కామెడీ సినిమాలు చేయడానికి కారణమదే!
వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ మ్యాడ్ స్వ్కేర్ ను ఎంజాయ్ చేస్తున్నారని కళ్యాణ్ శంకర్ తెలిపారు.
By: Tupaki Desk | 31 March 2025 11:13 AMబ్లాక్ బస్టర్ మూవీ మ్యాడ్ కు సీక్వెల్ గా వచ్చిన మ్యాడ్ స్వ్కేర్ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించగా సూర్యదేవర హారిక, సాయి సౌజన్య జంటగా నిర్మించారు.
మ్యాడ్ స్వ్కేర్ థియేటర్లలో రిలీజైన మూడు రోజులకే వరల్డ్ వైడ్ గా రూ55.2 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సక్సెస్‌ఫుల్ గా దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో మ్యాడ్ స్వ్కేర్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ మీడియాతో మాట్లాడి తన ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. మ్యాడ్ స్వ్కేర్ తో డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తామని చెప్పిన మాటను తమ టీమ్ నిలబెట్టుకుందని, వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ మ్యాడ్ స్వ్కేర్ ను ఎంజాయ్ చేస్తున్నారని కళ్యాణ్ శంకర్ తెలిపారు.
మ్యాడ్ స్వ్కేర్ కు ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తుందనుకున్నాం కానీ ఈ రేంజ్ రెస్పాన్స్ అయితే అనుకోలేదని, మ్యాడ్ ఫుల్ రన్ కలెక్షన్స్ ను మ్యాడ్ స్వ్కేర్ మొదటి రోజే కలెక్ట్ చేసే రేంజ్ లో ఈ మూవీకి హైప్ ఉందని అసలు ఊహించలేదేని, మా సినిమాలో కథ ఉండదు, కేవలం నవ్వుకోవడానికి మాత్రమే రండి అని ఆడియన్స్ ను ముందు నుంచి ప్రిపేర్ చేయడం సినిమాకు చాలా కలిసొచ్చిందని కూడా కళ్యాణ్ శంకర్ చెప్పారు.
మ్యాడ్ స్వ్కేర్ ఫస్ట్ షో చూసిన వాళ్లు కొందరు సెకండాఫ్ డల్ అయిందన్నారు కానీ, తర్వాత షో ల నుంచి ఫస్ట్ హాఫ్ కంటే సెకండాఫ్ ఎక్కువ ఎంజాయ్ చేశామంటున్నారని చెప్పిన కళ్యాణ్ శంకర్, తన ఫ్రెండ్ తల్లి థియేటర్లో మూవీ చూసి 15 ఏళ్లవుతోందని, అలాంటావిడ మ్యాడ్ స్వ్కేర్ టీజర్ చూసి సినిమాకు తీసుకెళ్లమనిందని, సినిమా చూస్తూ నవ్వి నవ్వి కళ్లలో నీళ్లు తిరిగాయని చెప్పారని, అంత వయసున్న వాళ్లు కూడా తన సినిమా చూసి నవ్వుకున్నామని చెప్పడమే తనకు అందిన బెస్ట్ కాంప్లిమెంట్ అని శంకర్ తెలిపారు.
ఓవర్సీస్ లో మ్యాడ్ స్వ్కేర్ 1 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేయడం ఎంతో ఆనందాన్నిచ్చిందని, 1 మిలియన్ మార్క్ అంటే మాటలు కాదనే విషయం తనకు తెలుసని, అలాంటిది తన సినిమా తక్కువ టైమ్ లోనే ఆ ఫీట్ ను సాధించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని శంకర్ అన్నారు. దీంతో పాటూ తన తర్వాతి సినిమా విషయాలను కూడా కళ్యాణ్ షేర్ చేసుకున్నారు.
తన తర్వాతి సినిమాను రవితేజతో సూపర్ హీరో జానర్ లో చేయబోతున్నానని చెప్పిన కళ్యాణ్ శంకర్ ఆ సినిమా కూడా కామెడీ యాంగిల్ లోనే ఉంటుందని, సూపర్ హీరోకి ఓ మంచి బ్యాక్ స్టోరీ ఉంటుందని కాకపోతే రవితేజతో తాను చేయబోయే సినిమా పూర్తిగా ఫిక్షనల్ అని కళ్యాణ్ వెల్లడించారు. ఎలాంటి ఎమోషన్ ను అయినా ఎవరూ ఊహించని విధంగా చూపిస్తూ కన్విన్స్ చేయగలగడమే తన బలమని చెప్పిన కళ్యాణ్ శంకర్, ఈ మధ్య అందరిలో సీరియస్‌నెస్ పెరిగిపోయిందని, ప్రతీ చిన్న విషయానికీ ఫ్రస్ట్రేట్ అవుతున్నారని, అందుకే ఆడియన్స్ ను నవ్వించాలనే ఉద్దేశంతో కామెడీ సినిమాలే చేస్తున్నానని కళ్యాణ్ శంకర్ చెప్పారు.