DMKతో పొత్తు వెనుక కమల్‌హాసన్ ఉద్ధేశం?
సినీ నటుడు కమలహాసన్ అధికార డీఎంకే పార్టీలో ఎందుకు చేరుతున్నారు? అతని ఉద్దేశం ఏమిటి? అంటే దీనికి ఎవరికి వారు రకరకాల ఊహాగానాలు సాగిస్తున్నారు
By: Tupaki Desk | 13 March 2024 5:58 PM GMTసినీ నటుడు కమలహాసన్ అధికార డీఎంకే పార్టీలో ఎందుకు చేరుతున్నారు? అతని ఉద్దేశం ఏమిటి? అంటే దీనికి ఎవరికి వారు రకరకాల ఊహాగానాలు సాగిస్తున్నారు. ఇలా అయితే అతడు ముఖ్యమంత్రి అయ్యేదెప్పుడు? అంటూ కొందరు సెటైర్లు కూడా వేస్తున్నారు.
కమల్ హాసన్ 2018లో ఎంజీఆర్ లాగా సీఎం కావాలనే కలతో రాజకీయాల్లోకి వచ్చారు. తమిళనాడు రాజకీయాల్లో లబ్ధ ప్రతిష్ఠులైన జయలలిత, కరుణానిధి పోయినందున సులువుగా పనవుతుందని ఆయన భావించి ఉండవచ్చు. అయితే 2021లో కోయంబత్తూరులో తన మొదటి అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి వనతీ శ్రీనివాసన్ తో పోటీపడి సీటు ఓడిపోవడంతో అతడి కలలు చెదిరిపోయాయి. ఆయన పార్టీకి 2.62 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అప్పుడు అతడి పేలవమైన నాయకత్వాన్ని నిందిస్తూ పార్టీ సభ్యులు భారీగా వలస వెళ్లారు.
2022లో కమల్ హాసన్ చిత్రం 'విక్రమ్' 400 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాత అతని దృష్టి సినిమాల వైపు మళ్లింది. ఇప్పుడు తన కోసం ఎమ్మెల్యే సీటు గెలవాలని, తన పార్టీకి కొన్ని సీట్లు రావాలని ఆయన కోరుకుంటున్నారు. అందుకే 2026లో ఎమ్మెల్యే అయ్యే అవకాశాలను పెంచుకునేందుకు ఆయన డీఎంకేలో చేరవచ్చని ఊహాగానాలు సాగిస్తున్నారు. రాజకీయాలు నామమాత్రంగా కొనసాగినా, ఆయన ప్రధాన దృష్టి సినిమాలపైనే ఉంటుందని విశ్లేషిస్తున్నారు.
కమల్ హాసన్ ప్రస్తుతం నటుడిగా ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రభాస్ 'కల్కి' చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. తదుపరి లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ 2లో నటిస్తాడు. కనగరాజ్ చిత్రంలో శృతి హాసన్ - కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో కనిపించే వీలుందని టాక్ ఉంది. కమల్ హాసన్ ప్రొడక్షన్ హౌస్ రాజ్ కమల్ ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అలాగే మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ లోను కమల్ హాసన్ నటిస్తున్నారు. పలువురు దర్శకులు వినిపించిన కథల్ని కమల్ ఫైనల్ చేసారు. అందువల్ల ఎమ్మెల్యే అయినా కానీ, సినీ కెరీర్ పరంగా అతడు క్షణం తీరిక లేకుండా బిజీగా గడిపేస్తారని సమాచారం.