ప్రోస్తటిక్స్ మేకప్ నేర్చుకునేందుకు కమల్ సాహసాలు
నిజానికి ప్రభాస్ బాహుబలి 2తో 1000 కోట్ల క్లబ్ హీరో కాక ముందే కమల్ హాసన్ వేల కోట్ల వసూళ్లను సాధించిన హాలీవుడ్ సినిమాలకు పని చేసారు.
By: Tupaki Desk | 24 Oct 2023 7:14 AM GMTకమల్ హాసన్ డ్రీమ్ ప్రాజెక్ట్ మరుదనాయగం గురించి ఇప్పటికీ చర్చ సాగుతూనే ఉంది. ఒక భారతీయ చిత్రంలో టైటానిక్ హీరోయిన్ కేట్ విన్స్‌లెట్ నటించారనేది మరవలేనిది. మరుదనాయగం రిలీజ్ అయి ఉంటే ఇది చాల మందికి తెలిసేది. కానీ అందుకు ఆస్కారం లేదు. ఇక కమల్ ప్రయోగాత్మక ఆలోచనలకు ఈ చిత్రం ఒక ఉదాహరణ మాత్రమే. ప్రతిసారీ ఏదో ఒక ప్రత్యేకమైన సినిమా మేకింగ్ చేయాలనే స్వచ్ఛమైన అభిరుచితో కమల్ ఎలా అభివృద్ధి చెందారో మనకు ఇప్పటికే తెలుసు. కమల్ ఇంతకుముందే సిల్వెస్టర్ స్టాలోన్‌తో కలిసి పనిచేసాడనేది తెలిసిన వారు తక్కువమంది.
నిజానికి ప్రభాస్ బాహుబలి 2తో 1000 కోట్ల క్లబ్ హీరో కాక ముందే కమల్ హాసన్ వేల కోట్ల వసూళ్లను సాధించిన హాలీవుడ్ సినిమాలకు పని చేసారు. స్టార్ ట్రెక్ కి నటుడిగా కాకుండా కమల్ కి మేకప్ విభాగంలో ఆఫర్ వచ్చింది. సిల్వెస్టర్ స్టాలోన్ రాంబో 3 సెట్స్‌లో మేకప్ ఆర్టిస్ట్‌గా కమల్ హాలీవుడ్‌కి వెళ్లారు. 90వ దశకంలో కమల్ ఈ ప్రయోగం చేసారు. అతడు హాలీవుడ్ కి వెళ్లడానికి ప్రత్యేక కారణం ఉంది. మేకప్ విభాగంలో ప్రోస్తెటిక్స్ ఎలా పనిచేస్తుందనే దాని గురించి చాలా తెలుసుకోవాలనే తపనతో కమల్ ఆరోజుల్లోనే స్టాలోన్ సినిమాకి, అలాగే స్టార్ ట్రెక్ కి పని చేసారు.
`రాంబో 3` సెట్లో అకాడమీ అవార్డు విజేత మేకప్ ఆర్టిస్ట్ మైఖేల్ వెస్ట్‌మోర్ వద్ద కమల్ శిక్షణ పొందాడు. అది కమల్ జీవితంలో కీలక పరిణామం. ఎందుకంటే హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ మైఖేల్.. భారతీయ నటుడు కమల్ హాసన్ కెరీర్‌ను ఈ రోజు ఈ స్థాయికి ఎదిగేందుకు రూపకర్తగా కీలక పాత్ర పోషించాడు. రాంబో 3 చిత్రానికి పనిచేసిన తర్వాత, కమల్ హాసన్ స్టార్ ట్రెక్‌కి పని చేసారు. ఈ సినిమా సెట్స్ లోను మళ్లీ మేకప్ విభాగంలో మైఖేల్‌తో కలిసి పనిచేశారు. ఈ చిత్రం ఉత్తమ మేకప్ విభాగంలో అకాడమీ అవార్డుకు నామినేట్ అయింది. కానీ గెలవలేకపోయింది.
కమల్ హాసన్ ప్రొస్తెటిక్స్ గురించి తెలుసుకోవడానికే వెళ్లాలా? అంటే... దానికి కారణం సహేతుకం. ఏ నటుడూ సెట్లో పని అయిపోయాక తన చేతులు దులిపేసుకోకూడదని.. అన్ని విభాగాల్లో పట్టు సాధించడం ద్వారా మాత్రమే భారతీయ చలనచిత్ర పరిశ్రమలో విప్లవాత్మక మార్పుల్ని తీసుకురాగలనని అతడు బలంగా నమ్మాడు. అతడి అభిరుచి ఇంతటివాడిని చేసింది. హాలీవుడ్ సినిమాలకు పని చేసి తిరిగి వచ్చిన వెంటనే కమల్ తిరిగి నటుడిగా పని చేసారు. సినిమాల్లో తన మేకప్ టెక్నిక్స్ ని అమలు చేయడం ప్రారంభించాడు. అవ్వై షణ్ముగి, భారతీయుడు, దశావతారం సహా మరెన్నో చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలకు మేకప్ సమర్థంగా పని చేయడానికి అతడే కారకుడయ్యాడు.
సిల్వెస్టర్ స్టాలోన్ స్టైలింగ్ గురించి గతంలో ఓసారి కపిల్ శర్మ షోలో కమల్ హాసన్ చాలా విషయాలను వెల్లడించారు. `నేను తెరవెనక విభాగాల్లో పని చేయాలనుకున్నాను. నేను మిస్టర్ స్టాలోన్ ముఖంపై అన్ని బంప్‌లతో మేకప్ చేసాను. నేను అప్పుడు మేకప్ నేర్చుకుంటున్నాను. నెలన్నర పాటు అక్కడే ఉండి ప్రొస్తెటిక్ మేకప్ నేర్చుకున్నాను. నేను ఈ ప్రత్యేక కళను నేర్చుకోవాలనుకున్నాను. ఎందుకంటే ఎవరూ దానిని నేర్చుకోలేదు. నేనెవరికీ తెలియనందున ఈ ప్రాసెస్ చాలా ఆనందం కలిగించింది.. నేను దుకాణాల వద్ద ఆగి, శీతల పానీయాలు తాగాను.. వీధిలో నడిచాను`` అని కూడా తెలిపారు.
కమల్ హాసన్ ఇప్పటికీ మేకప్ విభాగంలో అత్యధిక నామినేషన్లు సాధించిన నటుడిగా రికార్డును సాధించాడు. మైఖేల్ వెస్ట్‌మోర్ కుమార్తె, మెకెంజీ వెస్ట్‌మోర్.. కమల్‌తో సత్సంబంధాలను, అతడిని తండ్రిగా ఎలా పరిగణిస్తుందో కూడా ఓ సందర్భంలో వెల్లడించారు. ``నేను చిన్న అమ్మాయిగా ఉన్నప్పుడు మా నాన్న తన మేకప్ పనిలో ఉండేవారు. ఆ తర్వాత కమల్ హాసన్ పరిచయం అయ్యారు. మేం టచ్‌లో ఉంటాం కానీ కమల్‌ని నేను చివరిసారిగా చూసింది కొన్నేళ్ల క్రితం`` అని తెలిపారు. కమల్ హాసన్ తో కలిసి ఉన్నప్పటి ఫోటోలను ఆమె షేర్ చేసారు. మొత్తానికి కమల్ హాసన్ గొప్ప స్టార్ అయినా కానీ మేకప్ విద్యలో ప్రావీణ్యం కోసం చాలా సాహసాలే చేసారు.