'అల్లు అర్జున్‌లో రామ్ చరణ్ 0.001% కూడా కాదు'
సోషల్ మీడియాలో ఉండేవారికి కమల్ ఆర్ ఖాన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తనకు తాను ఫిలిం క్రిటిక్ గా చెప్పుకుంటూ, సినిమాలకు రివ్యూ ఇస్తుంటాడు.
By: Tupaki Desk | 7 Jan 2025 8:25 AM GMTసోషల్ మీడియాలో ఉండేవారికి కమల్ ఆర్ ఖాన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తనకు తాను ఫిలిం క్రిటిక్ గా చెప్పుకుంటూ, సినిమాలకు రివ్యూ ఇస్తుంటాడు. సెలబ్రిటీలను విమర్శించడమే పనిగా పెట్టుకుంటాడు. ఏవైనా పెద్ద సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయంటే చాలు, పని గట్టుకుని మరీ నెగిటివ్ కామెంట్లు చేస్తుంటాడు. లేటెస్టుగా 'గేమ్ ఛేంజర్' & 'సికిందర్' సినిమాలపై కేఆర్‌కే తన అక్కసు వెళ్లగక్కాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా సినిమా 'గేమ్ ఛేంజర్'. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కమల్ రషీద్ ఖాన్ ఎక్స్ లో ట్వీట్ చేస్తూ.. "ఒక జెండా లుక్ యాక్టర్ రామ్ చరణ్ నటించిన భోజ్‌పురి చిత్రం 'గేమ్ చేంజర్' జనవరి 10న విడుదల కానుంది. ఇది ఇప్పటికే రిలీజ్ కు ముందే డిజాస్టర్‌గా మారింది. ఐకాన్ మెగా సూపర్ స్టార్ అల్లు అర్జున్ లో రామ్ చరణ్ 0.001% కూడా లేడని జనవరి 10వ తేదీన అధికారికంగా రుజువవుతుంది" అని పేర్కొన్నాడు. దీనికి చరణ్, బన్నీలను ట్యాగ్ చేశాడు.
''కియారా అద్వానీ 'గేమ్ చేంజర్' చిత్రానికి సైన్ చేసినప్పుడే అది డిజాస్టర్ అవుతుందని చెప్పాను. కియారా దానిని అర్థం చేసుకోవడానికి 3 ఏళ్లు పట్టింది. ఇప్పుడు సినిమాను ప్రమోట్ చేయడానికి నిరాకరించింది. సినిమాపై వారికి ఉన్న అవగాహనకు ఇదే నిదర్శనం. వాళ్లంతా తుక్కేబాజ్" అని కమల్ ఆర్ ఖాన్ మరో పోస్ట్ పెట్టాడు. అంతకముందు ట్వీట్ లోనూ ఈ చిత్రాన్ని విమర్శించాడు. సినిమా డిజాస్టర్ అవుతుందని తెలిసే కియారా ప్రమోషన్స్ కు దూరంగా ఉంటోందని అన్నాడు.
"రామ్ చరణ్ తన 'గేమ్ చేంజర్' సినిమాని ప్రమోట్ చేయడానికి ఒబెరాయ్ మాల్ గోరేగావ్‌లో ప్రమోషనల్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హీరోయిన్ అద్వానీ కియారా నిరాకరించింది. దర్శకుడు శంకర్ కూడా ఈ ఈవెంట్ లో పాల్గొనడానికి నిరాకరించారు. ఎందుకంటే సినిమా డిజాస్టర్ అవుతుందని వాళ్లందరికీ బాగా తెలుసు" అంటూ కేఆర్‌కే పోస్ట్ పెట్టాడు. ఇదే క్రమంలో సల్మాన్ ఖాన్, మురగదాస్ కాంబోలో వస్తోన్న 'సికిందర్' సినిమాని కూడా విమర్శించారు.
"పర్ఫెక్ట్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా 'సికందర్'. సల్మాన్ ఖాన్ కు గత 7 సంవత్సరాలుగా హిట్ లేదు. ఏఆర్ మురుగదాస్ కు గత 8 సంవత్సరాలుగా హిట్ లేదు" అంటూ కమల్ ఆర్ ఖాన్ సెటైర్లు వేసాడు. అక్కడితో ఆగకుండా "దర్శకుడు ఏఆర్ మురుగదాస్ చివరగా మహేష్ బాబు, విజయ్, రజనీకాంత్ వంటి పెద్ద సూపర్ స్టార్లతో 'స్పైడర్', 'సర్కార్', 'దర్బార్' లాంటి మూడు పెద్ద డిజాస్టర్ చిత్రాలు తీశాడు. ఇప్పుడు సికందర్ అలియాస్ భగందర్ చేస్తున్నాడు" అంటూ మరో పోస్ట్ పెట్టాడు.
కమల్ ఆర్ ఖాన్ తనకు నచ్చని హీరోలు, వారి సినిమాలపై ఇలానే నెగిటివ్ ట్వీట్లు పెడుతుంటాడు కాబట్టి, నెటిజన్లు వీటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. అటెన్షన్ కోసమే 'గేమ్ చేంజర్', 'సికిందర్' సినిమాలను టార్గెట్ చేస్తూ ఇలాంటి చవకబారు పోస్టులు పెడుతున్నాడని ఎప్పటిలాగే ట్రోల్ చేస్తున్నారు. సినిమాలు హిట్టయితే అతనే సైలెంట్ అయిపోతాడని, కేఆర్‌కే పోస్టులను లైట్ తీసుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.