Begin typing your search above and press return to search.

విశ్వనటుడు.. ఒక్క వీడియోలో 27 రకాల ఎమోషన్స్!

ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి, కేవలం తన హావభావాలతోనే ప్రేక్షకుల మనసులను కట్టిపడేస్తారు కమల్

By:  Tupaki Desk   |   26 July 2024 8:12 PM GMT
విశ్వనటుడు.. ఒక్క వీడియోలో 27 రకాల ఎమోషన్స్!
X

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఆరేళ్ళ ప్రాయంలోనే బాల నటుడిగా తెరంగేట్రం చేసిన ఆయన, గత ఆరు దశాబ్దాలుగా విభిన్నమైన సినిమాలు విలక్షణమైన పాత్రలతో సినీ అభిమానులను అలరిస్తున్నారు. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి, కేవలం తన హావభావాలతోనే ప్రేక్షకుల మనసులను కట్టిపడేస్తారు కమల్. నవరసాలను అద్భుతంగా పండించడంలో, ఎమోషన్స్‌ పలికించడంలో తనకు సాటిలేరు అనిపించుకున్నారు. ఆయన ఎంత గొప్ప నటుడో చెప్పే ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బర్కిలీ కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రకారం 27 విభిన్న రకాల భావోద్వేగాలు ఉన్నాయి. కమల్ హాసన్ వివిధ సినిమాల్లో ఈ ఇరవై ఏడు రకాల ఎమోషన్స్ ను పలికించారు. వీటన్నిటినీ కట్ చేసి ఓ నెటిజన్ ఒక వీడియోగా ఎడిట్ చేసారు. ఉల్లాసం, ఆనందం, భయం, గందరగోళం, ఆందోళన, బాధ, భావోద్రేకం, అసూయ.. ఇలా పలు రకాల భావోద్వేగాలను కమల్ కేవలం తన కళ్లతోనే అద్భుతంగా పండించారు. ఇది చూసిన నెటిజన్లు అందుకే ఆయన విశ్వనటుడు, లోకనాయకుడు అయ్యారని కామెంట్స్ చేస్తున్నారు. నటనలో ఆయనొక యూనివర్సిటీ అని, నేటి తరం నటీనటులందరూ ఆయన్నుంచి ఎంతో నేర్చుకోవాలని సూచిస్తున్నారు.

యాక్టర్ గా 64 ఏళ్ళ సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న కమల్ హాసన్.. ఇప్పటి వరకూ 230కి పైగా సినిమాల్లో నటించారు. 'అంతులేని కథ' సినిమాతో తొలిసారిగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. 'మరో చరిత్ర' 'ఇది కథ కాదు' 'ఆకలి రాజ్యం' 'భామనే సత్య భామనే' 'పుష్పక విమానం' 'ఇంద్రుడు చంద్రుడు' 'స్వాతి ముత్యం' 'సాగర సంగమం' 'శుభ సంకల్పం' 'భారతీయుడు' 'దశావతారం' 'విశ్వరూపం'.. ఇలా ఎన్నో ఆణిముత్యాలాంటి చిత్రాల్లో నటించారు. 70 ఏళ్ళ వయసులోనూ కమల్ ఇప్పటికీ ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నారు. నటుడిగా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

'విక్రమ్' సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుని స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు కమల్ హాసన్. ఇటీవల సంచలన విజయం సాధించిన 'కల్కి 2898 AD' మూవీలో సుప్రీమ్ యాస్కిన్ గా అదరగొట్టారు. సినిమాలో ఆయన కనిపించింది తక్కువ సేపే అయినా, ఎంతో ఇంపాక్ట్ చూపించారు. 'కల్కి 2'లో కమల్ పాత్ర కీలకంగా ఉంటుందని మేకర్స్ ఇప్పటికే స్పష్టం చేసారు. రీసెంట్ గా 'భారతీయుడు 2' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్లాప్ అయినప్పటికీ సేనాపతి పాత్రలో తన మార్క్ చూపించారు. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో 'థగ్ లైఫ్' అనే మూవీ చేస్తున్నారు. వచ్చే ఏడాది 'ఇండియన్ 3' సినిమా విడుదల కానుంది.