Begin typing your search above and press return to search.

క‌మ‌ల్‌హాస‌న్‌కి స్టార్‌డ‌మ్ ఇచ్చిన ఇండ‌స్ట్రీ?

ఈ సందర్భంగా క‌మ‌ల్ హాస‌న్ తెలుగు సినిమాతో తనకున్న అనుబంధం గురించి, తన స్టార్‌డమ్‌ని సృష్టించడంలో దాని పాత్ర గురించి చెప్పాడు.

By:  Tupaki Desk   |   9 July 2024 3:10 PM GMT
క‌మ‌ల్‌హాస‌న్‌కి స్టార్‌డ‌మ్ ఇచ్చిన ఇండ‌స్ట్రీ?
X

న‌టుడిగా ఆరు ద‌శాబ్ధాల కెరీర్‌లో ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించిన విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ఇప్పుడు మ‌రోసారి ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌తో అల‌రించేందుకు థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్నారు. 1996 బ్లాక్ బ‌స్ట‌ర్ భార‌తీయుడుకి అధికారిక సీక్వెల్ అయిన భార‌తీయుడు 2 లో సేనాప‌తిగా తిరిగి న‌టించారు. త్వ‌ర‌లో విడుద‌ల సంద‌ర్బంగా ప్రమోషన్ కోసం క‌మ‌ల్ హైదరాబాద్ ఈవెంట్ కి హాజరయ్యారు. ఈ సందర్భంగా క‌మ‌ల్ హాస‌న్ తెలుగు సినిమాతో తనకున్న అనుబంధం గురించి, తన స్టార్‌డమ్‌ని సృష్టించడంలో దాని పాత్ర గురించి చెప్పాడు.

మీడియాతో కమల్ హాసన్ మాట్లాడుతూ- ''నా అసలు స్టార్ డమ్ ఆంధ్రాలో, తెలుగు సినిమాల్లో మొదలైంది. చాలా సినిమాలు చేస్తున్నా ఆ బ్రేక్ రాలేదు. ఇది మరో చరిత్ర (1978) ద్వారా వచ్చింది. అక్కడి నుంచి నా తెలుగు రికార్డు నిష్కళంకమైంది.మలయాళం, హిందీ సినిమాలతో పోల్చితే, తన తెలుగు సినిమా రికార్డుల్లో తాను చాలా అదృష్టవంతుడిని'' అని చెప్పారు.

ఆకలి రాజ్యం, ఇంద్రుడు చంద్రుడు లాంటి సినిమాలు చేసాను. కె విశ్వనాథ్‌తో చాలా సినిమాలు చేశాను. నేను సరైన వ్యక్తులను కలిశాను.. అని క‌మ‌ల్ హాస‌న్ తెలిపారు. ఆయ‌న‌ చివరి తెలుగు చిత్రం 1995లో విడుదలైన శుభ సంకల్పం. గత కొన్నేళ్ల‌లో తమిళం, తెలుగు రెండింటిలో విడుదలైన తూంగవనం, ఈనాడు వంటి ద్విభాషా చిత్రాలలోను క‌మ‌ల్ హాస‌న్ న‌టించి మెప్పించారు. కె విశ్వ‌నాథ్ తెర‌కెక్కించిన సాగర సంగ‌మం, శుభ సంక‌ల్పం త‌న‌కు న‌టుడిగా గొప్ప పేరును తెచ్చి పెట్టాయి. జాతీయ పుర‌స్కారాల‌ను అందించాయి.