భర్త వల్లే సంతోషంగా ఉన్నా.. వీడియో రిలీజ్ చేసిన కల్పన
ఎక్కువ మోతాదులో స్లీపింగ్ పిల్స్ తీసుకోవడం వల్ల సింగర్ కల్పన అపస్మారక స్థితిలోకి వెళ్లిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 7 March 2025 10:44 AM ISTఎక్కువ మోతాదులో స్లీపింగ్ పిల్స్ తీసుకోవడం వల్ల సింగర్ కల్పన అపస్మారక స్థితిలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఆమె భర్త ప్రసాద్ వ్యాపార రీత్యా చెన్నై వెళ్లడంతో ఇంట్లో కల్పన ఒక్కరే ఉన్నారు. స్ట్రెస్ ఎక్కువగా ఉండటం వల్ల నిద్ర మాత్రలు తీసుకున్న ఆమె డోస్ ఎక్కువ అవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు.
తన ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానమొచ్చిన కల్పన భర్త ప్రసాద్, పక్కింటి వారిని చూడమనగా, అప్పటికే కల్పన స్పృహ కోల్పోయి ఉండటంతో పోలీసుల సహాయంతో ఆమెను దగ్గరలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం జాయిన్ చేశారు. దీంతో అందరూ కల్పన సూసైడ్ అటెంప్ట్ చేసిందనుకున్నారు. మెల్లిగా కోలుకుంటున్న కల్పన, అసలు జరిగిన విషయాన్ని ఓ వీడియో ద్వారా వెల్లడించారు.
మీడియాలో తన భర్తపై తప్పుడు ప్రచారం జరుగుతుందని, తనకు తన భర్తకు మధ్య ఎలాంటి గొడవలు లేవని, భర్త సహకారంతోనే తాను ఇప్పటికీ సంతోషంగా ఉన్నట్టు చెప్పిన కల్పన, తన భర్తపై మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ఆపాలని కోరారు. మీడియాలో తమ ఫ్యామిలీపై జరుగుతున్న ప్రచారం గురించి అందరికీ వివరణ ఇవ్వడానికే వీడియో చేస్తున్నట్టు కల్పన తెలిపారు.
తనకు 45 సంవత్సరాలనీ, ఈ వయసులో కూడా తాను ఎల్ఎల్‌బీ, పీహెచ్‌డీ చేస్తున్నానంటే దానికి తన భర్తే కారణమని, సంగీతంలో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవడానికి ఆయన ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటారని, ఓ వైపు స్టడీస్, మరోవైపు సింగింగ్, కాన్సర్టులతో ఎక్కువ ఒత్తిడికి గురయ్యానని, డాక్టర్ల సలహా మేరకు నిద్ర మాత్రలు వాడుతున్నానని కల్పన తెలిపారు.
ట్యాబ్లెట్స్ ఓవర్ డోస్ అవడం వల్ల స్పృహ తప్పి పడిపోయాను తప్పించి, తాను ఆత్మహత్య చేసుకోలేదని, తనకు జీవితంలో అందిన గొప్ప గిఫ్ట్ తన భర్త అని, ఆయన వల్లే తాను తనకు నచ్చిన అన్ని పనుల్ని చేయగలుగుతున్నానని చెప్పిన కల్పన, తనపై చూపిస్తున్న ప్రేమకు ఎంతో కృతజ్ఞురాలినని చెప్పిన ఆమె త్వరలోనే మరిన్ని మంచి పాటలతో ఆడియన్స్ ను అలరించనున్నట్టు తెలిపారు.