Begin typing your search above and press return to search.

కల్యాణ్ బాబాయ్.. థ్యాంక్యూ సో మచ్: అల్లు అర్జున్

అల్లు అర్జున్ సభాముఖంగా పవన్ కళ్యాణ్ కి థ్యాంక్స్ చెప్పడం, ఆయన్ని బాబాయ్ అని సంబోధించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

By:  Tupaki Desk   |   7 Dec 2024 3:16 PM GMT
కల్యాణ్ బాబాయ్.. థ్యాంక్యూ సో మచ్: అల్లు అర్జున్
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "పుష్ప 2: ది రూల్". రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వేటలో అస్సలు తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది. మొదటి రోజే ₹294 కోట్లు సాధించి, భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. రెండో రోజుల్లోనే ₹449 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక మూడో రోజు వసూళ్లను కలుపుకొని అత్యంత వేగంగా ₹500 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో మేకర్స్ శనివారం సాయంత్రం గ్రాండ్ గా సక్సెస్ మీట్ నిర్వహించారు.

'పుష్ప 2' వైల్డ్ ఫైర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఈ సినిమాకి పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో టికెట్ రేట్లు పెంచుకోడానికి అనుమతి ఇచ్చిన రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు థ్యాంక్స్ చెప్పారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పడం అందరి దృష్టిని ఆకర్షించింది. ''తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిగారు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిగారికి కృతజ్ఞతలు. ఈ సినిమాకి సపోర్ట్ గా నిలిచిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్యూ సో మచ్. ఫిలిం ఇండస్ట్రీకి మీరు స్పెషల్ ప్రయారిటీలు ఇస్తూ ఎల్లప్పుడూ సపోర్ట్ గా ఉంటారు. టికెట్ రేట్ల మీద స్పెషల్ జీవో పాస్ చేయడానికి కారణమైన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వ్యక్తిగతంగా చెప్పాలంటే కల్యాణ్ బాబాయ్ థ్యాంక్యూ సో మచ్. నిజంగా మీ నిర్ణయంతో మమ్మల్ని హత్తుకున్నారు. మంత్రి కందుల దుర్గేష్‌ గారికి కూడా ధన్యవాదాలు'' అని బన్నీ అన్నారు.

అల్లు అర్జున్ సభాముఖంగా పవన్ కళ్యాణ్ కి థ్యాంక్స్ చెప్పడం, ఆయన్ని బాబాయ్ అని సంబోధించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత కొన్నాళ్లుగా బన్నీ ఫ్యాన్స్, పవన్ అభిమానుల మధ్య ఓ రేంజ్ లో ఫ్యాన్ వార్స్ నడుస్తున్న సంగతి తెలిసిందే. బన్నీ 'చెప్పను బ్రదర్' అని పవన్ పేరు చెప్పని సందర్భం నుంచి, ఎన్నికల్లో నంద్యాల పర్యటన వరకూ ఈ గొడవ నడుస్తూనే ఉంది. అప్పటి నుంచే మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయని, ఇరు వర్గాల మధ్య దూరం బాగా పెరిగిందని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు 'పుష్ప 2' సక్సెస్ మీట్ లో కళ్యాణ్ బాబాయ్ అంటూ ప్రేమగా పిలిచి అల్లు అర్జున్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాడనే అనుకోవాలి.

ఇంకా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ''మాపై నమ్మకంతో సినిమాను నిర్మించి ఈ స్థాయికి తీసుకొచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్. నా నటనను ఎంత పొగిడినా ఆ పాత్రను డిజైన్‌ చేసింది సుకుమార్‌ గారే. నన్ను పై స్థాయిలో కూర్చొబెట్టారు. నేను ఈ మాటలు అహంకారంతో చెప్పటం లేదు. ఈ సినిమాని ఆదరించి ఇంత ప్రేమను చూపిస్తున్న ప్రేక్షకులు అందరికీ థ్యాంక్స్. ఎంత వసూలు చేసిందనే నంబర్ కూడా నాకు గుర్తు లేదు. ఎంత కలెక్ట్ చేసిందనేది పక్కన పెడితే, మొదటి రోజు ఈ సినిమా పట్ల మీరు కురిపించిన ప్రేమకు ఆ నంబర్ రిఫ్లెక్షన్ గా భావిస్తాను. పుష్పరాజ్ క్యారక్టర్ పట్ల మీరు చూపిస్తున్న అమితమైన ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి. దానికి అందరికీ థ్యాంక్యూ సో మచ్. ఒక మామూలు చిన్న ప్రాంతీయ చిత్ర పరిశ్రమగా ప్రారంభమై, ఈరోజు ఒక టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలవడం మాకే కాదు మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చాలా పెద్ద విషయం. తెలుగు ప్రజలు, తెలుగు ఇండస్ట్రీ తరపున అందరికీ కృతజ్ఞతలు. భాషతో సంబంధం లేకుండా ఆదరించిన ప్రతి ఒక్క ఇండస్ట్రీకి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ థ్యాంక్యూ సో మచ్'' అని అన్నారు

''సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన సంఘటన మమ్మల్ని కలిచి వేసింది. గత 20 ఏళ్లుగా నేను అక్కడకు వెళ్తున్నా. ఈసారి కూడా ఫ్యాన్స్ మధ్య సినిమా చూడాలని వెళ్లా. కొద్దిసేపటికే పరిస్థితి చేయిదాటిపోతోందని మా వాళ్ళు చెబితే సినిమా మధ్యలోనే వచ్చేశాను. రేవతి అనే మహిళ చనిపోయారని నెక్స్ట్ డే మార్నింగ్ నాకు తెలిసింది. ఆ న్యూస్ వినగానే నా మైండ్‌ బ్లాంక్‌ అయిపోయింది. ఏడెనిమిది గంటలు నా మనసులో అవే ఆలోచనలు. మేము సినిమా చేసేదే మీరు థియేటర్‌ కి వచ్చి చూస్తారని, అలాంటిది ఓ మహిళకు ఇలా జరగడం దురదృష్టకరం. 25 లక్షలు ఇస్తానని నేను చెప్పడం సాయం చేయడం కాదు. ఆ కుటుంబానికి అన్ని రకాలుగా తోడుగా ఉంటాం. వ్యక్తిగతంగా కూడా వెళ్లి వాళ్ళని కలుస్తా. వాళ్లు కోల్పోయిన వ్యక్తిని మేం తిరిగి తీసుకురాలేం. వాళ్ల పిల్లలకు తగిన సాయం చేస్తాం'' అని అల్లు అర్జున్‌ చెప్పుకొచ్చారు.