కల్కి ఓటీటీ రిలీజ్‌పై ఉత్కంఠ
చాలా కాలం తర్వాత యూనివర్శల్ అప్పీల్ తో పాన్ ఇండియన్ ఆడియెన్ ని మెప్పించడంలో మరో కొత్త దర్శకుడు సఫలమయ్యారు.
By: Tupaki Desk | 13 Aug 2024 7:08 AM GMT2024లో అసలు సిసలైన బ్లాక్ బస్టర్ హిట్ `కల్కి 2989 ఎడి`. ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపిక వంటి తారల అద్భుత నటన.. నాగ్ అశ్విన్ దర్శకత్వ ప్రతిభ.. ఎంపిక చేసుకున్న కథాంశం, బడ్జెట్.. కాన్వాస్.. విజువల్ గ్రాఫిక్స్.. ఇలా అన్ని విభాగాల్లో పరిపూర్ణతతో ఈ సినిమా దిగ్గజాలను సైతం మెప్పించింది. కొన్ని విమర్శలు ఉన్నా, కొన్ని లోపాలు ఉన్నా కానీ వాటిని ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. మైనస్ ల కంటే ప్లస్ లు ఎక్కువ కాబట్టి ఈ చిత్రాన్ని 1000 కోట్ల క్లబ్ లోకి చేర్చే వరకూ ప్రజలు విశ్రమించలేదు. కల్కి లైఫ్ టైమ్ లో సుమారు 1200 కోట్లు పైగా వసూలు చేసింది. జవాన్, పఠాన్ సహా ఎన్నో సినిమాల బాక్సాఫీస్ రికార్డులను ఇది బ్రేక్ చేసింది.
చాలా కాలం తర్వాత యూనివర్శల్ అప్పీల్ తో పాన్ ఇండియన్ ఆడియెన్ ని మెప్పించడంలో మరో కొత్త దర్శకుడు సఫలమయ్యారు. తెలుగు వాడైన నాగ్ అశ్విన్ కి ఈ ఘనత దక్కింది. దశాబ్ధాల సుదీర్ఘ చరిత్రలో ఎన్నో క్లాసిక్ హిట్స్ ని అందించిన వైజయంతి మూవీస్ చాలా కాలంగా ఎదురు చూస్తున్న గొప్ప విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. చిత్రనిర్మాతలు స్వప్నాదత్, ప్రియాంక దత్- అశ్విని దత్ లలో ఈ సినిమా విజయాన్ని గర్వంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇది వారిలో గొప్ప ఉత్సాహం పెంచింది. రెట్టించిన ఉత్సాహంతో ఇప్పుడు కల్కి పార్ట్ 2 తెరకెక్కించేందుక కసరత్తును సాగిస్తున్నారు.
అదంతా అటుంచితే కల్కి చిత్రంపై పండిత వర్గాల్లో కొన్ని విమర్శలు ఉన్నాయి. చాలామంది క్రిటిక్స్ దీనిపై రంధ్రాన్వేషణను సాగించి కొన్ని విమర్శలు కూడా చేసారు. అయితే పెద్ద తెరపై భారీ వీఎఫ్ఎక్స్ లో వీక్షించే సామాన్య ప్రజలకు ఇవేవీ పెద్దంతగా పట్టలేదు. కానీ ఇప్పుడు ఓటీటీలోకి వస్తున్న వేళ మరోసారి ఇలాంటి చిన్నపాటి తప్పిదాలను మరోసారి గుర్తించే వీలుందని భావిస్తున్నారు. ఈ చిత్రం 23 ఆగస్ట్ 2024న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. సరిగ్గా శ్రీకృష్ణ జన్మాష్ఠమికి మూడు రోజుల ముందు కల్కి చిత్రాన్ని స్ట్రీమ్ చేస్తుండడం ఆశ్చర్యపరుస్తోంది. కల్కి చిత్రంలో కృష్ణావతారాన్ని, అర్జునుడు, కర్ణుడి పోరాటాన్ని కూడా ప్రజలు చూడగలిగారు. అందువల్ల యాధృచ్ఛికంగానే జన్మాష్ఠమి ముందు ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్నా దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే ఓటీటీ స్ట్రీమింగ్ విడుదలలో థియేట్రికల్ రీల్ నుండి దాదాపు 6 నిమిషాల ఫుటేజీని తగ్గించే అవకాశం ఉందని కొన్ని ఊహాగానాలు సాగుతున్నాయి. ఇటీవలి కొన్ని సినిమాలు ఓటీటీలోకి వచ్చాక తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొనడంతో ఇప్పుడు కల్కి విషయంలో ట్రిమ్డ్ వెర్షన్ ని రిలీజ్ చేసేందుకు ఆస్కారం ఉందని ఊహిస్తున్నారు. ఓటీటీల్లో ప్రజలు ప్రతిదీ తరచి చూస్తారు. తప్పు ఒప్పులను గుర్తిస్తారు. రంధ్రాన్వేషణ చేస్తారు గనుక ఈ జాగ్రత్తలు తీసుకునే వీలుందని చెబుతున్నారు.