అమెరికాలో AI స్టడీ పూర్తి చేసిన కమల్ హాసన్
భారతీయ సినిమాకి విరివిగా సాంకేతికతను పరిచయం చేసిన స్టార్లలో విశ్వనటుడు కమల్‌హాసన్ పేరు అగ్రపథాన నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
By: Tupaki Desk | 1 Feb 2025 4:21 AM GMTభారతీయ సినిమాకి విరివిగా సాంకేతికతను పరిచయం చేసిన స్టార్లలో విశ్వనటుడు కమల్‌హాసన్ పేరు అగ్రపథాన నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కథానాయకుడిగానే కాకుండా దర్శక నిర్మాతగాను కమల్ హాసన్ చాలా ప్రయోగాలు చేసారు. తన సినీజీవితంలో సంపాదించినదంతా తిరిగి ఏదో ఒక రూపంలో సినిమాకే పెట్టుబడిగా పెట్టానని ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో అన్నారు. మారుతున్న సాంకేతికతను ఒడిసిపట్టుకునేందుకు తాను ఎల్లపుడూ ప్రయత్నిస్తానని తెలిపారు.
ప్రస్తుతం కమల్ హాసన్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మణిరత్నంతో థగ్ లైఫ్, శంకర్ తో ఇండియన్ 3, నాగ్ అశ్విన్ తో `కల్కి 2` చిత్రీకరణలు పూర్తి చేయాల్సి ఉండగా, దర్శకుడు అన్బరివు తో ప్రాజెక్ట్ ను ప్రకటించారు. వీటిలో శంకర్ దర్శకత్వం వహిస్తున్న `ఇండియన్ 3` చిత్రీకరణ ముగింపు దశలో ఉండగా, థగ్ లైఫ్ షూటింగ్ దాదాపు సగం పూర్తయిందని సమాచారం. కల్కి 2898 ఏడి సీక్వెల్ చిత్రీకరణ గురించి సరైన సమాచారం రావాల్సి ఉంది.
ఇదిలా ఉండగానే, కమల్ హాసన్ సెప్టెంబర్ లో AI కోర్సు ప్రారంభించడానికి అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఏఐని బాగా అధ్యయనం చేయడానికి, సినీరంగంలో దాని ఉపయోగాన్ని అర్థం చేసుకోవడానికి వెళ్ళాడని, ఆ తర్వాత తన సినిమాలకు తేదీల్లో మార్పు చేర్పులను చేస్తారని కథనాలొచ్చాయి. అబుదాబిలో ఓ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ మాట్లాడుతూ.. తనకు మారుతున్న సాంకేతికతపై ఉన్న ఆసక్తి గురించి ప్రస్థావించారు.
''నాకు కొత్త టెక్నాలజీపై లోతైన ఆసక్తి ఉంది.. నా సినిమాలు తాజా సాంకేతిక పరిణామాలతో ప్రయోగాలు చేయడం మీరు రెగ్యులర్ గా చూస్తుంటారు. సినిమా నా జీవితం. నా సంపాదన అంతా వివిధ మార్గాల ద్వారా నా సినిమాల్లోకి తిరిగి పోయింది. నేను కేవలం నటుడిని కాదు.. నిర్మాతను కూడా.. సినిమాలతో సంపాదించిన ప్రతిదాన్ని పరిశ్రమలో తిరిగి పెట్టుబడి పెడతాను..'' అని కమల్ హాసన్ అన్నారు.
ఏఐతో కమల్ ప్రయోగశాల:
ఐదు నెలలుగా అమెరికాలో కృత్రిమ మేధస్సు(ఏఐ)పై అధ్యయనం చేసిన తర్వాత కమల్ హాసన్ చెన్నైకి తిరిగి వచ్చి తన తదుపరి ప్రాజెక్టుల గురించి తాజా అప్‌డేట్ అందించారు. ముందుగా మణిరత్నంతో `థగ్ లైఫ్` గురించి మాట్లాడారు. చెన్నై మీడియాతో మాట్లాడుతూ.. థగ్ లైఫ్ జూన్ 5న థియేటర్లలోకి వస్తుందని కమల్ ధృవీకరించారు. `విక్రమ్ 2` సినిమా గురించి ప్రశ్నించగా, తాను కొత్త స్క్రిప్ట్ రాయడం పూర్తి చేశానని, దర్శకుడు అన్బరివుతో కలిసి పనిచేయబోతున్నానని వెల్లడించాడు. దీనిని బట్టి విక్రమ్ 2 పై దర్శకుడు లోకేష్ కనగరాజ్ అప్ డేట్ చెప్పాల్సి ఉంటుందని అర్థమవుతోంది.