Begin typing your search above and press return to search.

బాలీవుడ్ పై టాలీవుడ్ డామినేషన్ అంటే ఇదే!

‘కల్కి’ మూవీ తొలి రోజు నుంచే హిందీలో మంచి కలెక్షన్లు సాధిస్తూ వచ్చింది.

By:  Tupaki Desk   |   8 July 2024 11:26 AM GMT
బాలీవుడ్ పై టాలీవుడ్ డామినేషన్ అంటే ఇదే!
X

'కల్కి 2898 AD' సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. 11 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, రూ. 1000 కోట్ల మైల్ స్టోన్ మార్క్ కు అడుగు దూరంలో నిలిచింది. ప్రభాస్ నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ నార్త్ సర్క్యూట్స్ లో భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే బాలీవుడ్ లో డబుల్ సెంచరీ కొట్టిన ఈ చిత్రం.. ఈరోజుతో 2024లో అత్యధిక వసూళ్లు రాబట్టిన హిందీ సినిమాగా అవతరించింది.

‘కల్కి’ మూవీ తొలి రోజు నుంచే హిందీలో మంచి కలెక్షన్లు సాధిస్తూ వచ్చింది. సినిమాలో ప్రభాస్‌ - అమితాబ్‌ బచ్చన్ ల యాక్షన్‌ సీక్వెన్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ టేకింగ్‌, దీపికా పదుకునే, దిశా పటానీ.. వంటి అంశాలు ఉత్తరాది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో కల్కి పదకొండు రోజుల్లోనే ₹ 212.50 కోట్లు కొల్లగొట్టింది. ‘బాహుబలి 2’, RRR తర్వాత హిందీలో ₹ 200 కోట్లు వసూలు చేసిన సినిమా ఇదే. ప్రభాస్ కు మాత్రం ఇది రెండో 200 కోట్ల మూవీ కావడం గమనార్హం.

స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన 'ఫైటర్' సినిమా ₹ 215 కోట్ల వసూళ్లతో, 2024లో హయ్యెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన హిందీ చిత్రంగా టాప్ లో నిలిచింది. ఈరోజు 'కల్కి 2898 ఏడీ' చిత్రం దాన్ని క్రాస్ చేసి అగ్ర స్థానానికి చేరుకుంది. ఒక తెలుగు డబ్బింగ్ మూవీ బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు అందుకున్న చిత్రంగా నిలవడం మామూలు విషయం కాదు. అది కూడా కేవలం 12 రోజుల్లోనే ఈ ఘనత సాధించడం విశేషమనే చెప్పాలి. ఇది ఇప్పుడు బాలీవుడ్ మీద టాలీవుడ్ డామినేషన్ నడుస్తోందనే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది.

నిజానికి 'బాహుబలి' సినిమా నుంచే నార్త్ ఆడియన్స్ మన తెలుగు సినిమాలను విశేషంగా ఆదరిస్తున్నారు. 'బాహుబలి 2' చిత్రం హిందీలో ₹ 511 కోట్లు కలెక్ట్ చేయగా.. RRR (₹ 274 cr), సలార్ (₹ 170 cr), సాహో (₹ 145 cr), ఆదిపురుష్ (₹ 140 cr), బాహుబలి (₹ 119 cr), పుష్ప-1 (₹ 108 cr) సినిమాలు బాలీవుడ్ లో భారీ వసూళ్లు సాధించిన టాప్-10 సౌత్ చిత్రాల జాబితాలో ఉన్నాయి. 'హనుమాన్' మూవీ సైతం ₹ 58 కోట్లతో ఈ ఏడాది హయ్యెస్ట్ గ్రాస్ హిందీ చిత్రాల లిస్టులో చేరింది. ఇప్పుడు 'కల్కి 2898 AD' హిందీలో రూ. 200 కోట్లకు పైగా వసూళ్లతో అత్యధిక కలెక్షన్స్ సాధించిన హిందీ సినిమాగా రికార్డు సృష్టించింది.

ఈ ఏడాదిలోనే మరికొన్ని తెలుగు చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయడానికి రెడీ అవుతున్నాయి. అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప 2' మూవీ కోసం నార్త్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ట్రిపుల్ ఆర్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల నుంచి 'దేవర 1' & 'గేమ్ చేంజర్' పెద్ద సినిమాలు వస్తున్నాయి. 'డబుల్ ఇస్మార్ట్' లాంటి మరికొన్ని తెలుగు చిత్రాల గురించి హిందీ జనాలు మాట్లాడుకుంటున్నారు. మరి వీటిల్లో ఏవేవి నార్త్ బెల్ట్ లో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుంటాయో చూడాలి.