Begin typing your search above and press return to search.

షాకింగ్: ప్రభాస్ 'కల్కి'కి బదులుగా రాజశేఖర్ మూవీకి టికెట్లు!

By:  Tupaki Desk   |   23 Jun 2024 5:21 PM GMT
షాకింగ్: ప్రభాస్ కల్కికి బదులుగా రాజశేఖర్ మూవీకి టికెట్లు!
X

ఇప్పుడు ఎక్కడ చూసినా 'కల్కి' గురించే చర్చలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో 'KALKI 2898 AD' హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో నడుస్తోంది. ఎందుకంటే డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, యావత్ సినీ అభిమానులందరూ ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ సినిమా.. మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అయితే బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేసుకోవాలనుకున్న వారు గందరగోళానికి గురయ్యే పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది.

ఆల్రెడీ ఓవర్ సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో 'కల్కి 2898 AD' సినిమా దూసుకుపోతోంది. తమిళనాడు, కర్ణాటకలలోనూ బుకింగ్స్ తెరిచారు. టికెట్ రేట్లు పెంచుకోడానికి, అదనపు షోలు వేసుకోడానికి ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో.. తాజాగా తెలంగాణాలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఉదయం ఐదు గంటల నుంచే షోలు పడబోతున్నాయి. బుక్ మై షోలో బుకింగ్స్ ఓపెన్ చేసిన కొన్ని క్షణాల్లోనే భారీగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అయితే కొన్ని ఏరియాల్లో టికెట్లు బుక్ చేసుకున్న అభిమానులకు ఊహించని అనుభవం ఎదురైంది. ప్రభాస్ సినిమాకు బదులుగా డా. రాజశేఖర్ చిత్రానికి టికెట్లు బుక్ అయినట్లు తెలుస్తోంది.

'కల్కి' అనే టైటిల్ తో ప్రభాస్ కంటే ముందుగా రాజశేఖర్ ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఇది వచ్చి ఐదేళ్లు అయినప్పటికీ, ఇప్పుడు బుక్ మై షోలో 'కల్కి' అని సెర్చ్ చేస్తే, ప్రభాస్ మూవీతో పాటుగా రాజశేఖర్ సినిమా కూడా వస్తోంది. అయితే టికెట్లు అయిపోతాయేమో అనే ఆతృతలో కొందరు పొరపాటున 'కల్కి 2898 AD' చిత్రానికి బదులుగా ప్రశాంత్ వర్మ 'కల్కి' మూవీకి టికెట్లు బుక్ చేసుకున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

కూకట్‌ పల్లి భ్రమరాంబ థియేటర్ లో పొరపాటున ప్రభాస్ కల్కికి బదులుగా, రాజశేఖర్ కల్కి సినిమాకి టికెట్స్ బుక్ అయ్యాయని.. 6 షోలు హౌస్‌ ఫుల్‌ అయ్యాయని ఓ నెటిజన్ ఎక్స్ లో పోస్ట్ చేశాడు. దీనికి హీరో రాజశేఖర్ స్పందిస్తూ, ఈ వ్యవహారంతో తనకేమీ సంబంధం లేదంటూ ఫన్నీ ట్వీట్ చేశారు. "నాకు అస్సలు సంబంధం లేదు.. జోకులు పక్కన పడితే, డియర్ ప్రభాస్, నాగ్ అశ్విన్, మా అశ్వినీదత్ గారి వైజయంతి ఫిల్మ్స్, స్టార్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ శుభాకాంక్షలు! మీరు 'కల్కి 2898 ad' చిత్రంతో చరిత్ర సృష్టించి, చిత్ర పరిశ్రమను ఒక అడుగు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను" అని రాజశేఖర్ పేర్కొన్నారు.

నిజానికి బుక్ మై షోలో కల్కి అని సెర్చ్ చేస్తే.. రాజశేఖర్, ప్రభాస్ సినిమాలతో పాటుగా టొవినో థామస్ నటించిన మలయాళ 'కల్కి' చిత్రం కూడా చూపిస్తోంది. కాకపోతే ఎప్పుడో రిలీజైన సినిమాకి రేటింగ్స్, రివ్యూలు పోస్ట్ చేయటానికి అవకాశం ఉంటుందే తప్ప, టికెట్స్ బుక్ చెయ్యలేం. ఆల్రెడీ థియేటర్లలో సినిమా రన్ అవుతుంటే మాత్రమే టికెట్స్ బుక్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. కాబట్టి ఇక్కడ యాప్ లో ఏదో టెక్నికల్ గ్లించ్ వల్ల అలా జరిగి ఉంటుందని, అందుకే 'కల్కి 2898 AD' ప్లేస్ లో రాజశేఖర్ 'కల్కి' ఇమేజ్ చూపించి ఉండొచ్చని కొందరు ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే, యాదృచ్చికంగా ప్రశాంత్ నీల్ 'కల్కి' సినిమా 2019 జూన్ 28న రిలీజైతే, ప్రభాస్ కల్కి జూన్ 27న విడుదల కాబోతోంది.