మనలో మన మాట: కల్కి లైన్ యశోద నుంచి తీసుకున్నారా?
బాలీవుడ్.. టాలీవుడ్.. మాలీవుడ్.. ఇలా వుడ్ ఏదైనా ‘కల్కి 2898ఏడీ’ మూవీ హాట్ టాపిక్ గా మారింది
By: Tupaki Desk | 30 Jun 2024 5:30 PM GMTబాలీవుడ్.. టాలీవుడ్.. మాలీవుడ్.. ఇలా వుడ్ ఏదైనా ‘కల్కి 2898ఏడీ’ మూవీ హాట్ టాపిక్ గా మారింది. రికార్డు కలెక్షన్లతో బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. గడిచిన కొంతకాలంగా నిశ్శబ్ధంగా.. నిస్తేజంగా ఉన్న సినిమా ఇండస్ట్రీలో ఈ మూవీ బజ్ తో కొత్త ఉత్సాహం పొంగిపొర్లుతోంది. చెప్పాలనుకున్న కథను సరైన రీతిలో చెప్పాలే కానీ.. వందలాది కోట్లు ఖర్చు చేసినా.. ఇట్టే తిరిగి వచ్చేస్తాయన్న భరోసాను మరోసారి ఫ్రూవ్ చేసింది కల్కి.
ఈ సినిమా గురించి కథలు కథలుగా ఇప్పుడు చెప్పుకుంటున్నారు. కలెక్షన్లు మొదలు సినిమాలోని పలు పాయింట్లను ఆసక్తికర చర్చ జరుగుతోంది. అదే సమయంలో పార్టు2 ఎప్పుడు? దీనికి సంబంధించిన షూటింగ్ ఎంతవరకు వచ్చింది? లాంటి ప్రశ్నలు ఇప్పుడు హాట్ చర్చగా మారాయి. తాజాగా ఈ చిత్ర నిర్మాణ సంస్థకు పెద్దతలకాయ అశ్వినీదత్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రెండో పార్టుకు సంబంధించి 60 శాతం షూటింగ్ పూర్తైనట్లుగా పేర్కొన్నారు. దీంతో.. మిగిలిన 40 శాతం షూట్ ఎప్పుడు? సినిమా రిలీజ్ ఎప్పుడన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే.. ఈ మూవీ విడుదలైన మూడో రోజు నుంచి ఈ సినిమాకు సంబంధించి ఒక కొత్త చర్చ షురూ అయ్యింది. కల్కి సినిమా మూలకథ ఏమిటన్నది చూస్తే.. తాను ఇచ్చిన ఫార్ములాను అమ్మాయిల గర్భంలో 90 రోజులకు మించి ఉన్న వారి కోసం చూడటం.. సాధ్యం కాకపోతే వారి నుంచి సీరంను ఎక్స్ ట్రాక్ట్ చేసి.. వారిని బూడిద చేసేయటం.. ఆ సీరంను సుప్రీం యాస్కిన్ తీసుకోవటం.. తన శక్తిని పెంచుకోవటం చేస్తుంటారు.
ఈ క్రమంలో సుమతి కడుపులో అంచనాలకు మించిన గర్భం నిలవటం.. దాన్ని ఆమె గుట్టుగా దాచి ఉంచుతుంది. ఆ విషయం సుప్రీం యాసిన్ టీంకు తెలిసి.. ఆమె గర్భం నుంచి సీరంను ఎక్స్ ట్రాక్ట్ చేసే వేళలో.. ఒక్క చుక్కను మాత్రమే తీసుకోగలుగుతారు. అక్కడ భారీ పేలుడు చోటు చేసుకోవటం.. సుమతి తప్పించుకోవటం చూపిస్తారు. ఇదంతా చూసినప్పుడు.. కాస్త ఆలస్యంగా గుర్తుకు వచ్చిన సినిమా సమంత లీడ్ రోల్ ప్లే చేసిన యశోద మూవీ చప్పున గుర్తుకు రాకమానదు.
ఈ సినిమాలోనూ తన అందాన్ని కాపాడుకోవటం కోసం గర్భవతుల నుంచి సీరంను ఎక్స్ ట్రాక్టు చేసి.. దాని ద్వారా తన అందాన్ని కాపాడుకోవటం.. ఆ తర్వాత గర్భవతులను మాయం చేయటం.. ఈ సీక్రెట్ ను యశోద బ్రేక్ చేయటం కనిపిస్తోంది. మొత్తం సినిమాలోని కీలకమైన పాయింట్ ను పట్టుకున్న నాగీ.. దానికి పురాణాలు.. సైన్సును అద్భుతంగా ముడివేసి.. కల్కిని రాసుకున్నాడా? అన్నది ఇప్పుడు తాజా వాదన. ఇందులోని పాయింట్లు ఎంతవరకు నిజమన్నది పక్కన పెడితే.. యశోదాలోని మూలకథలోని పాయింట్.. కల్కిలోని కీలకమైన పాయింట్ ఒకే రకంగా ఉండటం అనుకోకుండా జరిగిన కో ఇన్సిడెంట్ అనుకుందామా? లేదంటే ఆ పాయింట్ ను స్ఫూర్తిగా తీసుకొని తనదైన శైలిలో కథ రాసుకున్నారా? అన్నదిప్పుడు చర్చగా మారింది.