కల్కి 2898 AD.. పురాతన ఆలయంలో అతడెవరు?
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ తలపెట్టిన మహాయజ్ఞం- కల్కి 2898 ఏడి చిత్రంలో అమితాబ్ పాత్ర ఎంత ప్రత్యేకమైనదో ఇప్పుడు ప్రీలుక్ తో స్పష్ఠత వచ్చేసింది.
By: Tupaki Desk | 20 April 2024 4:13 PM GMTసానబట్టే కొద్దీ వజ్రం ఇంకా ఇంకా మెరుస్తుంది. నటుడిగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఒక వజ్రం. ఈ సీనియర్ నటుడు దశాబ్ధాలుగా సినీవినీలాకాశంలో మెరుస్తూనే ఉన్నాడు. కెరీర్‌లో ఎన్నో విలక్షణమైన, ప్రయోగాత్మకమైన పాత్రల్లో నటించిన ఘనత అమితాబ్ సొంతం. ఇంతకుముందు సైరా నరసింహారెడ్డి చిత్రంలో నరసింహారెడ్డికి గురువు పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు అమితాబ్. ఇప్పుడు కూడా మరో తెలుగు సినిమాలో బృహత్తరమైన పాత్రను పోషిస్తున్నారు. ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ తలపెట్టిన మహాయజ్ఞం- కల్కి 2898 ఏడి చిత్రంలో అమితాబ్ పాత్ర ఎంత ప్రత్యేకమైనదో ఇప్పుడు ప్రీలుక్ తో స్పష్ఠత వచ్చేసింది.
గత సంవత్సరం అమితాబ్ బచ్చన్ పుట్టినరోజున ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ అయింది. ఎప్పటి నుంచో ఈ చిత్రంలో అమితాబ్ లుక్, పాత్ర స్వభావం గురించి తెలుసుకోవాలని వివరాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి క్యూరియాసిటీకి తగ్గట్టుగానే.. ఈ సినిమా నుంచి సరికొత్త పోస్టర్ ఇప్పుడు హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం సహా వివిధ భాషలలో షేర్ అయింది. అమితాబ్ బచ్చన్ పూర్తిగా తెల్లటి దుస్తులు ధరించి ఒక ఆలయం లోపల కూర్చుని, ప్రకాశవంతమైన కాంతి కిరణం వైపు చూస్తూ కనిపించారు. ఈ పోస్టర్ లో అమితాబ్ రూపాన్ని చూడగానే ఆయన అన్నిటినీ వదులుకున్న ఒక సన్యాసి అని అర్థమవుతోంది. ఆలయ ప్రాంగణం సాలె గూళ్లతో అత్యంత పురాతనమైనదని అర్థమవుతోంది. ఈ పోస్టర్ లో కేవలం బిగ్ బి కళ్లు మాత్రమే పోస్టర్ లో కనిపిస్తున్నాయి. ఇతర శరీర భాగాలేవీ కనిపించకుండా అతడు ధరించిన ఆ దుస్తులు కవరప్ చేస్తున్నాయి. అసలు అతడి తాలూకా రహస్యం ఏమిటన్నది 21 ఏప్రిల్ అంటే ఆదివారం సాయంత్రం 7.15 పీఎంకి రివీల్ కానుంది.
తాజాగా రిలీజైన పోస్టర్ త్వరలో వెలువడనున్న భారీ ప్రకటన కోసం నిరీక్షణను పెంచింది. పోస్టర్‌లో ``సమయ్ ఆ గయా హై`` అని కనిపించింది. కల్కి 2898 AD గత సంవత్సరం శాన్ డియాగో కామిక్-కాన్‌లో సంచలనాత్మక అరంగేట్రం చేసిన తర్వాత ప్రపంచవ్యాప్త ప్రశంసలను పొందింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కల్కి 2898 AD బహుభాషల్లో విడుదల కానుంది. ఇది భవిష్యత్ ప్రపంచం ఎలా ఉండబోతోందో ఆవిష్కరించే చిత్రమని దర్శకుడు వెల్లడించారు.