Begin typing your search above and press return to search.

కమల్ హాసన్.. ఇండియన్ 2 రెమ్యునరేషన్ ఎంత?

యూనివర్శల్ యాక్టర్ కమల్ హాసన్ తాజాగా ఇండియన్ 2 మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.

By:  Tupaki Desk   |   13 July 2024 4:46 AM GMT
కమల్ హాసన్.. ఇండియన్ 2 రెమ్యునరేషన్ ఎంత?
X

యూనివర్శల్ యాక్టర్ కమల్ హాసన్ తాజాగా ఇండియన్ 2 మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. శంకర్ దర్శకత్వంలో 1996లో వచ్చిన ఇండియన్ కి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కింది. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. జూలై 12న రిలీజ్ అయిన ఇండియన్ 2 సినిమాకి మిశ్రమ రివ్యూలు వచ్చాయి. విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కమల్ హాసన్ నుంచి వచ్చిన మూవీ కావడంతో ఫాన్స్ కాస్త ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు.

అలాగే శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన ఇండియన్ సినిమాకి సీక్వెల్ కావడం కూడా ఇండియన్ 2 పైన హైప్ పెరిగింది. నిజానికి ఈ సినిమాని 2017లో శంకర్ అనౌన్స్ చేశారు. తర్వాత కొంతకాలం షూటింగ్ కూడా జరిగింది. అయితే ఏవో కారణాలవల్ల మధ్యలో ఆగిపోయింది. మరల 2022లో తిరిగి ఈ సినిమా రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేశారు. 28 ఏళ్ల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ మూవీకి సీక్వెల్ అనే హైప్ తప్ప ఇండియన్ 2 పెద్దగా జనాల్లోకి వెళ్ళలేదు అని చెప్పాలి.

అయితే శంకర్ ఇండియన్ 2 తో పాటు ఇండియన్ 3 కూడా కంప్లీట్ చేశాడంట. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. ఇండియన్ 2 రిలీజ్ అయిన ఆరు నెలల తర్వాత ఇండియన్ 3 థియేటర్స్ లోకి వస్తుందని నిర్ధారించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా రెండు భాగాలకు కలిపి 500 కోట్ల వరకు బడ్జెట్ అయినట్లు కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది. ఒక్కో పార్ట్ మీద 250 కోట్ల బడ్జెట్ పెట్టారంట.

కమల్ హాసన్ రెండు భాగాలకు కలిపి 150 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఒక్కో పార్ట్ కోసం 75 కోట్ల వరకు చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. ఓ విధంగా కమల్ హాసన్ కెరియర్ లోని హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఇండియన్ సిరీస్ కోసం తీసుకున్నారని దీనిని బట్టి చెప్పొచ్చు. విక్రమ్ సినిమా కోసం 50 కోట్లు ఛార్జ్ చేశారు. కల్కి మూవీలో నెగిటివ్ రోల్ కోసం 20 కోట్ల వరకు ఇచ్చారు. ఇదిలా అనే ఇప్పుడు ఇండియన్ 2 రిజల్ట్ చూస్తే తేడా కొట్టేలా కనిపిస్తోంది. అదే జరిగితే నిర్మాతకు భారీ నష్టాలు తప్పవని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే లైకా ప్రొడక్షన్స్ కి పొన్నియన్ సెల్వన్ సిరీస్ తో పాటు, లాల్ సలామ్ సినిమాకు భారీ నష్టాలు వచ్చినట్లుగా కోలీవుడ్ సర్కిల్ లో ప్రచారం నడుస్తోంది. ఇప్పుడు ఇండియన్ 2 ఫలితం తేడా కొడితే కచ్చితంగా హెవీ డ్యామేజ్ జరగడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. ఇక కమల్ హాసన్ చేతిలో కల్కి 2898 ఏడీ, థగ్ లైఫ్ సినిమాలు ఉన్నాయి. మణిరత్నం దర్శకత్వంలో సుమారు మూడు దశాబ్దాల తర్వాత థగ్ లైఫ్ సినిమా కమలహాసన్ చేస్తున్నారు.