ఒక గజ దొంగ యాటిట్యూడ్ గురించి సినిమా
ఫిలింమేకింగ్, డిజిటల్ పరివర్తన, కథ చెప్పడం, ఆధునిక యుగంలో వినోదం, వ్యాపార విధానాలు వంటి చాలా అంశాలను ఇక్కడ చర్చించారు.
By: Tupaki Desk | 25 Feb 2025 3:41 AM GMT'నాయకన్' లాంటి కల్ట్ క్లాసిక్ విడుదలైన రెండు దశాబ్ధాలకు ఇప్పుడు విశ్వనటుడు కమల్ హాసన్- మణిరత్నం కలిసి థగ్ లైఫ్ అనే చిత్రానికి పని చేస్తున్నారు. ఈ చిత్రంలో సింబు, త్రిష, గౌతమ్ కార్తీక్, జోజు జార్జ్, ఐశ్వర్య లక్ష్మి, అభిరామి, నాజర్ తదితరులు నటిస్తున్నారు. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. థగ్ లైఫ్ 5 జూన్ 2025న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమాని సాంకేతికంగా అత్యుత్తమంగా తీర్చిదిద్దారని కథనాలొస్తున్నాయి. మణిరత్నం మార్క్ స్క్రీన్ ప్లే టెక్నిక్స్ ని దీనికోసం అనుసరించారు.
తాజాగా ఫిక్కీ సౌత్ కాన్ క్లేవ్ లో దక్షిణ భారత సినిమా అభివృద్ధి, ప్రపంచ మార్కెట్‌పై దాని ప్రభావాన్ని చర్చించడానికి ప్రముఖులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, ప్రముఖ నటుడు- దర్శక నిర్మాత కమల్ హాసన్ తదితరులు పాల్గొన్నారు. ఫిలింమేకింగ్, డిజిటల్ పరివర్తన, కథ చెప్పడం, ఆధునిక యుగంలో వినోదం, వ్యాపార విధానాలు వంటి చాలా అంశాలను ఇక్కడ చర్చించారు.
ఈ సమావేశంలో కమల్ హాసన్, త్రిష ప్రశ్నోత్తరాల విభాగంలో పాల్గొన్నారు. ప్రేక్షకుల నుండి ప్రశ్నలను ఎదుర్కొన్నారు. కమల్ హాసన్ ని మణిరత్నం `థగ్ లైఫ్`లో తన పాత్ర గురించి ప్రశ్నించారు. ఈ సినిమాలో కమల్ హాసన్ రంగరాజ్ శక్తివేల్ నాయకర్ అనే గజదొంగ పాత్రలో నటిస్తున్నారు.
ఈ పాత్ర మంచి చెడుల గురించి ప్రశ్నించగా, ``సినిమా చూసిన తర్వాతే మీకు అర్థమవుతుంది`` అని కమల్ చాలా డిప్లమాటిగ్గా స్పందించారు. ఎక్కువగా రివీల్ చేసేస్తే దర్శకుడు మణిరత్నం తనను క్వశ్చన్ చేస్తారని కమల్ అన్నారు. నేను ఎడిటింగ్ ప్రక్రియతో ఇబ్బంది పడుతున్నాను. మీరు (మీడియా) ఇప్పటికే మొత్తం కథను ప్రజలకు చెప్పేసారు! అని అన్నారు. ఈ పాత్ర మంచి, చెడు రెండింటి మిశ్రమం అని కమల్ అన్నారు. రంగరాజ్ శక్తివేల్ ధృక్పథం ఏమిటన్న దానిపైనా కథ అంతా ఆధారపడి ఉంటుందని కూడా చెప్పారు.