాన్యాలే బ్లాక్ చేశాయని.. వాటిని తమకు కావాల్సిన వాళ్లకు ఇచ్చుకోవడం లేదా బ్లాక్‌లో అమ్ముకోవడం జరుగుతుందని.. ‘బుక్ మై షో’తో కుమ్మక్కయి ఇదంతా చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరులోనూ పలు థియేటర్లు ఇలా చేశాయని.. ఇంకా కూడా చాలా షోలకు టికెట్లు అందుబాటులో ఉన్నట్లు చూపిస్తూనే అవి బుక్ కాని విధంగా స్కెచ్ వేశారని అంటున్నారు.